Home బిజినెస్ ఇన్ఫోసిస్‌తో సం‘క్రాంతి’

ఇన్ఫోసిస్‌తో సం‘క్రాంతి’

Vishal-Shikkaమించిన ఫలితాలు
నికర లాభం రూ.3,465 కోట్లు
గతేడాదితో పోలిస్తే 6.6 శాతం పెరిగింది
డాలర్ బలోపేతంతో ఆదాయ వృద్ధికి దోహదం

న్యూఢిల్లీ : అంచనాల కంటే మెరుగైన ఫలితాలతో ఐటి దిగ్గజం ఇన్ఫోసిస్ మార్కెట్‌ను ఆశ్చర్యపోయేలా చేసింది. రెండు రోజుల క్రితం అతిపెద్ద ప్రత్యర్థి కంపెనీ టిసిఎస్ ప్రకటించిన ఫలితాలు నిరాశపరచగా, తాజాగా ఇన్ఫీ వెల్లడించిన క్యూ3 రిజల్ట్ ఇన్వెస్టర్లను ఆనందంలో ముంచాయి. మార్కెట్ కూడా ఇన్ఫీ లాభాలను ఆస్వాదించినప్పటికీ అంతలోనే అంతర్జాతీయ పరిణామాలు సూచీలను నష్టాల వైపు లాక్కెళ్లాయి. గురువారం కంపెనీ ప్రకటించిన డిసెంబర్ 31 ముగింపు నాటి మూడో త్రైమాసిక ఫలితాల్లో సంస్థ నికర లాభం రూ.3,465 కోట్లతో 6.6 శాతం వృద్ధిని సాధించింది. ఇంతకుముందు త్రైమాసికంతో పోలిస్తే ఇన్ఫీ లాభం 2 శాతం పెరిగింది. అయితే గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో సంస్థ నికర లాభం రూ.3,250 కోట్లుగా ఉంది. ఇక మొత్తం ఆదాయం విషయానికొస్తే రూ. 15,902 కోట్లతో 15.3 శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాదిలో కంపెనీ ఆదాయం రూ.13,796 కోట్లుగా ఉంది. సంవత్సరం-సంవత్సరం ఆధారంగా పరిశీలిస్తే ఇక ఆపరేటింగ్ లాభం రూ.3,689 కోట్ల నుంచి రూ.3,959 కోట్లకు పెరిగింది. వచ్చే సంవత్సరం పరిశ్రమకు నాయకత్వం వహించే వృద్ధిని సాధిస్తామనే విశ్వాసం వచ్చిందని సంస్థ పేర్కొంది. ఇన్ఫోసిస్‌లో సృజనాత్మక విశ్వాసం చిగురించడం ప్రారంభించిందని, అందమైన ఆలోచన ఏ ఒక్క విభాగానికో పరిమితం కాదు, అయితే మనలోని సామర్థాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు వేచిచూడాలి అని ఇన్ఫోసిస్ సిఇఒ, మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సిక్కా అన్నారు. తాము ఆవిష్కరణలను చూస్తున్నామని, ప్రతి వ్యక్తిగత ప్రాజెక్టుకు వినూత్నను తీసుకువస్తున్నారని ఆయన అన్నారు. భవిష్యత్‌లోనూ ఇదే రీతిలో విశ్వాసంతో ముందుకు వెళతామని పేర్కొన్నారు. బిఎస్‌ఇపై స్టాక్ విలువ 5 శాతం లాభపడి రూ.1,137.50 వద్ద స్థిరపడింది.

Infosys-Profitsనికర లాభం
ఇన్ఫోసిస్ నికర లాభం సంవత్సరం-సంవత్సరం ఆధారంగా 6.6 శాతం పెరిగింది. డిసెంబర్ ముగింపునాటి మూడో త్రైమాసికంలో రూ.3,465 కోట్ల లాభాన్ని ఆర్జించింది. త్రైమాసికం-త్రైమాసికం ఆధారంగా చూస్తే కంపెనీ 1.97 శాతం లాభం వృద్ధిని నమోదు చేసింది. గత సంవత్సరం కంపెనీ ఆదాయం రూ.3,250 కోట్లుగా ఉంది.

