Home తాజా వార్తలు ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు

మొదటి రోజు 4.84 శాతం మంది విద్యార్థులు గైర్హాజరు
వరంగల్‌లో ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
మనతెలంగాణ/హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. బుధవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పేపర్1 భాషా పరీక్ష(తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ, అరబిక్, ఫ్రెంచ్, కన్నడ, మరాఠి)కు ఒకేషనల్‌తో కలిపి మొత్తం 480415 మంది విద్యార్థులు రిజిష్టర్ చేసుకోగా, 457184 మంది హాజరయ్యారు. 23231 మంది (4.84 శాతం) ఇంటర్ ప్రథమ సంవత్సరం పేపర్1 పరీక్షకు గైర్హాజయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం నాలుగు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఎ.అశోక్ తెలిపారు. వీటిలో అర్బన్ జిల్లాలో ఒకటి, నాగర్‌కర్నూల్‌లో ఒకటి, వికారాబాద్‌లో రెండు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదైనట్లు పేర్కొన్నారు. మొదటి రోజు ప్రశ్నాపత్రం సెట్ కోడ్‌ఎను ఎంపిక చేసినట్లు తెలిపారు. నాలుగు మాల్ ప్రాక్టీస్ కేసులు మినహా రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు 1277 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసింది. విద్యార్థులను ఉదయం 8 గంటల నుంచే పరీక్షా కేంద్రంలోకి అనుమతించారు. ఉదయం 9 గంటలకు పరీక్ష ప్రారంభమైంది.
ఇన్విజిలేటర్ మందలింపు…విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
ఇంటర్ పరీక్షల మొదటి రోజు వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని ఆర్‌డి కళాశాలలో పోలసాని రక్షారావు(16) అనే విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. పరీక్షలో విద్యార్థిని కాపీయింగ్‌కు పాల్పడిందని ఇన్విజిలేటర్ మందలించడంతో మనస్తానికి గురైన విద్యార్థిని కళాశాల భవనం మూడవ అంతస్తు నుంచి దూకింది. ఈ ఘటనలో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. రెండు కాళ్లు విరిగాయి. ఆమెను కళాశాల సిబ్బంది వెంటనే ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న హన్మకొండ ఎసిపి పరీక్షా కేంద్రానికి చేరుకుని జరిగిన సంఘటనపై పరీక్ష నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు పరీక్షా కేంద్రానికి చేరుకుని ఆందోళన నిర్వహించారు. దాంతో పరీక్షా కేంద్రం వద్ద హన్మకొండ పోలీసులు బందోబస్తు చేపట్టారు.

Inter Exams start from Today in Telangana