Home మెదక్ కస్తూర్బాల్లో ఇంటర్ విద్య

కస్తూర్బాల్లో ఇంటర్ విద్య

Inter class in Kasturba Gandhi Girls Colleges

మన తెలంగాణ/పెద్దశంకరంపేట : కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్ తరగతులని ఈ ఏడాది నుంచే ఆరంభించనున్నారు. మొదటి విడతగా మెదక్ జిల్లాలోని మూడు కెజిబివిల్లో ఇంటర్ విద్యను ప్రవేశపెడుతున్నారు. మెదక్‌తో పాటు చేగుంట, నర్సాపూర్‌లలో ఇంటర్ తరగతులు ఆరంభం కానున్నాయి. మలి విడతలో మిగిలిన కెజిబివిల్లో ఇంటర్ తరగతులు ప్రారంభించనున్నారు. నియోజకవర్గానికి ఒకటి అనే ప్రాతిపదికన కెజిబివిలను ఎంపిక చేశారని అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 10 కెజిబివిలను ఎంపిక చేశారని తెలిసింది. ఇప్పటికే ఉన్నతాధికారులు కెజిబివిల్లో వసతులు, ఆయా ప్రాం తాల్లో మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల సంఖ్య అనే విషయమై నివేదికలు తీసుకున్నారు. అనంతరం వీటన్నింటినీ పరిశీలించిన తరువాత నియోజకవర్గానికి ఒకటి అనే ప్రాతిపదికన ఇంటర్ తరగతులకు కెజిబివిలను ఎంపిక చేశారు. మెదక్ జిల్లాలో మెదక్, చేగుంట, నర్సాపూర్‌లోని కెజిబివిలలో ఇంటర్ తరగతులకు శ్రీకారం చుట్టారు. జూన్ ఒకటో తేదినుంచే వీటిలో ఇంటర్ ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. వచ్చే విద్యాసంవత్సరం మిగిలిన కెజిబివిల్లో ఈ తరగతులను ఆరంభించనున్నారు. అయితే అన్ని కెజిబివిలలో ఇంటర్ తరగతులు ప్రారంభిస్తారని పలువురు విద్యాభిమానులు ఆశగా ఎదురుచూశారు. వారి ఆశ నిరాశగా మారింది. ప్రస్తుతం ఇంటర్‌లో ఒకేషన్‌ల్ కోర్సుతో పాటు బైపిసి కోర్సును మాత్ర మే ప్రవేశపెట్టనున్నారు. ఒక్కో కోర్సులో 40మందికి మాత్రమే అవకాశం ఉంటుం ది. మొత్తం 80 మందికి ఇంటర్‌లో ప్రవేశానికి అనుమతినివ్వనున్నారు. మెదక్ జిల్లాలోని మూడు కెజిబివిల్లో కలిపి మొత్తం 240 మంది ఇంటర్ విద్యార్థులకు ప్రవేశానికి అర్హత లభించనుంది. ప్రస్తుతం కెజిబివిల్లో పదవ తరగతి పూర్తి చేసుకున్న వారికి అందరికి అవకాశం లభించడం కష్టతరంగా మారనుంది.
విద్యార్థినులకు ప్రయోజనం : కెజిబివిల్లో ఇంటర్ విద్యను ప్రవేశ పెట్టిన నేపథ్యం లో విద్యార్థినులకు చేకూరనుంది. పదో తరగతి తరువాత చాలా మంది విద్యార్థినులు ఇంటర్‌లో చేరకుండా మధ్యలోనే మానేస్తున్నారు. గురుకుల విద్య అందుబాటులో లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు చేరడంలేదు. చిన్న వయస్సులో వారికి వివాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం గురుకుల విద్య కెజిబివిల్లో అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారు 800 మందికి ప్రయోజనం చేకూరి వారు ఉన్నత చదువుల వైపు వెళ్లేందుకు అవకాశముంది. బాల్య వివాహాలు ఆరికట్టేందుకు ఈ విధానంతో మేలు చేకూరనుంది.
మౌలిక వసతుల కల్పనకు చర్యలు : ఇంటర్ తరగతులు ప్రారంభించనున్న కెజిబివిల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం విద్యార్థులకు తరగతి గదులు, ఉండేందుకు, దానితో పాటే వసతి గదులు ఉంచేందుకు కూడా చర్యలు తీసుకోనుంది. ఇక వీరికి బోధన చేసే అధ్యాపకుల విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఇది వరకు అదనంగా అధ్యాపకులను నియామకం చేస్తారని, పిజి అర్హత కలిగి ఉంటే సిఆర్‌టిలనే ఇంటర్ బోధించేందుకు తీసుకుంటారనే ప్రచారం కొనసాగింది.
ఉత్తర్వులు అందాయి : సుభాష్, జిల్లా కెజిబివి సమన్వయకర్త
కస్తూర్బాగాంధీ విద్యాలయాల్లో ఇంటర్ విద్య అందించేందుకు ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది. తరగతులు నిర్వహించేందుకు కెజిబివిలను ప్రభుత్వం ప్రకటించింది. మెదక్ జిల్లాలో మెదక్‌తో పాటు చేగుంట, నర్సాపూర్‌లలో ఇంటర్ తరగతు ల నిర్వహణకు అనుమతి లభించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మిగిలిన కెజిబివిల్లో ఇంటర్ తరగతులను ప్రవేశపెట్టనున్నారు. విధి విధానాల గురించి మరిన్ని ఉత్తర్వుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. నియోజకవర్గానికి ఒకటి కవరయ్యేలా ప్రభుత్వం కెజిబివిలను గుర్తించింది. పదో తరగతి తర్వాత నిరుపేదలకు ఇంటర్ విద్య ఉచితంగా లభించడం ఒక వరమనే చెప్పాలి. ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులపై ఎంతగానో ఉంది.