ఆదాయం 
ఇన్ఫీ ఆదాయం 15.3 శాతం వృద్ధిని సాధించింది. గత ఏడాదిలో కంపెనీ ఆదాయం రూ.13,796 కోట్ల నుంచి ఈ ఏడాది క్యూ3లో రూ. 15,902 కోట్లకు పెరిగింది. త్రైమాసికం-త్రైమాసికం ఆధారంగా చూస్తే 1.70 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఆపరేటింగ్ ప్రాఫిట్
ఇంతకుముందు త్రైమాసికంతో పోల్చి చూస్తే ఆపరేటింగ్ ప్రాఫిట్ స్వల్పంగా తగ్గింది. గత సంవత్సరంలో రూ.3,689 కోట్ల నుంచి 2015 డిసెంబర్ నాటి క్యూ3లో ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.3,959 కోట్లకు పెరిగింది.

అవుట్‌లుక్(దృక్పథం)
డాలర్ బలపడడం వల్ల బెంగళూరుకు చెందిన కంపెనీ వృద్ధిని నమోదు చేసింది. ఆదాయం వృద్ధిని 8.9-9.3 శాతంగా అంచనా వేయగా, 12.8-13.2 శాతం వృద్ధిని తాకింది.

స్వాధీనాలు, పెట్టుబడులు
ఈ త్రైమాసికంలో నోహ్ కన్సల్టింగ్ ఎల్‌ఎల్‌సి కొనుగోలు ఒప్పందం ప్రక్రియను ఇన్ఫోసిస్ పూర్తి చేసింది. మరోవైపు డబ్లుహెచ్‌ఒఒపిలో పెట్టుబడులు పెట్టింది. ప్రారంభ దశలో ఉన్న ఈ సంస్థ నిపుణులైన క్రీడా బృందాలకు పనితీరు ఆప్టిమైజేషన్ విధానాన్ని ఆఫర్ చేస్తోంది. స్టార్టప్ కంపెనీ అయిన క్లౌడ్‌ఎండ్యూర్‌లో కూడా ఇన్ఫీ ఇన్వెస్ట్ చేస్తోంది.2016 జనవరి 14న బోర్డు స్వతంత్ర డైరెక్టర్‌గా పునిత కుమార్ సిన్హాను నియమించింది. ఆయన నియామకం తక్షణమే అమలు చేశారు.

కార్పొరేట్ సామాజిక బాధ్యత

ఈ ఏడాది ఇన్ఫోసిస్ కార్పొరేట్ సమాజిక బాధ్యత(సిఎస్‌ఆర్)కు రూ.270 కోట్లు తనఖా పెట్టింది. దాతృత్వ సంస్థ ఇన్ఫోసిస్ పౌండేషన్ ద్వారా నిధులను అందిస్తున్నారు. 2015 డిసెంబర్ 31నాటికి విద్య, ఆరోగ్య, నిరాశ్రయులైన వారి సంరక్షణ, కళలు, సంస్కృతి, గ్రామీణాభివృద్ధి కోసం ఇన్ఫోసిస్ పౌండేషన్ రూ.171 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.

ద్రవ్యలభ్యత ఆస్తులు
గత ఏడాది డిసెంబర్ ముగింపు నాటికి కంపెనీ ద్రవ్యలభ్యత ఆస్తులను పరిశీలిస్తే.. నగదు, నగదుతో సరిసమానమైనవి, అమ్మకాననికి ఉన్న ఆస్తులు, ప్రభుత్వ బాండ్లు మొత్తంగా రూ.31,526 కోట్లు ఉన్నాయి. అంతకుముందు 2015 సెప్టెంబర్ నెలలో రూ.32,099 కోట్ల ద్రవ్యలభ్యత ఆస్తులు ఉన్నాయి.