Home వార్తలు అంతర్జాతీయ చిత్రోత్సవాలకు హైదరాబాద్ శాశ్వత వేదిక కావాలి

అంతర్జాతీయ చిత్రోత్సవాలకు హైదరాబాద్ శాశ్వత వేదిక కావాలి

iff“అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల ద్వారా మన దర్శకనిర్మాతలు, రచయితలు ప్రపంచవ్యాప్తంగా సినిమా రంగంలో ఏమి జరుగుతుందో తెలుసుకోగల్గుతారు. ఒకే మూసలో ఆలోచించే పరిశ్రమకు ‘అంతర్జాతీయ చిత్రోత్సవం’ ఒక కిటికీగా నిలిచి కొత్త విషయాలను చూసేందుకు వీలుకల్పిస్తుంది”అని అన్నారు ప్రముఖ తెలంగాణ దర్శకనిర్మాత అల్లాణి శ్రీధర్. కొమరం భీమ్, గౌతమబుద్ధ వంటి కళాత్మక చిత్రాల దర్శకుడిగా ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్న ఆయన హైదరాబాద్ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ‘ఇండీవుడ్ ఫిలిమ్ కార్నివాల్’లో తెలుగు చిత్ర పరిశ్రమ ప్రతినిధులలో ఒకరిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లాణి శ్రీధర్ మాట్లాడుతూ “నేడు హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రముఖ చిత్ర పరిశ్రమ కేంద్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో జరిగిన ‘ఇండీవుడ్ ఫిలిమ్ కార్నివాల్’ కంటెంట్ పరంగా, టెక్నాలజీ పరంగా, మార్కెటింగ్‌పరంగా ఎన్నెన్నో విషయాలను ప్రత్యక్షంగా ఆయా రంగాల నిపుణులతో నేరుగా చర్చించి తెలుసుకునే అవకాశం కల్పించింది. అయితే ఇక్కడ కార్యక్రమాలు జరిగిన ప్రధాన ఆడిటోరియంకు సత్యజిత్‌రాయ్ హాలు అని పేరు పెట్టడం బావుంది. అయితే తెలుగు చిత్ర పరిశ్రమ కేంద్రమైన హైదరాబాద్‌లో ఈ చిత్రోత్సవం జరిగింది కాబట్టి మన సినీ ప్రముఖులు కె.వి.రెడ్డి, ఎన్‌టిఆర్, ఎఎన్‌ఆర్, బి.ఎన్.రెడ్డి వంటి మహానుభావుల పేర్లను కొన్నింటికైనా పెడితే బాగుండేది. తెలుగు సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చిన తెలంగాణ సినిమాలు, చరిత్రను ఒక ప్రత్యేక అంశంగా చూపిస్తే బాగుండేది. ఒక ఉత్తమ ప్రాంతీయ చిత్రమే అత్యుత్తమ అంతర్జాతీయ చిత్రమవుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ హీరోలు, దర్శకులు ఈ చిత్రోత్సవంలో పాల్గొంటే బావుండేది. కానీ ప్రముఖ భారతీయ దర్శకులు శ్యామ్ బెనగల్, గౌతమ్ ఘోష్, బి.నరసింగరావులు ఈ చిత్రోత్సవంలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ చిత్రోత్సవం విజయవంతంగా కొనసాగడానికి రాష్ట్ర సిఎం కెసిఆర్ ఆదేశాల మేరకు కృషిచేసిన సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రామోజీ ఫిలిమ్ సిటీ అధినేత సి.హెచ్.రామోజీరావు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. భవిష్యత్‌లో ఇటువంటి ఫిలిమ్‌ఫెస్టివల్స్‌కు హైదరాబాద్ నగరం శాశ్వత వేదిక కావాలని కోరుకుంటున్నాం”అని తెలిపారు.