Home బిజినెస్ ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగిన సిఎఫ్ఒ రంగనాథ్

ఇన్ఫోసిస్ నుంచి వైదొలిగిన సిఎఫ్ఒ రంగనాథ్

Infosys CFO Ranganath to step down

ఆయన రాజీనామాను ఆమోదించిన బోర్డు

న్యూఢిల్లీ: కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సిఎఫ్‌ఒ) ఎం.డి. రంగనాథ్ తన పదవికి రాజీనామా చేశారని దేశంలో రెండో అతిపెద్ద ఐటి కంపెనీ ఇన్ఫోసిస్ లిమిటెడ్ ప్రకటించింది. 18ఏళ్లుగా ఇన్ఫోసిస్‌లో పనిచేస్తున్న రంగనాథ్ ‘కొత్త విషయాల్లో వృత్తిపరమైన అవకాశాల’ దృష్ట్యా తన బాధ్యతల నుంచి వైదొలిగినట్లు కంపెనీ తన ప్రకటనలో పేర్కొంది. ఆయన రాజీనామాను ఇనోసిస్ బోర్డు శనివారం ఆమోదించింది. ఈ ఏడాది నవంబరు 16 వరకు రంగనాథ్ సిఎఫ్‌ఒ పదవిలో కొనసాగుతారు. రంగనాథ్ ఇన్ఫోసిస్ కంపెనీలో ఆర్థిక క్రమశిక్షణను పెంచి మార్జిన్ ఆపరేటింగ్,నగదు ప్రవాహాన్ని మెరుగుపరిచారు.

ఆయన 1991 నుంచి 1999 వరకు ఐసిఐసిఐ లిమిటెడ్‌లో పనిచేశారు. అనేక అంతర్జాతీయ వేదికలపై ‘ఫైనాన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్ ’అంశంపై ప్రసంగాలు చేశారు. 201718లో ఆయన బెస్ట్ సిఎఫ్‌ఒ అవార్డును స్వీకరించారు. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుంచి పిజిడిఎం పట్టాను, మద్రాస్ ఐఐటి నుంచి మాస్టర్స్ డిగ్రీ, మైసూర్ యూనివర్శిటీ నుంచి ఇంజినీరింగ్ డిగ్రీని ఆయన పొందారు. ఆస్ట్రేలియాకు చెందిన సిపిఎలో ఆయన అసోసియేట్ మెంబర్‌గా ఉన్నారు.

తదుపరి సిఎఫ్‌ఒ కోసం వేట
కొత్త సిఎఫ్‌ఒ కోసం ఇన్ఫోసిస్ బోర్డు ఇప్పటికే వేట మొదలుపెట్టిందని కంపెనీ తన ప్రకటనలో తెలిపింది. అయితే డిప్యూటీ సిఎఫ్‌ఒ జయేశ్ సంఘ్జ్క్రా ఆయన స్థానంలో నియుక్తులు కావొచ్చని కొన్ని వర్గాలు చెప్పాయి. గతంతో సిఎఫ్‌ఒగా పనిచేసిన రాజీవ్ బన్సాల్ రాజీనామా చేయడంతో 2015లో రంగనాథ్ ఈ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇన్ఫోసిస్‌లో 18ఏళ్ల విజయవంతమైన కెరీర్ తర్వాత కొత్త విషయాల్లో వృత్తిపరమైన అవకాశాల కోసం నేను సిద్ధమయ్యాను. గత మూడేళ్లలో కంపెనీకి ఎన్నో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. అయినప్పటికీ వాటిని అధిగమించి మేం ఉత్తమ ఆర్థిక ఫలితాలను సాధించామని చెప్పేందుకు గర్వపడుతున్నా’ అని ఓ ప్రకటనలో తెలిపారు.

దేశంలోని ఉత్తమ సిఎఫ్‌ఒలలో ఒకరు: నారాయణమూర్తి
‘నేను రంగాతో 15 ఏళ్లు కలిసి పనిచేశాను. దేశంలోని ఉత్తమ సిఎఫ్‌ఒలలో ఆయన ఒకరు. చాలెంజింగ్ పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకునే సామర్థం అతడిది. ఆయన ఆర్థిక నైపుణ్యం, విలువలున్న విధానం, సంస్కారం, తప్పులేకుండా కార్యనిరహణ అనేవి కంపెనీకి సంపద అని చెప్పవచ్చు. వాటాదారుల విశ్వాసాన్ని పెంచడంలో ఆయన తోడ్పడ్డారు. వాటాదారులు, క్లయింట్లు, డెలివరీ టీమ్‌లు, ఉద్యోగుల అభ్యున్నతి, ఆర్థికాంశాలు, మదుపరులు, పాలన, చట్టం, మంచి సమాజాన్ని నిర్మించేందుకు నీతివంతమైన వ్యాపారం వంటి అనేక అంశాలు ఆయన బాగా ఆకళింపు చేసుకున్న వ్యక్తి. ఆయన కంపెనీ నుంచి వైదొలగడం అన్నది ఇప్పుడున్న పరిస్థితిలో పూడ్చలేని లోటు. ఆయనకు మంచి భవిష్యత్తు ఏర్పడాలని నేను కోరుకుంటున్నాను’ అని ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి చెప్పారు.

ఆయనలో విస్తృత నాయకత్వ లక్షణాలు: నీలేకని
రంగనాథ్ రాజీనామాపై ఇన్ఫోసిస్ బోర్డు ఛైర్మన్ నందన్ నీలేకని కూడా స్పందించారు. ‘గత 18ఏళ్లలో రంగనాథ్ కంపెనీలో ఎన్నో కీలక బాధ్యతలు చేపట్టారు. కంపెనీ విజయాల్లో భాగమయ్యారు. ఈ సుదీర్ఘ కాలంలో ఆయనలోని విస్తృత నాయకత్వ లక్షణాలను చూశాను’ అని నీలేకని అన్నారు. ‘కంపెనీలో రంగ సిఎఫ్‌ఒగా కీలక పాత్ర పోషించారు’ అని ఇన్ఫోసిస్ సిఇఒ సలీల్ పారెఖ్ అన్నారు. మాజీ సిఇఒ విశాల్ సిక్కా వైదొలిగిన ఏడాదికి రంగనాథ్ కూడా వైదొలగడం ఇక్కడ గమనార్హం.

సర్‌ప్రైజ్: శ్రీరామ్ సుబ్రమణ్యన్
‘ఇన్ఫోసిస్‌కు ఎంతో విశ్వాసపాత్రుడైన రంగనాథ్ రాజీనామా పూర్తిగా ఆశ్చర్యకరం. ఇన్ఫోసిస్‌కు మించి వేరే చోట మంచి అవకాశం ఆయనకు దక్కుతుందని నేను అనుకోడం లేదు’ అని ఇన్ఫోసిస్ ఇన్‌గవర్న్ రిసెర్చ్ సర్వీసెస్ ఎండి, వ్యవస్థాపకుడు శ్రీరామ్ సుబ్రమణ్యన్ అభిప్రాయపడ్డారు. ఏది ఎలా ఉన్నప్పటికీ ఇన్ఫోసిస్ ఏడాది కాలంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. సిక్కా వైదొలిగాక చాలా మంది బోర్డు సభ్యులు కూడా కంపెనీ నుంచి వైదొలిగారు.