Home దునియా కాఫీ బ్రేక్

కాఫీ బ్రేక్

Cartoons

ప్రవీణ్ , టింకూని నిద్రలేపి బ్రష్ చేయించెయ్యవా ప్లీజ్‌” అంది విద్య హడావిడి పడుతూ. ‘నాకు అసలు కుదరదు. ఇవాళ తొందరగా వెళ్లిపోవాలి ఆఫీసుకి.’ అని మంచం మీద నుంచి గబగబ లేచి బాత్‌రూంలోకి దూరాడు ప్రవీణ్. ఇవాళెందుకో విద్యకు త్వరగా మెలకువ రాలేదు. ఇంకో పావుగంటలో టింకూ స్కూల్ వ్యాన్ వచ్చేస్తుంది. ఏడుపు ముంచుకొచ్చింది విద్యకు. తనకి ఆఫీసులో ఇంటర్నేషనల్ డెలిగేట్స్‌తో మీటింగ్. ఏమాత్రం ఆలస్యం కావడానికి లేదు. కాని ఇప్పుడు ఇంట్లో ఏపనీ చేయక తప్పేట్టు లేదు.

ప్రవీణ్ మంచివాడు. చాలా విలువలున్నవాడు. భార్య, బాబు, కుటుంబం అంటే చాలా ప్రేమ ఉన్నవాడు. కాని పని విషయానికి వస్తే మాత్రం సులువుగా తప్పించేసుకుంటాడు. అతనితోపాటుగా సంపాదిస్తుంది. అయినా ఇంటిపనిలో ప్రవీణ్ సహకారం ఏమాత్రం దొరకదని విద్య కంప్లయింట్. అత్తగారున్నప్పుడు ప్రవీణ్ ఆఫీసుకి వెళ్లేవరకు అతనికి అన్నీ అందుబాటులో ఉండేలా చూడాలి. ఇడ్లీలో కారప్పొడితో సరిపెడదామనుకుంటే అతను ఒప్పుకున్నా అత్తగారు ఒప్పుకునేవారు కాదు. లాంఛనంగా చట్నీ, సాంబార్ చెయ్యాల్సిందే. అలా అని ఆవిడ కూడా కోడల్ని రాచి రంపాన పెట్టాలనుకునే ఆవిడ కాదు. విద్యను ఎంతో ప్రేమగా చూస్తుంది.

కాని జెండర్ పాత్రను మాత్రం ఆ ప్రేమ నుంచి విడదీస్తుంది. ఎంత ఉద్యోగస్తురాలైతేనేం. ఇంటిపని చేసుకోవడం, మొగుడికి, పిల్లలకు పెట్టుకోవడం తప్పదు కదా అన్న యాక్సెప్టెన్సీ ధోరణి. విద్య పోరు పడలేక ఎప్పుడన్నా ప్రవీణ్ వంటింట్లో వెల్లుల్లి పొట్టు తీయడం, ఉల్లిపాయ తరిగిపెట్టడం లాటివి చేశాడంటే ఆవిడ ముఖం అదోలా పెట్టుకునేది. మగపిల్లాడితో పనిచేయించడం ఏంటి అనే అభిప్రాయం ఆవిడది. పైగా కోడలు అలా కొడుకు చేత చాకిరి చేయించుకుంటుందేమో అలవాటుగా అనే భయం, ఇంకా ఎక్కడ చులకనైపోయి ఆ అమ్మాయి చెప్పినట్టల్లా ఆడేస్తాడేమో అనే ఆలోచనతో, ‘నువ్వు వచ్చేయరా, నేను చేస్తా’నంటూ ఆవిడ వంటింట్లోకి వస్తే, పెద్దావిడతో పని చేయించలేక ప్రవీణ్‌ని వెళ్లిపోమని సైగ చేయక తప్పని పరిస్థితి. అత్తగారు పోయిన తర్వాత అయినా అదే పరిస్థితి.

తన చావు తాను చావాల్సిందే. సాయంత్రం అతనిలాగే తను కూడా అలిసిపోయి ఇంటికి వస్తుంది. ఉదయం వదిలేసి పోయిన ఇల్లు. సర్దుకోవాలి, సాయంత్రం స్నాక్స్, రాత్రి వంటతో పాటు టింకూని చదివించాలి. కనీసం వాడిని చదివించే బాధ్యత తీసుకోమని వీలైనప్పుడల్లా గొడవ పడుతుంది. ఏరోజుకా రోజు రేపట్నుంచి అంటాడు. చదివించే బాధ్యత మాత్రం తీసుకోడు. “స్వీటీ, పిన్ని ఒక్కతే కష్టపడి భోజనానికి సిద్ధం చేస్తోంది. వెళ్లి కొంచెం కంచాలు, నీళ్లు పెట్టి సహాయం చెయ్యచ్చు కదా!’ అన్న మామయ్య మాటకి ఇంతెత్తున లేచింది పదహారేళ్ల స్వీటీ. ‘మీ అబ్బాయిలు కూడా ఉన్నారు కదా మామయ్య! వాళ్లకి చెప్పు పని. నాకెందుకు చెప్తున్నావు. అమ్మాయిననా. నాతో పెట్టుకోకు. పక్కా ఫెమినిస్టుని.’ అంది. ‘ఎంత ఫెమినిస్టువైనా నీకు వంటిల్లు తప్పదే. అందుకే ముందుగా ట్రెయినింగ్ తీసుకో.’ అని వెటకారం చేశాడతను.

