Home ఎడిటోరియల్ ఈ ప్రశ్నలకు బదులేది?

ఈ ప్రశ్నలకు బదులేది?

సురవరం సుధాకరరెడ్డి,
ప్రధాన కార్యదర్శి,
సి.పి.ఐ.

VENKAIAHజూన్ 25 శనివారం నాటి ఈనాడు పత్రికలో “కలిసి కట్టుగా కుయుక్తులు” శీర్షికతో కేంద్ర మంత్రి యం. వెంకయ్యనాయుడు గారు రాసిన వ్యాసం ఆశ్చర్యం కలిగించలేదు. వ్యాసం లో మొదటి వాక్యం “ఒకే అబద్ధాన్ని పదేపదే ప్రచారం చేసినంత మాత్రాన అది నిజమై పోదు” ఆయన వ్యాసానికినిదే మా జవాబు.
అయన కాంగ్రెస్‌తోపాటు వామపక్షాలపైన నిరాధారమైన ఆరోపణలు చేశారు. నరేంద్రమోడి ఆధికారంలోకి వచ్చినప్పటి నుండి అసహనంతో రగిలి పోతున్నామని ఆరోపించారు. అసహనం ప్రతిపక్షాలది కాదు. అసహనం సంఘపరివార్ అనుయాయులది. అంధ విశ్వాసాలకు వ్యతి రేకంగా శాస్త్రీయ దృక్పథాన్ని ప్రచారం చేస్తున్న సిపిఐ నాయకుడు గోవింద్ పన్సారేను, ప్రొఫెసర్ కుల్బర్గీని హత్యచేశారు. అంతకు ముందే నరేంద్ర దబోల్కర్‌ను హత్యచేశారు.
ఈ హత్యలు చేసింది ఒక “సనాతన సంస్థ”. గోవాలో దీని కేంద్రం. ఇద్దరు బిజెపి ఎంఎల్‌ఎల భార్యలు ఇందులో చురుకైన పాత్ర వహిస్తున్నారు. వారిపై కేసులు సంవత్సరాల తరబడి విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారు. రచయితలు ఏవి రచించాలో, ఉపాధ్యాయులు యూనివర్శిటీలో ఏమి బోధిం చాలో, విద్యార్థి యూనియన్‌లు ఏమి నినాదాలు ఇవ్వాలో నిర్ణయించి, దాన్ని అంగీకరించని వారి పైన దేశ ద్రోహం కేసు పెట్టారు. విద్యార్థి నాయకుల్ని యూనివర్శిటీలలో నుంచి సస్పెండ్ చేశారు. గోరక్షణ పేర, గొడ్డుమాంసం పేర ఉత్తర ప్రదేశ్ దాద్రిలో అక్లాక్‌ఖాన్‌ను చిత్రవధ చేసి చంపారు. హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్ సరిహద్దు లో ఇదే ఆరోపణలపైన ఇద్దరు యువకుల్ని హత్య చేశారు. జార్ఖండ్‌లో పశువులను తోలుకపోతున్న ఇద్దరు మైనారిటీలను ఉరి వేసి చంపారు. పశు మాంస భక్షణ నిరోధక చట్టాన్ని తెచ్చి, వంట ఇంట్లో ఏమి వండాలో ఆదేశించేలా ప్రయత్నిం చారు. ఇదేనిజమైన అసహనం.
