Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

రెపో రేటుకు రెక్కలు

bs

 నాలుగేళ్లలో తొలిసారిగా పెంపు

 పావు శాతం పెరిగిన వడ్డీ రేట్లు
 ఇక పెరగనున్న గృహ, ఆటో రుణాల వడ్డీలు
 రెపో రేటు 6 నుంచి 6.25 శాతానికి.. రివర్స్ రెపో రేటు 5.75 నుంచి 6 శాతానికి

 ద్రవ్యోల్బణం 4 శాతం పైనే

ముంబయి : నాలుగేళ్ల తర్వాత భారత రిజర్వు బ్యాంకు(ఆర్‌బిఐ) కీలక వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు లేక 0.25 శాతం పెంచింది. అత్యధిక చమురు ధరల కారణంగా ఏర్పడిన ద్రవ్యోల్బణ ఒత్తిడిని కట్టడి చేసేందుకు ఆర్‌బిఐ ఈ చర్య చేపట్టింది. దీంతో గృహ, ఆటో, ఇతర రుణాల వడ్డీరేట్లు పెరుగుతాయి. పరపతి విధాన కమిటీ(ఎంపిసి)లోని ఆరుగురు సభ్యులు వడ్డీ రేట్లను పెంచడానికే ఓటేశారు. ఆర్‌బిఐ రెపో రేట్లను పెంచి మార్కెట్లను ఆశ్చర్యపరిచింది. ఈ రెపో రేటు ఆధారంగానే ఇతర బ్యాంకులకు రుణాలిస్తుంది. ప్రస్తుతం 6 శాతంగా ఉన్న రెపో రేటును 6.25 శాతానికి పెంచింది. అలాగే రివర్స్ రెపో రేటును 5.75 శాతం నుంచి 6 శాతానికి పెంచింది. ఆర్‌బిఐ ఇలా వడ్డీ రేట్లను పెంచడం అన్నది నాలుగేళ్ల తర్వాత జరిగింది. ఇంతకు ముందు 2014 జనవరిలో రెపో రేటును 8 శాతానికి పెంచింది. ఆ తర్వాత వడ్డీ రేట్లను తగ్గించడం లేదా యథాతథంగా ఉంచడమో చేస్తూ వచ్చింది. ఈ మధ్య సంవత్సరాల్లో ఆర్‌బిఐ ఆరుసార్లు వడ్డీ రేట్లను తగ్గించింది.
2017 ఆగస్టు 2న జరిగిన గత సమీక్షలో వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6 శాతం చేసింది. 201819కి సంబంధించిన రెండో ద్వైమాసిక పరపతి విధానంలో అత్యధిక చమురు ధరల కారణంగా ద్రవ్యోల్బణం పెరగడాన్ని ఆర్‌బిఐ గమనించింది. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి(జిడిపి) వృద్ధిని మాత్రం తన దృక్పథంలో మార్చకుండా 7.4 శాతంగానే ఉంచింది. 201819 ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ధరల సూచీ(సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ప్రథమార్థంలో (ఏప్రిల్‌సెప్టెంబర్ మధ్య కాలంలో) 4.6 శాతంగా, రెండో అర్ధభాగంలో 4.7 శాతంగా అంచనావేసింది. గత వారం ఎస్‌బిఐ, ఐసిఐసిఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా రుణాలపై వడ్డీ రేట్లను 0.1 శాతం పెంచడాన్ని ఆర్‌బిఐ గుర్తించింది.
జూన్ 20కలా మినట్స్ వివరాలు..
ఆర్‌బిఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో పరపతి విధాన కమిటీ(ఎంపిసి) రెపో రేటును 25 బేసిస్ పాయింట్లకు పెంచాలని నిర్ణయించింది. ఇదిలా ఉండగా ద్రవ్యోల్బణం అనుకున్నదానికన్నా ఎక్కువే పెరిగింది. గత ఆరు నెలల్లో 4 శాతం కన్నా ఎక్కువే పెరిగింది. తాజా సమాచారం ప్రకారం ఏప్రిల్‌లో ద్రవ్యోల్బణం 4.58 శాతానికి పెరిగింది. కాగా ద్రవ్యోల్బణంపై ఆర్‌బిఐ నిఘా కొనసాగించనున్నది. కీలక వడ్డీ రేట్ల పెంపుకు పరపతి విధాన కమిటీలోని సభ్యులందరూ.. చేతన్ ఘాటే, పమిదు వా, దవీంద్ర హెచ్. ధోలకియా, మైఖేల్ దేబబ్రాత పాత్ర, విరల్ వి. ఆచార్య, ఉర్జిత్ పటేల్ అనుకూలంగా ఓటేశారు. పరపతి విధాన కమిటీ సమావేశ వివరాలు(మినట్స్) జూన్ 20కల్లా ప్రచురించనున్నారు. కాగా 2018 జులై 31 నుంచి ఆగస్టు 1 వరకు మూడో త్రైమాసిక సమావేశం జరగనున్నది. ఆర్‌బిఐ వడ్డీరేట్లను 0.25 శాతం పెంచడంతో బాంబే స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సెన్సెక్స్ 276 పాయింట్లు పెరిగి 35,000 పాయింట్ల మీదే ముగిసింది. బుధవారం బిఎస్‌ఇ సెన్సెక్స్ ఆరంభంలో కొంత క్షీణత కనిపించినప్పటికీ పాలసీ విధానాన్ని ప్రకటించాక మళ్ళీ పుంజుకుంది. 201819 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బిఐ జిడిపి అంచనాను 7.4 శాతంగానే ఉంచింది. పెట్టుబడులు, అధిక వినియోగంకు ఇది ఊతం ఇవ్వనున్నట్లు భావిస్తోంది. వడ్డీ రేట్లను పెంచడం, జిడిపి వృద్ధిని 7.4గా అంచనా వేసినప్పటికీ ఆర్‌బిఐ విధానంలో మాత్రం తటస్థ వైఖరికే కట్టుబడింది.

Comments

comments