Home తాజా వార్తలు మే 20 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

మే 20 నుంచి ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం

Intermediate Final Exams from Tomorrow

మనతెలంగాణ/హైదరాబాద్: ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌లో మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇంటర్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మే 16వ తేదీ నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే ప్రస్తుతం ఇంటర్ ఫలితాలలో గందరగోళంపై ఆందోళనల నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 3.28 లక్షల మంది జవాబుపత్రాలను పునఃమూల్యాంకనం చేయాల్సి ఉంటుంది.

రీ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి రెండు వారాలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలకు ప్రకటించిన షెడ్యుల్‌లో మార్పులు చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. మే 20 నుంచి లేదా 23 నుంచి అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభించేలా షెడ్యూల్ రూపొందించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ఇంటర్ బోర్డు అధికారులతో చర్చించిన ఒకటి రెండు రోజుల్లో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేయనున్నట్లు సమాచారం. గురువారం సచివాలయంలో ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి రాజీవ్ శర్మతో సమావేశమైన విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్‌రెడ్డి ఇంటర్ విద్యార్థుల పునఃమూల్యాంకనం, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ తదితర అంశాలపై చర్చించినట్లు సమాచారం. ఇంటర్ విద్యార్థుల జవాబు పత్రాలు మూల్యాంకనం చేసిన కేంద్రాల్లోనే రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించనున్నారు.
సిజిజికి సాంకేతిక అంశాల పర్యవేక్షణ బాధ్యత
ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌లో సాంకేతిక అంశాల పర్యవేక్షణ బాధ్యతను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సిజిజి)కి అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ విద్యార్థుల డాటా ప్రాసెసింగ్, పరీక్షల ఫలితాల వెల్లడిలో సాంకేతిక సేవలు అందిస్తున్న గ్లోబరీనా సంస్థను వెంటనే తప్పించే అవకాశం లేనందున, సాంకేతిక అంశాల పర్యవేక్షణ బాధ్యతను సిజిజికి లేదా మరో ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించే అవకాశం ఉంది. ఈ అంశంపై ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాత ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకోనుంది.

Inter advanced exams start from May 20th