Home ఆఫ్ బీట్ యోగాతో అంతర్గత ప్రశాంతత

యోగాతో అంతర్గత ప్రశాంతత

21న అంతర్జాతీయ యోగా దినోత్సవం

యోగా అంటే కేవలం కొన్ని శారీరక కదలికలు (ఆసనాలు), శ్వాస ప్రక్రియ అనే అందరూ అనుకుంటారు. నిజానికి మానవుని అనంతమైన మేధాశక్తి ,ఆత్మశక్తుల కలయికే యోగ. జ్ఞాన యోగము (తత్వశాస్త్రము ), భక్తి యోగము , రాజ యోగము, కర్మ  యోగములు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు యోగా డేని జరుపుకుంటున్నాయి. పెద్దవారైన, చిన్నవారైన, ధృఢంగా ఉన్నవారు, లేనివారు, ముసలివారు, మానసిక వికలాంగులు,  దివ్యాంగులు ఎవరైనా యోగా చేయవచ్చు. యోగ సాధన చేస్తే శరీరానికి దృఢత్వం, బలం వస్తుంది. పసి పిల్లలు వారికి తెలీకుండా కాళ్లూచేతులు వంచటం వల్ల మకరాసనం, పవన ముక్తాసనం చేస్తూనే ఉంటారు.  పెద్దవారు చేసే  ప్రాణాయామంతో వారికి శ్వాసమీద పట్టు వస్తుంది. శరీరంలోని అధిక  ప్రాణవాయువును రక్తంలోనికి, మెదడులోనికి చేరుస్తుంది. ఇప్పుడు కొన్ని  పాఠశాలల్లో యోగా సాధన చేయిస్తున్నారు. యోగా గురు బాబా రాందేవ్ అహ్మదాబాద్‌లో మూడు లక్షలమందితో యోగాసనాలు వేయించారు. గత సంవత్సరం మైసూరులో 54,101 మందితో చేసిన యోగా విన్యాసాలు గిన్నిస్ రికార్డు కెక్కింది. యోగా డే సందర్భంగా యూఎన్ ప్రత్యేక స్టాంపును విడుదల చేసింది. ఈ స్టాంపులపై ‘ఓం’ చిహ్నంతో పాటు వివిధ రకాల యోగాసనాలను కూడా ముద్రించింది.

Yoga

ప్రాణాయామం, యోగాసనాలు శరీరానికి, మనస్సుకు స్వచ్ఛతను ఇస్తాయి. ఈ యోగా చేస్తున్నవారికి వారి జీవన విధానంలో మంచి మార్పులు ఉంటాయి. విద్యార్థులు, పెద్ద వారు ఇంటి వద్దే చేసుకుని తమ ఆరోగ్యాన్ని మెరుగు పరచుకోవచ్చు. బిపి, షుగర్, అల్సర్, గుండె జబ్బులు, ఆస్తమా, స్పాండిలైటిజ్, మ్రైగేన్, కేన్సర్ లాంటి దీర్ఘకాలికమైన రోగాల నుండి బయటపడవచ్చు. యోగాతో ఇతరులతో మసలుకునే విధానంలో కూడా మార్పులు వస్తాయి. సినీ రంగంలో ఇలియానా, హన్సిక, త్రిష, శ్రియశరన్, తమన్నా, అమలాపాల్, అనుష్కశెట్టి లాంటి అందగత్తెలు తమ శరీరాకృతి అందంగా, బాడీ ఫిట్ గా ఉండటానికి యోగానే కారణమని చెస్తుంటారు. ఐశ్వర్యారాయ్, బిపాసాబసు, రాణి ముఖర్జీ లాంటి వారు యోగా సాధన చేసి ఫిట్‌నుస్‌ను కాపాడుకుంటున్నారు.

యోగా మతాచారం కాదని, పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య బీమా అని, శారీరక మానసిక సమన్వయానికి దోహదం చేస్తుందని ప్రధాని మోడీ చెప్పారు. ఇప్పుడు యోగాసనాలు తెలుసుకోవడానికి ప్రత్యేకమైన యాప్‌లు, వెబ్‌సైట్‌లు కూడా వచ్చేసాయి. యానిమేటెడ్ గైడ్స్ వీటిని వివరించి చెబుతాయి. అంతేకాదు యోగా ద్వారా ఇతరులతో మీ అభిప్రాయాలను కూడా పంచుకోవచ్చు. ఫిజికల్ ఫిట్‌నెస్‌ను పెంచుకుని ప్రతిఒక్కరూ తమ జీవితంలో యోగాని ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యవంతంగా జీవించవచ్చు. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా సాధన చేసే టాలీవుడ్ నటుల మనోభావాలను తెలుసుకుందాం.

