Home తాజా వార్తలు పావు శాతం కోత

పావు శాతం కోత

 

 6.25 శాతానికి తగ్గిన వడ్డీ రేటు
 హామీ లేని వ్యవసాయ రుణ పరిమితి పెంపు
 విధాన దృక్పథం ‘తటస్థం’కు మార్పు
 ఆర్‌బిఐ సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన గవర్నర్ శక్తికాంత దాస్

ఎట్టకేలకు ఆర్‌బిఐ వడ్డీ రేటును తగ్గించింది. గురువారం ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వడ్డీ రేట్లను (రెపో రేటు) 0.25 శాతం తగ్గిస్తున్నామని ప్రకటించారు. దీంతో వడ్డీ రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగొచ్చింది. గృహ, ఇతర రుణాలు చౌక కానున్నాయి. ద్రవ్యోల్బణ లక్షం స్థాయి అంచనా మేరకే ఉండవచ్చని ఆశిస్తున్నామని, అందుకే ఈసారి వడ్డీ రేట్లను తగ్గించామని దాస్ తెలిపారు. అలాగే ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షకు ఆర్‌బిఐ పెంచింది. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మేలు జరుగుతుందని పేర్కొంది. ఉర్జిత్ పటేల్ రాజీనామా తర్వాత ఆర్‌బిఐ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన శక్తికాంత దాస్‌కు ఇది తొలి పాలసీ సమావేశం.

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆరో ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఆర్‌బిఐ పావు శాతం వడ్డీ రేటును తగ్గించింది. ఆర్‌బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ, ద్రవ్యోల్బణ లక్షం స్థాయి అంచనా మేరకే ఉండడడంతో కీలక వడ్డీ రేట్లను(రెపో రేటు) 0.25 శాతం తగ్గిస్తున్నామని అన్నారు. దీంతో వడ్డీ రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగొచ్చింది. గృహ, ఇతర రుణాలు చౌక కానున్నాయి. ద్రవ్యపరపతి విధాన దృక్పథాన్ని ‘క్రమాంకన బిగింపు’ నుంచి ‘తటస్థం’కు దాస్ మార్పు చేశారు. డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య, మరో సభ్యుడు చేతన్ ఘాటె రెపో రేటు యథాతథానికే ఓటు వేశారు. అయితే శక్తికాంత దాస్, మిగతా ముగ్గురు సభ్యులు పావు కోత విధించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు. ఇంకా రివర్స్ రెపో రేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి ఆర్‌బిఐ తగ్గించింది. రెపో రేటు అంటే ఆర్‌బిఐ నుంచి వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే రుణ నిధి.. అలాగే రివర్స్ రెపో రేటు బ్యాంకుల నుంచి ఆర్‌బిఐ సేవరించే నిధికి ఇచ్చే రేటు. ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షకు పెంచింది. వ్యవసాయ రుణాల సమీక్షకు వర్కింగ్ గ్రూప్‌ల ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించింది.
ద్రవ్యోల్బణం అంచనా 3.2 శాతం
ద్రవ్యోల్బణం అంచనాను డిసెంబర్‌లో 2.2 శాతంతో 18 నెలల కనిష్టానికి తగ్గించింది. మార్చి త్రైమాసికానికి గాను ద్రవ్యోల్బణం అంచనా 2.8 శాతానికి సవరించింది. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 3.2 3.4 శాతంగా, 2020 సంవత్సరానికి గాను 3.9 శాతంగా ఆర్‌బిఐ అంచనా వేసింది. ప్రైవేటు ఇన్వెస్ట్‌మెంట్‌లను మరింత బలోపేతం చేయాల్సి అవసరం ఉందని తీర్మానించింది. రేట్లను తగ్గించడంతో రుణాలు చౌక అవుతాయని, ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులకు ఊతం అందించనట్ట వుతుందని ఆర్‌బిఐ పేర్కొంది. జిడిపి వృద్ధి అంచనా 7.4% వచ్చే ఆర్థిక సంవత్సరానికి(201920) జిడిపి వృద్ధి అంచనా 7.4 శాతంగా ఉంది. ఇంతకుముందు 201819లో 7.2 శాతం నుంచి కొంత మేరకు ఆర్‌బిఐ పెంచింది. చమురు ధరల దృక్పథం అనిశ్చితిలో ఉంది. వాణిజ్య ఆందోళనలు అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. రూపాయి విలువ స్థిరత్వం కోసం ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్లపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ఆర్‌బిఐ ప్రతిపాదించింది. పెద్ద మొత్తంలో డిపాజిట్లలోనూ ఆర్‌బిఐ సవరణ చేసింది. సింగిల్ రూపీ డిపాజిట్లు ప్రస్తుతం రూ.కోటి ఉండగా, ఇప్పుడు రూ.2 కోట్లకు పెంచింది. అలాగే ఎన్‌బిఎఫ్‌సి(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ)ల విభాగంలో సామరస్యానికి మార్గదర్శకాలు జారీ చేయనున్నట్టు పేర్కొంది. మరోవైపు కార్పొరేట్ డెబిట్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పిఐ) పెట్టుబడులపై ఆంక్షలు తొలగించింది. వచ్చే ఎంపిసి సమావేసం ఏప్రిల్ 2 నుంచి 4 తేదీల మధ్య జరగనుంది.

