Home దునియా నాట్యం..ఆరోగ్య దాయకం

నాట్యం..ఆరోగ్య దాయకం

Dance

నాట్యం అంటే శివుడు.. శివుని తాండవం లయ కారకం.. లాస్యం సృష్టికారకం.. శివుడు చేసే నృత్యాన్ని తాండవమని, పార్వతీదేవి చేసే నృత్యాన్ని లాస్యం అని పిలుస్తారు.. తాండవం, లాస్యం కలిస్తే ఆనంద తాండవం. సంగీత పారవశ్యానికి లోనై శరీరం తనంతట తానే లయ బద్ధంగా కదలడమే నృత్యం. అలాంటి నృత్యానికి ఓ గుర్తింపు నిచ్చింది ఐక్యరాజ్య సమితి. భారతీయ నృత్యపరిధి చాలా విస్తృతమైనది. ప్రాచీన శాస్త్రీయ, ప్రాంతీయ, జానపద, ఆధునిక నృత్యరీతులు ఈ కోవలోకి వస్తాయి. నాట్యం కేవలం ప్రదర్శనకే పరిమితం చేయడంలేదు ఇప్పటి నృత్య కళాకారులు. అన్ని ప్రత్యేకతలను మేళవించి నాట్యానికి ఓ పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేస్తున్నారు కొంత మంది. అలాంటివారిలో డా॥ సురభి లక్ష్మీశారద ఒకరు.

29న అంతర్జాతీయ నృత్య దినోత్సవం

ఆరోఏట నుంచే భరత నాట్యాన్ని అభ్యసించింది లక్ష్మీశారద. నాలుగేళ్ల పాటు ప్రఖ్యాత గురువు కళాప్రపూర్ణ డా॥ కోరాడ నరసింహారావు వద్ద నృత్యాన్ని అభ్యసించి, అనేక రాష్ట్రాల్లో భరత నాట్యం, కూచిపూడిని ప్రదర్శించి తనకంటూ ప్రత్యేక గుర్తింపును సాధించింది. మాస్టర్ ఆఫ్ పెర్మార్మింగ్ ఆర్ట్‌లో రెండేళ్ల మెరిట్ స్కాలర్‌షిప్‌ను పొందింది. ఇంటర్నేషనల్ యూత్ ఫెస్టివల్స్‌లో పాల్గొని నృత్యాన్ని ఖండాంతరంగా వ్యాప్తి చేసింది. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా సాధించింది లక్ష్మీశారద. భారత ప్రభుత్వ గేయనాటక విభాగం శారద నృత్యాన్ని గుర్తించి ప్రభుత్వ కళాకారిణిగా శాశ్వత ప్రాతిపదికన స్థానం కల్పించడం విశేషం.

ఎ.ఆర్. రెహమాన్ వందేమాతరాన్ని మొట్టమొదట శాస్త్రీయ శైలిలో నృత్య దర్శకత్వం వహించి తను ప్రదర్శించి, విద్యార్థుల చేత ప్రదర్శింపచేసిందీమె. స్వతంత్ర భారతి, కృష్ణ, గోదావరి పుష్కరాలు, ఉగాది వంటి నృత్య రూపకాలకి ఇంటర్నేషనల్ డాన్స్ ఫెస్టివల్స్‌లో జేసుదాసు స్వాగతం కృష్ణ వంటి గీతాలకు నృత్య రూపకాల్ని దర్శకత్వం వహించి ప్రదర్శించింది.

సంస్కృతిలో భాగమైన నృత్యాన్ని తనతో ఆపకుండా శ్రీ సురభి అకాడమీ ఆఫ్ పెర్ఫార్మింగ్ ఆర్ట్ స్థాపించి కొన్ని వందల మంది పాఠశాల, కళాశాల విద్యార్థినులకు నృత్యాన్ని నేర్పిస్తోంది. గురుశిష్య పరంపర సంప్రదాయాన్ని, దాని ప్రాముఖ్యతను వివరిస్తూ తిరుపతి, అహ్మదాబాద్, కేరళ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్‌లోని రవీంద్రభారతి, త్యాగరాయ గానసభ, తారామతి బారాదరి వంటి రంగస్థలాలలో లెక్కలేనన్ని సన్మానాలు, అవార్డులు, రివార్డులు పొందింది. సామాజిక ప్రయోజనం కోసం ‘నృత్య చికిత్స’ అంశంపై గత నాలుగు సంవత్సరాలుగా పరిశోధన చేస్తోంది. కళద్వారా సమాజానికి ఏదైనా ఇవ్వాలన్న తపనతో సృష్టించిన ఈ పరిశోధన తనపైన తాను ప్రయోగించుకుని, ఫలం పొందాక నలుగురికి ఉపయోగపడేలా ‘డాక్టర్స్’తో కలిసి వర్క్ షాప్‌ని నిర్వహించింది. దానిపై ప్రత్యేక నృత్యాన్ని రూపొందించి, అన్ని వయసుల వారి పైన ప్రయోగాలు, పరిశోధనలు చేస్తూ శాస్త్రీయ నృత్యానికి ఔషధ గుణ ముందని నిరూపిస్తోంది.

నృత్యాన్ని చేయడం, దర్శకత్వం వహించడం, దానికి వ్యాఖ్యానం చేయడం, గురువుగా, సంస్థ స్థాపకురాలిగా ఉంటూ మరో కొత్త కోణం నిర్వాహకురాలిగా 2014 నుండి ప్రతి సంవత్సరం అనేక మంది అన్ని వయసుల నృత్య కళాకారులను ప్రోత్సహిస్తూ, గురువులను సత్కరిస్తోంది శారద. 2014లో సంగీత వాద్య నృత్యోత్సవం, 2015లో నృత్యోత్సవం, 2016లో నేషనల్ డాన్స్ ఫెస్టివల్‌లో, 2017లో నేషనల్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్, 2018లో ఇంటర్నేషనల్ మ్యూజిక్ అండ్ డాన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శనలిచ్చింది.

అమెరికా, కేరళ, ఖాట్మండ్‌లో, దుబాయ్‌లో కూడా ప్రదర్శనలు ఇవ్వడానికి, సంస్కృతిని ప్రపంచ స్థాయికి తీసుకు వెళ్లటానికి సిద్ధంగా ఉంది. ప్రదర్శన కళాకారిణిగా, నృత్య దర్శకురాలిగా, గురువుగా, శ్రీ సురభి సంస్థ స్థాపకురాలిగా, ఒక నిర్వాహకురాలి గా, సామాజిక ప్రయోజనం కోసం (నృత్య చికిత్స ద్వారా) తపిస్తూ, విభిన్న కోణాలలో నృత్యాన్ని ఆవిష్కరింప చేస్తున్న శారదకు అంతర్జాతీయ న్యత్య దినోత్సవం సందర్భంగా విషెస్ చెబుదాం…