Home తాజా వార్తలు రక్తమోడుతున్న రోడ్లు

రక్తమోడుతున్న రోడ్లు

Accidents in Telanganaమూడు రోజుల్లో 20మంది మృతి
ప్రమాదాలపై ప్రభుత్వం సీరియస్
రోడ్ సేఫ్టీ విభాగం పనితీరుపై ఆరా..!

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాలలో మూడు రోజుల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 20 మంది మృత్యువాత పడగా మరో 30మంది తీవ్రగయాలపాలయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తమ్మర గ్రామంలోని రామాలయంలో శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొని ఆటోలో తిరుగు ప్రయాణమైయ్యారు. ఖమ్మం వైపు నుంచి కోదాడ వైపుగా ఆటలో వెళ్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్న సిమెంట్ లారీ ఆటోను ఢికొట్టడంతో అక్కడి కక్కడే 5 గురు మృతి చెందారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు మహిళలు మృతి చెందారు.

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం కోమటికుంట సమీపంలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పడంతో 18మంది గాయాలపాలయ్యారు. కాగా ఈ ప్రమాదంలో గాయపడిన వారు హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లికి చెందిన వారిగా గుర్తించారు. తిరుపతి నుంచి శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుందని, ప్రమాదంలో గాయపడిన వారిలో ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇదిలావుండగా రోడ్డు ప్రమాదాలపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నివారణకు రోడ్ సేఫ్టీ పనితీరుపై నివేదిక సమర్పించాలని సర్కారు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. కాగా జాతీయ రహదారులలో ఇంజినీరింగ్ లోపాల కారణంగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నట్లు సర్కారు భావిస్తోంది.

రాష్ట్రంలోని హైవేలలో ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు తీసుకోవాల్సిన నిర్ణయాలపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు అనతికాలంలో ఆదేశాలిచ్చేందుకు ప్రభుత్వం సమాయత్తమౌతున్నట్లు సమాచారం. ముఖ్యంగా రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్షంగా ప్రభుత్వం సమాలోచనలు సాగిస్తోంది. ఇందులో భాగంగా రోడ్డు ప్రమాదాల నివారణకు చేపట్టే అవగాహన కార్యక్రమాల కోసం కేటాయిస్తున్న నిధులను పెంచాలని కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. అంతేకాకుండా రాష్ట్ర మోటారు వాహనాల చట్టంలోని లోపాలను సరిచేయాలని సర్కారు సమాలోచనలు సాగిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రమాదాల నియంత్రణ నిమిత్తం పలు రకాలు ప్రయోగాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగా కార్లకు, లారీలకు, మినీ బస్సులకు వెనుక భాగంలో రేడియం స్టిక్కర్లు వేయాలన్న నిబంధనను కఠినతరం చేయనున్నారు. అదేవిధంగా వాహనాలకు వెనుకవైపులో రియర్ ల్యాంప్స్ తప్పనిసరిగా ఉండేలా చర్యలు తీసుకునే సమాలోచనలు సాగిస్తున్నారు. నిబందనలు ఉల్లంఘించిన వారికి భారీ జరిమానాలతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునేలా నిబందనలు రూపొందిస్తున్నారు. అలాగే రాష్ట్రానికి నలువైపులా ఉన్న జాతీయ రహదారుల్లో బ్లాక్ స్పాట్స్, డార్క్ స్పాట్స్‌లను గుర్తించి యూటర్న్, అటవీ ప్రాంతాలలో డ్యాష్ బోర్డులు, సైన్ బోర్డుల ఏర్పాటు చేసేందుకు సర్కారు సుముఖత చూపుతోంది.

ముఖ్యంగా రోడ్డు ప్రమాదాల నివారణ, భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యల్లో భాగంగా వాహనాలకు నిర్ధిష్ట వేగాన్ని నిర్ణయించడం, ఆపై వేగ నియంత్రణ సూచికలను రహదారులకు ఇరువైపులా ఏర్పాటు చేసేందుకు అధికారులు పనిచేయాలని గతంలో ప్రభుత్వం ఆదేశించినా అశించిన మేరకు పనులు జరుగలేదని తెలుస్తోంది, ఈ నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, గ్రామీణ ప్రాంతాలలోని రోడ్లలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోటారు వాహనాల చట్టం సవరణ బిల్లును మరోసారి కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు నివేదిక సిద్దం చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రోడ్డు ప్రమాదాల నివారణే లక్షంగా ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వం రోడ్ సేఫ్టీ విభాగం పనితీరుపై నిఘా సారించనున్నారు.

Information About Road Accidents in Telangana