Home ఆఫ్ బీట్ ఆంధ్రనాట్యానికి అంతర్జాతీయ గుర్తింపు …

ఆంధ్రనాట్యానికి అంతర్జాతీయ గుర్తింపు …

lf

విద్య, ఉద్యోగం, కళలు, కుటుంబ జీవితం ఇలా అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యత ఇచ్చే మహిళలు భారతీయ సమాజంలో అరుదుగా కనిపిస్తారు. అలాంటి అరుదైన ఘనత సాధించుకున్నవారిలో ఢిల్లీలో ఉంటున్న డా॥వేదాంతం రమణి గిరి ఒకరు.
సాధారణంగా మహిళలకు ఇంటిపనులు, పిల్లలను పెంచటంలోనే చాలా సమయం ఖర్చయిపోతుంది. కాని రమణి అటు ఇంటి పనులు, ఉద్యోగం చేస్తూ ఎంత అలసటగా ఉన్నా రోజూ నాట్యాన్ని అభ్యాసం చేస్తూ తన శిష్యులకు పాఠాలు చెబుతూ తనకిష్టమైన నాట్యరంగంలో రాణిస్తూ ప్రశంసలతో పాటు అవార్డులు పురస్కారాలు అందుకుంటున్న రమణిగిరిని అఖిల పలకరించింది.

