Home కామారెడ్డి ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి

District Collector Dr. N. Satyanarayana

 

జిల్లా కలెక్టర్ డా. ఎన్. సత్యనారాయణ

మన తెలంగాణ/కామారెడ్డి: ఈ నెల 27 నుండి మొదలయ్యే ఇంటర్ పరీక్షలను పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డా॥ ఎన్. సత్యనారాయణ తెలిపారు. గురువారం జనహిత భవన్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంట్ అధికారులు, సిట్టింగ్ స్కాడ్, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పరీక్షా కేంద్రాలకు సంబంధించి తాగునీటి వసతి, పార్కింగ్ వసతి, వాష్‌రూమ్స్ వసతి, ఫ్యాన్ సౌకర్యం, రాతబల్లలు, తగినంత మంది ఇన్విజిలేటర్లను, విద్యుత్ వసతి, ఇంటర్నెట్, సిసి కెమెరాలు తప్పనిసరిగా సమకూర్చుకోవాలని తెలిపారు. పరీక్షా కేంద్రాలలో ఎటువంటి పొరపాట్లకు తావివ్వకుండా సిఎస్‌డిఓలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. పరీక్షా కేంద్రానికి పరీక్ష సమయం కన్నా ముందుగానే బస్సులలో విద్యార్థులను తీసుకువచ్చేలా చూడాలని ఆర్‌టిసి అధికారులను, పరీక్ష కేంద్రాలలో విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ సిబ్బందిని, ఫస్ట్ ఎయిడ్ పరికరాలతో ప్యారా మెడికల్ సిబ్బంది సిద్ధంగా వుండాలని పేర్కొన్నారు.

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు, బందోబస్తు ఏర్పాట్లు, పరీక్షా సమయంలో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశిస్తూ సంబంధిత అధికారులు సమన్వయంతో పరీక్షలు విజయవంతం చేయాలని తెలిపారు. ఇంటర్మీడియట్ నోడల్ అధికారి డి.నాగరాజు పరీక్షల వివరాలను తెలియజేస్తూ, ఈ నెల 27 నుండి మార్చి 15 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించడం జరుగుతున్నదని, పరీక్షల రోజు ఉదయం 8 గంటల నుండి 8.45 లోగా విద్యార్థులు తమకు కేటాయించిన పరీక్షా కేంద్రాలలో తమతమ సీట్లలో కూర్చోవాలని, ఉదయం 8.45 నుండి 9 గంటల వరకు వచ్చే విద్యార్థుల పేర్లను కేంద్రాలలో నమోదు చేయాలని, ఉదయం 9 గంటల తరువాత ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రాలలోనికి అనుమతించబడదని తెలిపారు. జిల్లాలో 28 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు అయినట్లు, 22,046 మంది విద్యార్థులు ఇంటర్ పరీక్షకు హాజరవుతున్నట్లు, 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 28 మంది డిపార్టుమెంటల్ అధికారులు, నలుగురు సిట్టింగ్ స్కాడ్‌లను, ఇద్దరు ఫ్లయింగ్ స్కాడ్‌లను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరీక్ష నిర్వహణ కమిటీ సభ్యులు ఎల్.మధూకర్, జి.దామోదర్ రెడ్డి, ప్రిన్సిపల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనాథ్, జూనియర్ లెక్చరర్ల సెక్రటరీ నరేందర్, ప్రయివేటు కళాశాలల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Intermediate public exams to start from February 27