ఫిలిం ఇన్సిట్యూట్‌కు, ఫ్యాషన్ డిజైనింగ్ సంస్థకు, అనేక రాష్ట్రాల గవర్నర్ పదవులకు అర్హత లు లేక పోయినా సంఘపరివార్ కార్యకర్త లను నియమించిన బిజెపి, గత ప్రభుత్వం తమ పార్టీ వారి కోసమే “తాబేదారులు, వందిమాగధు లకు పదవులు తాకట్టు పెట్టిందని” విమర్శిస్తు న్నారు. వామ పక్షాలు, కాంగ్రెస్ కలిసి రాజకీయం చేశాయని బురద పులుము తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో వామపక్షాలు మంత్రులుగానూ, గవర్నర్‌లు గానూ, సంస్థల అధ్యక్షులు గానూ పదవులు తీసుకోలేదు. 37 ఏళ్ళు ఒకే కుటుంబం దేశాన్ని పరిపాలించిందని ఆగ్రహం వ్యక్తం చేసిన వెంకయ్య నాయుడు గారు, బిజెపికి సంఘపరివార్‌కి సంబంధం లేకపోయినా కేవలం నెహ్రూ కుటుంబం నుంచి తమ పార్టీ వైపుకు వచ్చిన మనేకాగాంధీకి, ఇప్పుడు ఆమె కుమారుడు వరుణ్‌గాంధీకి పార్లమెంట్ సభ్యత్వాలు, మంత్రిపదవులు ఎందుకిచ్చినట్లు?
తమ ప్రభుత్వం పేదలకు అంకితమైన ప్రభుత్వమని ప్రధానమంత్రి నరేంద్రమోడి రెండు సంవత్సరాల పరిపాలన ఉత్సవాలలో చెప్పు కున్నారు. ఈ రెండేండ్ల కాలంలో గుజరాత్‌కు చెందిన అంబానీ, ఆదాని కుటుంబాలతో సహా 10 కార్పొరేట్ కంపెనీలకు రూ. 20 లక్షల కోట్ల అదనపు లాభాలు వచ్చినమాట వాస్తవమా? కాదా? అదే సమయంలో కార్పొరేట్ ట్యాక్స్ 30 శాతం నుండి 25శాతానికి తగ్గించి, సర్వీసు ట్యాక్స్‌లను 12 శాతం నుండి 15శాతంకు పెంచడం పేద ప్రజలకు సేవ చేయడమా, కార్పొరేట్లకు ఊడిగం చేయడామా? యుపిఎ-2 ప్రభుత్వం చేసిన అవినీతి, ప్రజావ్యతిరేక విధానాలు బిజెపిని అధికారంలోకి తెచ్చాయి. ఎన్నికలలో నరేంద్రమోడి వాగాడంబరం బిజెపికి పెద్ద అస్త్రమైన మాట వాస్తవం.
వామపక్షాల విమర్శలలో ఏది అసమంజస మైనదో వెంకయ్యనాయుడు గారిని చెప్పమని కోరుతున్నాను. 1) విదేశాల నుండి 100 రోజుల లో నల్లధనాన్ని (80 లక్షల కోట్ల రూపాయల పై చిలుకు) తిరిగి వెనక్కి తెస్తామని చేసిన వాగ్దానం విఫలమైందని విమర్శిస్తున్నాము. 2) మేధావులు, శాస్త్రవేత్తలు, రచయితలలో మీతో విభేదించే వారందరికి కమ్యూనిస్టు ముద్రకొట్టి, దేశద్రోహం కేసుపెట్టి విద్యార్థి నాయకుల్ని బెదిరించి “భావ ప్రకటన స్వేచ్ఛ”కు విఘాతం కలిగిస్తున్నారన్న వాస్తవాన్ని బహిర్గతం చేశాం. 3) 2 కోట్ల ఉద్యో గాలు సృష్టిస్తామని చేసిన వాగ్దానంలో 20శాతం కూడా సృష్టించలేదని ఆరోపిస్తున్నాం. 4) ఆహార ధాన్యాలు నిత్యజీవితావసర వస్తువుల ధరలు ఈ రెండేళ్ళ కాలంలో అసాధారణంగా పెరిగాయి. వాటిని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శిస్తున్నాం. 5) ధరల పెరుగు దల, ద్రవ్యోల్బణం సామాన్య ప్రజల నడ్డి విరుస్తు న్నాయని ఆరోపిస్తున్నాం. 