తమిళనాడుకు చెందిన భరతనాట్యంలాగే ఆంధ్రులకు ప్రత్యేకమైన ఆంధ్ర నాట్యంలో ప్రావీణ్యం సంపాదించింది రమణిగిరి. ఆంధ్ర నాట్యమనే ఓ ప్రత్యేక నాట్యరీతికి జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావాలనే ధృడసంకల్పంతో ఎన్నో పరిశోధనలు సాగించింది. దాంతో పాటు క్షేత్రయ్య తేట తెలుగు పదాలపై పరిశోధనలు చేసింది. ఆంధ్రనాట్యరీతులను తెలియజేస్తూ ఆమె ఇచ్చిన ప్రదర్శనల ద్వారా ప్రశంసలతో పాటు అవార్డులు, పురస్కారాలు పొందింది. ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ టాలెంట్ అకాడమీ నిర్వహించిన అందాలపోటీలలో మూడుసార్లు ఫస్ట్ రన్నరప్‌కు చేరుకుంది. స్వాతి సపరివార పత్రిక నిర్వహించిన అందాల పోటీల్లో స్వాతి సుకుమారి అనే బిరుదును పొందింది. వేదాంతం రమణి గిరి భర్త వేదాంతం గిరి ప్రస్తుతం ఢిల్లీలోని తెలంగాణభవన్ అడిషనల్ రెసిడెంట్ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. రమభర్తతో పాటు ఢిల్లీలో ఉంటూ ప్రవాసాంధ్రులకు ఆంధ్రనాట్యంలో ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తూ సామాజిక సేవలో తనవంతు పాత్ర నిర్వహిస్తోందీమె. భర్త సివిల్ సర్వీస్ అధికారి అయినప్పటికీ, తన సొంత కాళ్లపై నిలబడాలనే సంకల్పంతోనూ, తను చదువుకున్న చదువుకు సార్ధకం చేకూర్చాలని నిర్ణయించుకుంది.
నాట్యప్రవేశం.. చిన్ననాటి నుండి నాట్యంపై ఉన్న మక్కువ తో 6 సంవత్సరాల వయస్సు నుంచే భరత నాట్యాన్ని నేర్చుకున్నాను. 12 ఏళ్లు వచ్చేనాటికి పూర్తిగా భరత నాట్యంలో ప్రావీణ్యం సంపాదించాను. విజయనగరంలోని గురువు రామమూర్తి వద్ద భరత నాట్యాన్ని నేర్చుకున్నాను. డాక్టర్ నటరాజ రామకృష్ణ వద్ద ఆంధ్ర నాట్యంలో శిక్షణ పొందాను. ఆయన ఆంధ్ర నాట్యంపై అనేక పరిశోధనలు చేశారు. ఈ నాట్యాన్ని వెలికితీయాలనేది ఆయన చిరకాల కోరిక, అందుకే దాన్ని ఆదర్శంగా తీసుకొని ఆంధ్రనాట్యంలో పరిశోధనలు సాగించాను. ప్రస్తుతం ఆలయ నృత్య అకాడమీని స్థాపించి ఆంధ్ర నాట్యాన్ని రాజధానిలో చాలామందికి నేర్పిస్తున్నా. ఆర్ధికంగా వెనుకబడిన పిల్లలను శిష్యలుగా చేర్చుకొని ఉచితంగా నృత్యాన్ని నేర్పిస్తున్నా. నా సేవలకుగాను 2018లో ఢిల్లీ తెలుగు అకాడమీవారు ఉగాది పురస్కారాన్ని ఇచ్చి సత్కరించారు. భారత సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో గత సంవత్సరం అక్టోబర్ 25 నుండి 29 వరకు పారిస్‌లో ప్రదర్శనలు ఇచ్చి పలువురి ప్రశంసలు అందుకున్నాను.
నాట్యంపై సాగించిన పరిశోధనలు.. అభినయం, సాత్వికాభినయం, క్షేత్రయ పదాలు, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన శాస్త్రీయ నాట్యంలో పరిశోధనలు సాగించాను. వీటిపై నేను చేసిన పరిశోధనల సమాచారాన్ని ప్రభుత్వానికి సమర్పించాను. కూచిపూడి, పేరిణి శివతాండవం, ఆంధ్ర నాట్యాలపై కూడా ప్రత్యేకంగా పరిశోధనలు చేశాను. ఆంధ్రప్రదేశ్ ఫిలిమ్ టాలెంట్ అకాడమీ నిర్వహించిన మిస్ ఆంధ్రా పోటీల్లో 1984,1985,1986 సం॥ల్లో వరుసగా పాల్గొని మూడుసార్లు రన్నరప్ సాధించాను. కర్నాటక సంగీతంలో గాత్ర ప్రవేశం ఉంది. నా శిష్యులు ప్రదర్శించిన ప్రదర్శనలకు నేను కొరియోగ్రఫి చేసిన కొన్ని నృత్య నాటికలకు నేనే నేపథ్యగాయనిగా వ్యవహరించాను. శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయసంగీతం, లలిత సంగీతం, రాజస్థానీ, అస్సామీ, బెంగాలి, పంజాబీ, హిందీ, ఇంగ్లీష్, తమిళ, కన్నడ భాషల్లో కూడా లలిత సంగీతంలో విశేషంగా రాణించారు.ఆంధ్రనాట్యరీతిని ప్రవాసాంధ్రులకు తెలియజేయాలన్న సంకల్పంతో ఆంధ్ర అసోసియేషన్, ఢిల్లీ సహకారంతో ఉచిత భరతనాట్య, ఆంధ్రనాట్య సంగీత శిక్షణా తరగతులు నిర్వహిస్తూన్నాను. 2017లో హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి క్లాసిక్ డాన్స్ లో అందించిన సేవలకుగాను ప్రఖ్యాతమైన పురస్కార్ (డాక్టర్ నటరాజరామకృష్ణ స్మారక పురస్కారం) అవార్డును అందుకున్నాను.ఢిల్లీలోని ప్రముఖ తెలుగు సంఘల సత్కారాలు అందుకున్నాను.
ప్రముఖులతో… క్షేత్రయ్య పదాల గురించి స్టడీస్ చేసినప్పుడు ప్రముఖ సినీనటులు అక్కినేని నాగేశ్వరరావుతో చాలా విషయాలపై చర్చించే అవకాశం లభించడం నా జీవితంలో లభించిన సువర్ణ అవకాశం. పద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, పద్మవిభూషణ్ బిర్జూ మహారాజు, పద్మశ్రీ సునీల్ కొఠారీ లాంటి వారితో నాట్యంపై చర్చించి అనేక కొత్త విషయాలు తెలుసుకున్నాను. గత 15సంవత్సరాల నుండి ఆంధ్రనాట్యానికి దేశరాజధాని ఢిల్లీలో బ్రాండ్ అంబాసిడార్‌గా పనిచేస్తున్నారు.
ఇంట్లోవాళ్ల ప్రోత్సాహం… డాన్స్, మ్యూజిక్ అంటే మావారికి చాలా ఇష్టం. అందుకే నన్ను ఈ రంగంలో చాలా ప్రోత్సహించారు. సాధ్యమైనన్ని ఎక్కువ ప్రోగ్రామ్స్ ఇవ్వమంటారు. అత్త, మామలు ఏనాడూ అడ్డుచెప్పలేదు. ఒక పక్కా ప్రణాళిక ప్రకారం ఉద్యోగాన్ని, ఇంటిపనులను, పిల్లలకు నాట్యరంగంలో శిక్షణ, నా ప్రాక్టీస్‌లను నిర్వహిస్తున్నాను. ప్రాక్టీస్ విషయంలో, పిల్లలకు శిక్షణ ఇచ్చే విషయంలో క్రమశిక్షణ తో సమయపాలనను పాటిస్తాను.
అమ్మాయి మధుమిత మెడిసిన్ పూర్తి చేసి పారమిలటరీ ఫోర్సెస్ అసిస్టెంట్ కమాండెంట్ ర్యాంకు లో క్లాస్ వన్ ఆఫీసర్ గా సేవలందిస్తోంది. బాబు ఆకర్ష్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. నేను పుట్టింది విశాఖపట్నం. మానాన్న ఇవి చారి ఎమ్‌బిబిఎస్ డాక్టర్. ఉద్యోగరీత్యా చాలా ప్రదేశాలలో చదువుకోవాల్సి వచ్చింది. మా వారిది నల్గొండ. ఢిల్లీ యూనివర్సిటీలో నాట్యరంగంపై చాలా లెక్చర్స్ ఇచ్చాను. క్లాసిక్ డాన్స్ నేర్చుకోవాలంటే చాలా క్రమశిక్షణ ఉండాలి. మా రోజుల్లో శిక్షణ విషయంలో గురువులు చాలా కఠినంగా ఉండేవారు. కాని ఈ రోజుల్లో శిక్షణ తీసుకొనే వారికి అంతసమయం కాని, శ్రద్ధకాని ఉండడం లేదు. నా దగ్గర శిక్షణ తీసుకొనే వారికి నాట్యరంగంలో తొందరగా స్టేజ్ ప్రోగ్రామలు ఇప్పించే విధంగా శిక్షణ ఇస్తుంటాను.