* బాలీవుడ్ తార శిల్పాశెట్టి యోగా గురించి మాట్లాడుతూ ‘నేను గతంలో స్పాండిలైటిస్ వ్యాధితో బాధపడేదాన్ని. నెక్ సమస్య ఉండేది. నిపుణల దగ్గర యోగా శిక్షణ తీసుకున్నాను. యోగా చేస్తుంటే చాలా బావుంది. శరీరం, మెదడును ఫిట్‌గా ఉంచుతోంది’ అని చెప్పింది.
-* సోనం కపూర్ బిక్రం యోగా సాధన చేస్తుందిట.

* -ప్రముఖ నటి కరీనా కపూర్ యోగా నా జీవితాన్నే మార్చివేసిందంటుంది. ఉదయం గంటన్నర యోగా సాధన చేయటం వల్ల ఆ రోజంతా సక్రమంగా నడుస్తుందని అంటోంది. యోగా సాధనచేయని రోజు నాకు ఏ పనీ పూర్తి అవదు’ ఒక ఇంటర్వూలో చెప్పింది.
-* అమెరికాలోని టాప్ మోడల్ క్రిస్టీటర్లింగ్ టన్ ‘యోగా అంటే నాకు చాలా ఇష్టం. యోగా అంటే మనకి ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా ఎంతో ఉపయోగకరమంది. 18 సంవత్సరాల వయసునుండే యోగాలో శిక్షణ తీసుకుని అభ్యసిస్తోంది.

* బాలీవుడ్ తార కొంకణ్‌సేన్ తన శరీరాకృతి అందంగా ఉంచుకోవటం యోగా వల్లే సాధ్యమైందదని అంటుంది.
* కంగనా రనౌత్ ‘నేను క్రమం తప్పకుండా యోగా చేస్తాను, ఇంకా సమతుల ఆహారం తింటాను’ అని యోగాపై అభిమానాన్ని చాటింది.
-* ప్రపంచంలో చాలామంది అభిమానించే మార్టిన్ మాట్లాడుతూ ‘యోగా వల్ల అంతర్గత ప్రశాంతతను పొందుతున్నాను. హఠ యోగా అంటే ఇష్టం. గుండె, మెదడు, శరీర స్థిరత్వాన్ని సాధించడానికి యోగా ఎంతో దోహదపడింది’ అని చెప్పింది.
-* బాలీవుడ్ బ్యూటీ లారాదత్త మాట్లాడుతూ తన కూతురు సైరాకు జన్మనిచ్చిన తరువాత తిరిగి సరైన శరీర ఆకారాన్ని పొందటంలో యోగా చాలా సహాయపడిందని, కఠినమైన నియమావళి, వ్యాయామం కూడా సహాయం చేసిందని చెప్పింది.

-* సెలబ్రిటీలు వ్యాయామ శిక్షణకు ప్రతి నెలా కొంత మొత్తాన్ని ఖర్చు పెడుతుంటారు. ప్రముఖ యోగా శిక్షకురాలు పాయల్ గిద్వానీ తివారీ ముంబయి శిక్షణా కేంద్రాన్ని నడుపుతున్నారు. సైఫ్ ఆలీఖాన్, కరీనా కపూర్ కూడా ఆమె దగ్గరే యోగాను అభ్యసించారు. నెలలో 12 తరగతులు చెపుతారు. వ్యక్తిగతంగా మనిషికి రూ.6000/- చొప్పున తీసుకుంటారు. ఈమె తరగతులకు సెలబ్రిటీలతోపాటు సామాన్యులు కూడా క్యూ కడుతుంటారు.

-* యాస్‌మిన్ కరాచీవాలా యోగా నిపుణురాలు. కత్రినా కైఫ్, అలియాభట్, కరీనాకపూర్, దీపికా పడుకొనే లాంటి వారు ఈమె దగ్గరే యోగా నేర్చుకున్నారు. 22 ఏళ్ళ నుండి ఎంతోమందికి గురువుగా ఉండి వ్యాయామాన్ని నేర్పారు. చాలా అవార్డులు కూడా అందుకుంది. యాస్‌మిన్ 12 తరగతులకు రూ.19,500/ లను తీసుకుంటుంది.
యోగా ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి. రోగాలకు దూరంగా ఉండాలంటే, ప్రశాతంగా జీవించాలంటే నిత్యం యోగా చేయాలి. అనారోగ్యా నికి దూరంగా ఉండండి, యోగా చేయండి అంటూ సెలబ్రిటీలంతా తమఅభిమానులకు సందేశాన్ని ఇస్తున్నారు. కేవలం అందంగా ఉండటానికే కాదు శరీరం ఫిట్‌నెస్‌గా ఉంచుకోవడానికి యోగా తప్పనిసరి.