‘ఆడు మగాడ్రా బుజ్జీ!, ఇన్నాళ్లకు ఒక మగాడొచ్చాడు’ ఇలాటి డైలాగుల్ని నిజ జీవితంలో రంగరించుకుంటారు జనం. మగ పుట్టుక పుట్టడమే చాలా గొప్ప అన్న ఉద్దేశ్యం రెండు జెండర్లకి ఉంటుంది ఏమాత్రం సందేహం లేకుండా. లేకుంటే కూతురికంటే కొడుక్కే పెద్ద పీట తల్లి ఎందుకు వేస్తుంది? అత్తగారికి కోడలంటే చిన్న చూపు ఎందుకుంటుంది? ఉద్యోగం పురుష లక్షణం అనే మాట చాలా పురాతనమైంది. ఇప్పుడు రెండు చేతులు కలవాల్సిందే. అప్పుడే సౌకర్యవంతంగా జీవితాలు గడుస్తున్నాయి.

అంటే జెండర్ పాత్ర అక్కడ మారింది. జెండర్ పాత్రలో ఈ విషయంలో మార్పుని యాక్సెప్ట్ చేసేసింది మన సో కాల్డ్ సమాజం, ఇంకా కుటుంబాలు. అంటే పాపం మగవాడికి అనుకూలంగా, అతన్ని మరింత సుఖపెట్టేవన్నీ త్వరగా స్వీకరిస్తారు. అమలు కూడా అంత కష్టం కాదు. ఉద్యోగం చెయ్యడం ఆర్థిక స్వాతంత్య్రం, సాధికారత అనుకుని సంబరపడగానే సరిపోవట్లేదు. రెండు బాధ్యతలు తలకెత్తుకుని, బ్యాలన్సు తప్పి కింద పడే పరిస్థితి. కొన్ని ఇళ్లలో పెద్ద జీతం భార్యదే ఉంటుంది. ఇంకా కొన్ని ఇళ్లలో సంపాదనతో పాటు ఇంటి బాధ్యతలన్నీ తలకెత్తుకుని ఏటికెదురీదే మహిళలు ఉంటారు.

అయినా ఇంటిపని విషయంలో మాత్రం జెండర్ పాత్ర మారదు. చేతన్ భగత్ భార్యను ప్రోత్సహిస్తూ తాను ఉద్యోగం మానేసి పిల్లల ఆలనా పాలనా చూసుకుంటాడు. అటువంటి చాలా కొన్ని ఉదాహరణలను గొప్ప విషయాలుగా చెప్పుకుంటారు. మరి ప్రతి ఇంట్లో ప్రతి మహిళ చేసేది అదే తరాలుగా. అయినా దానికేమాత్రం గుర్తింపు ఉండదు. ఇంటి పనే కదా అనే చులకన భావం. ఆ చిన్న పని చిన్న జెండర్ చెయాలనే చిన్న ఆలోచన. ఈ మూసలోంచి బయటకు వస్తున్నారు. కాని చాలా నెమ్మదిగా. పూర్తిగా జెండర్ పాత్రల్లో మార్పులు రావడానికి ఇంకా కొన్ని తరాలు సులువుగా పడుతుంది.

జెండర్ అంశం మీద వచ్చిన సినిమానే ‘క ఔర్ కి’. హౌస్ హజ్బెండ్‌గా ఉంటానని అతనంటే భార్య కూడా ఆమాట నలుగురికి చెప్పుకోడానికి సిగ్గుపడుతుంది. తన భర్త ఇంట్లో ఉండి పుస్తకాలు రాస్తాడని చెప్తుంది. ‘ఎందుకలా చెప్పావ్. నీక్కూడా నేను ఇంట్లో ఉండి ఇంటిపని చూసుకుంటానని చెప్పడం నలుగురిలో పల్చనగా భావిస్తునావా’ అని అడుగుతాడు. ఏదైనా అంతే. కొత్త వింతే. పాతబడితే అలవాటవుతుంది. సమాజంలో ఒక పరంపరగా, రక్తంలో ఒక అలవాటుగా మారిపోయినవాటిని మార్చడం, మారాలనుకోవడమే గొప్ప మార్పుగా అనుకోవాలి. ఆ ఆలోచనని స్వీకరిస్తే మార్పు వచ్చినప్పుడు చూద్దాం.