6)మీ ప్రభుత్వం అధికారం లోకి రాగానే రైతుల అంగీ కరం లేకుండా, న్యాయమైన నష్టపరిహారం చెల్లించకుండా రైతుల భూముల్ని లాక్కునేందుకు తెచ్చిన ఆర్డినెన్స్ రైతాంగ వ్యతిరేక మైనదని, పారిశ్రామికవేత్తల ప్రయోజనాలు కాపాడేం దుకని ఆరోపిస్తున్నాం. 7) కార్మిక చట్టాల సవరణ పేరు తో ట్రేడ్ యూనియన్‌ల హక్కులు కాల రాసేందుకు ప్రభుత్వం పూనుకుంటుందని బహిర్గతం చేస్తున్నాం. 8) మీ పార్లమెంట్ సభ్యుడు సాక్షి మహారాజ్, మహాత్మా గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే విగ్రహాలను దేశ వ్యాపితంగా ప్రతిష్టించాలని బహిరంగ ప్రకటన చేస్తే, మరో కేంద్ర మంత్రి వి.కె.సింగ్ దళితుల్ని కుక్కలతో పోలిస్తే ప్రధాని మోడి, బిజెపి అధ్యక్షులు అమిత్‌షా దానిపట్ల అభ్యంతరం వ్యక్తం చేయకుండా వుండటం ద్వారా పరోక్షంగా వారి వ్యాఖ్యలను ఆమోదిస్తున్నట్లు ఆరోపి స్తున్నాం. 9) మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి గత యుపిఎ ప్రభుత్వం కంటె ఎక్కువగా ప్రతి సంవత్సరం 5 లక్షల కోట్లకుపైగా కార్పొరేట్ కంపెనీల కు పన్నుల తగ్గింపు, రాయితీలు ఇస్తున్నారని, దేశంలో వేల సంఖ్యలో కరువు, అప్పుల కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతులకు పైసా విదిల్చలేదని, మీ ప్రభుత్వం కార్పొరేట్ల కోసమనీ, కార్పొరేట్ల వల్ల నడుప బడుతున్న ప్రభుత్వమని ఆరోపిస్తున్నాం.
10) మతం పేరుతో ప్రజలను చీల్చేందుకు ఉత్తరప్రదేశ్ లో అసత్యాల, అబద్ధాల ప్రచారం ద్వారా రెచ్చ గొడుతున్నా రని, హిందూత్వ శక్తుల పైనున్న టెర్రరిస్టు కేసులను కొట్టివేయి స్తున్నారని, మైనారిటీల ను భయభ్రాం తులను చేస్తున్నారని ఆరోపి స్తున్నాం. 11)ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేసి, మాట తప్పారని విమర్శించాము. 12) అంతర్జా తీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగనప్పుడు దేశంలో వాటి ధరలు పెంచి, ప్రపంచ ధరలు మూడో భాగానికి పడి పోయినా, ఆ సౌకర్యం వినిమయదారులకు ఇవ్వ కుండా కొత్తపన్నులు వేసి, ప్రజలను మోసం చేశారని విమర్శించాం. 13) 9000 కోట్ల ప్రజా ధనాన్ని బ్యాంకుల కు ఎగబెట్టిన విజయమాల్యాను, క్రికెట్ ఆటను దుర్వినియోగం చేసిన అవినీతిపరుడు లలిత్ మోడీని అరెస్టు చేయకుండా విదేశాల నుండి వారిని రప్పించే చర్యల్లో కావాలనే విఫలమయ్యా రని ఆరోపిస్తున్నాం. 14) విదేశాంగ విధానంలో అమెరికాకు మోకరిల్లడం ద్వారా, టెండర్లు పిలవకుండా నష్టంలో ఉన్న అమెరికా కంపెనీకి నాలుగు అణు విద్యుత్ కేంద్రాల కాంట్రాక్టును నాలుగు లక్షల కోట్లకు ఇచ్చి, యూనిట్ ఖరీదు రూ. 50/లకు కొనే వ్యాపారం చేసి, దేశానికి నష్టం చేస్తున్నారని విమర్శిస్తున్నాం.