ఆర్‌బిఐ సమీక్ష ముఖ్యాంశాలు

* ఆర్‌బిఐ కీలక వడ్డీ రేటులో(రెపో) 0.25 శాతం కోత విధించింది. దీంతో వడ్డీ రేటు 6.25 శాతానికి చేరింది.
* రివర్స్ రెపో రేటును 6.25 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. సిఆర్‌ఆర్ 4 శాతం, దీనిలో ఎలాంటి మార్పు చేయలేదు.
* ద్రవ్యోల్బణం అంచనా మార్చి త్రైమాసికానికి గాను 2.8%నికి సవరించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో 3.2     3.4 శాతంగా, 2020 సంవత్సరానికి గాను 3.9% గా ఆర్‌బిఐ అంచనా వేసింది.
* వచ్చే ఆర్థిక సంవత్సరానికి(201920) జిడిపి వృద్ధి అంచనా 7.4 శాతంగా ఉంది. ఇంతకుముందు 201819లో 7.2   శాతంగా ఉంది.
* ఏప్రిల్‌సెప్టెంబర్ వృద్ధి రేటు 7.2 నుంచి 7.4% మధ్యలో ఉండనుంది. అలాగే 201920 క్యూ3లో 7.5%గా ఆర్‌బిఐ అంచనా వేసింది.
* చమురు ధరల దృక్పథం అనిశ్చితిలో ఉంది. వాణిజ్య ఆందోళనలు అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి.
* కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలు సానుకూలంగా ఉన్నాయి.
* పెద్ద మొత్తంలో డిపాజిట్లలోనూ ఆర్‌బిఐ సవరణ చేసింది. సింగిల్ రూపీ డిపాజిట్లు ప్రస్తుతం కోటి ఉండగా, ఇప్పుడు రూ.2 కోట్లకు పెంచింది.
* ఎన్‌బిఎఫ్‌సి(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ)ల విభాగంలో సామరస్యానికి మార్గదర్శకాలు జారీ.
* రూపాయి విలువ స్థిరత్వం కోసం ఆఫ్‌షోర్ రూపీ మార్కెట్లపై టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదన.
* కార్పొరేట్ డెబిట్ మార్కెట్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల(ఎఫ్‌పిఐ) పెట్టుబడులపై ఆంక్షలు తొలగింపు.
* పేమెంట్ గేట్‌వే సర్వీస్ అందించేవారు, పేమెంట్ అగ్రిగేటర్లపై చర్చల పత్రాలతో రానున్నామని చెప్పిన ఆర్‌బిఐ.
* ఎలాంటి హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని రూ.లక్ష నుంచి రూ.1.6 లక్షకు పెంచింది. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతులకు మేలు జరగనుందని పేర్కొంది.
* వ్యవసాయ రుణాల సమీక్షకు వర్కింగ్ గ్రూప్‌ల ఏర్పాటు.
* రేటు తగ్గింపునకు అనుకూలంగా 4:2 నిష్పత్తితో ఎంపిసి(ద్రవ్య విధాన కమిటీ) ఓటు వేసింది.
* ఇద్దరు ఎంపిసి సభ్యులు చేతన్ ఘాటే, విరాల్ ఆచార్యలు రేటును యథాతథంగా కొనసాగించాలని ఓటు వేశారు.
* వచ్చే ఎంపిసి సమావేసం ఏప్రిల్ 2 నుంచి 4 తేదీల మధ్య జరగనుంది.