మీరు వాగ్దానం చేసిన “అచ్ఛాదిన్‌” కోటీశ్వరులకు, సంఘపరివార్‌కు తప్ప సాధారణ ప్రజలకు “బూరాదిన్‌” (చెడ్డ రోజులు) మాత్రమే వచ్చాయని భావిస్తున్నాం.
వామపక్షాలు కాంగ్రెస్ వారి ఆర్థిక విధానాల పైనా, అవినీతిపైన నిరంతరం ఎండగట్టి, పోరా టం చేశాయి. అలాగే బిజెపిని విమర్శి స్తున్నాం. బిజెపిపై మా విమర్శలలో ఏది అవాస్తవ మైనదో నేరుగా సమాధానం చెప్పండి. ప్రతిపక్షం గా ప్రజల తరపున గతంలో కాంగ్రెస్‌ను, ఇప్పుడు బిజెపిని విమర్శిస్తున్నాం.
వామపక్షాల విమర్శల కారణంగా దేశాభివృద్ధి ఆగిపోతున్నదని చెప్పడం అతిశ యోక్తి. మీరు ప్రతిపక్షంలో వున్నప్పుడు మాతో పాటు రిటైల్ ట్రేడ్‌లో ఎఫ్‌డిఐకి వ్యతిరేకంగా దేశవ్యాపిత బంద్‌కు ఒకే రోజు పిలుపు ఇచ్చిన మాట గుర్తుందా? ఇప్పుడు మీరు కీలక రంగ మైన డిఫెన్స్‌లో, రిటైల్ ట్రేడ్‌తో సహా దాదాపు అన్ని రంగాలలో 100శాతం ఎఫ్‌డిఐ ఎందుకు తెస్తున్నట్లు? మీరు ప్రతిపక్షం లో వున్నప్పుడు, ప్రభు త్వాన్ని ఏఏ అంశాల మీద విమర్శించారో, వాటన్నిం టిని ఇవాళ అమలు చేస్తున్నారా! లేదా? ఈ అంశాల న్నిటిపై సహనంతో కూడిన చర్చలో పాల్గొంటే, వాస్తవాలు బయటికి వస్తాయి. మా విమర్శలు మీ ప్రభుత్వ పరిపాల నలోని లొసుగులు, బలహీనతలను బహిర్గతం చేస్తున్నందుకు మీకు ఆగ్రహం కలుగు తున్నది.
ఢిల్లీలో, బీహార్‌లో మీరు మా విమర్శల వల్ల ఓడి పోలేదు. మీ వాగ్దానాలకు, చేతలకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలు గమనించి మిమ్మల్ని ఓడిం చారు.
మొన్న జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో అన్ని చోట్ల 2014తో పోలిస్తే మీ ఓట్ల శాతం ఇదే కారణం వల్ల పడిపోయింది.
నరేంద్ర మోడీని దేవదూతగా మీరు అభివ ర్ణించి నా ఆయన ప్రజా సమస్యలు పరిష్క రించ డంలో పూర్తిగా వైఫల్యం చెందారు. కార్పొరేట్ కంపెనీల తరపున పనిచేసే ప్రధానిగా మాకు కనబడు తున్నాడు.
ప్రజల ఆలోచనల్లో మీ పార్టీ ప్రభుత్వం పట్ల అసంతృప్తిని, పెరుగుతున్న ఆగ్రహాన్ని గమనించి ప్రజాభి ప్రాయాన్ని గౌరవించి, మీ ప్రజావ్యతిరేక విధానాలను, కార్పొరేట్ అనుకూల విధానాలను మార్చుకుంటే మంచిదని సలహా ఇస్తున్నాం.