Home ఆఫ్ బీట్ కుక్కకూ ఓ లెక్కుంది

కుక్కకూ ఓ లెక్కుంది

23న ఇంటర్నేషనల్ సెర్చ్  డాగ్స్ డే 

శునకాలు జీవితకాల నేస్తాలు. మనను శత్రువుల బారి నుంచి రక్షించాలన్నా, ప్రమాదాలకు గురికాకుండా కాపాడాలన్నా, ప్రమాదాలలో ఇరుక్కుంటే పదిమందిని పిలిచి వెలికి తీసేలా చేయించాలన్నా శునకానికి మించిన మిత్రుడు మరొకడు లేడు అంటే  అతిశయెక్తికాదు. స్నేహితుడికన్నా,  సన్నిహిత బంధువు కన్నా అత్యంత  ఆప్తమిత్రంగా మిగిలిపోయే సిసలైన దోస్తి శునకం. ఇవి పెంచుకున్న యజమానిని  ఆదుకోడానికేకాదు ఉన్న ఊరిని కన్నతల్లిలా కావలికాయడానికి, దేశ సరిహద్దులలో  శత్రుసైనికులు అక్రమంగా జొరబడకుండా చూడడానికి, దేశద్రోహులు, సీమాంతర  ఉగ్రవాదులు పాతేసిన మందుపాతరలను పసిగట్టి నిర్వీర్యం చేయించడానికి కుక్కలు  నిఘాఅధికారులకన్నా ఎక్కువగా పనిచేస్తుంటాయి. స్మగ్లర్లు, బందిపోట్లు నగర శివారులలో అలికిడి చేసినా, అలజడిరేపినా పట్టి పోలీసు అధికారులకు అప్పజెప్పడానికి ఈ మూగజీవాలు ఎంతగానో ఉపయోగపడతాయి.

Dog

తుఫానులు, సునామీలు, భూకంపాలు, కార్చిచ్చు దహనాల వంటివి సంభవించినపుడు ఇవి నిర్వహించే పాత్ర అమోఘం అద్వితీయం. బస్సు లోయలో పడిపోయినా, పడవ సముద్రంలో మునిగిపోయినా, విమానం అడవిలోనో, కొండకోనల్లోనో, పెనులోయల్లోనో కూలిపోయినా మృతులను, బాధితులను వెతికిపట్టడం ఎంతో కష్టం. అలాంటి హైరిస్క్ పనులు చేయడానికి మేమున్నామంటూ ముందుకు వచ్చి విజయవంతంగా ఇచ్చిన టాస్క్‌ను పూర్తిచేసే గొప్ప మనసున్న సహజీవులు శునకాలు. మంచుకొండలలో, మహాసముద్రాలలోకి దూకి డేర్‌డెవిల్స్ ఈ సెర్చ్‌డాగ్స్. ఇవి మనిషి శరీరం వాసనను పసిగట్టగలవు. అందువల్ల ప్రమాదవశాత్తు ఒక మనిషి ఏలోయలోకో జారిపోయినా, లోతున్న నీళ్ళలో మునిగిపోయినా గుర్తుపట్టి అరిచి సెర్చ్‌పార్టీలను అలర్ట్ చేయగల ప్రతిభ శునకాలకు ఉంది.

శవాలవేటలో షరాబులు

మనిషి శరీరంలో నిమిషానికి 40వేల కణాలు మృతి చెందుతుంటాయి. కొత్తవి అదే సంఖ్యలో పుడుతుంటాయి. మార్పు అనేది ఇంత వేగంగా జరుగుతున్నా కుక్క మనిషి వాసనను కచ్చితంగా ఎలా పసికడుతోంది? అన్నది ఇప్పటికీ సైంటిస్టులకు అంతుచిక్కలేదు. మన ఉచ్ఛాస నిచ్ఛాసల వల్ల కొంత గ్యాస్ ఉత్పతి అవుతుంది. బైటికి వెళ్ళిపోతుంది. మనం చనిపోయాక శరీరం కుళ్ళిపోవడానికి కొన్ని రకాల బాక్టీరియా క్రిములు వెలువడుతుంటాయి. వీటి ద్వారా కూడా కొన్ని రకాల గ్యాస్‌లు వెలువడతాయి.ఇందువల్ల చర్మం పాడైపోతుంది. కణజాలమంతా దెబ్బతినిపోతుంది. అయినా సరే మృతదేహాన్ని ఎలాంటి పొరబాటులేకుండా, తొట్రుబాటు పడకుండా కుక్కలు గుర్తిస్తాయి. వాసన పసిగట్టగల కుక్కలను వాసన కుక్కలని పిలవడం ఆనవాయితీ! వీటిలో ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందాం.

ట్రయిలింగ్ డాగ్స్

గాలిలో వాసన ఆధారంగా పసిగట్టేవి ఈ ట్రయిలింగ్ డాగ్స్. ఇవి పావు మైలు దూరంలో ఉన్న వస్తువునైనా గాలిలోవచ్చే వాసనను కనిపెట్టి పట్టుకోగలవు. జర్మన్‌షెపర్డ్, బెల్జియం షెపర్డ్, బోర్డర్‌కలీస్, టాలర్స్, గోల్డెన్ రిట్రైవర్స్, లాబర్‌డార్స్, స్ప్రింగర్ స్పానైల్స్ వంటివి ఈ కోవకు చెందినవి.

ట్రాకింగ్ డాగ్స్

ఇవి ఒక వ్యక్తికి సంబంధించిన శరీరసంబంధమైన, అతని వస్తు సంబంధమైన వాసన సాయంతో పసిగడతాయి. నేలపై కనిపించే గుర్తులు, వాసనల ఆధారంగా ఇవి మనిషిని పసిగడతాయి. ఇవి కొండలలో, కోనలలోనూ చిట్టడవులు, తరినేలలోనూ సమర్థంగా పనిచేయగలుగుతాయి. పరిసరాలు అనుకూలంగా లేకపోయినా, జనసమ్మర్థంగా ఉన్నా ఈ కుక్కలు తమకు కావలసిన వ్యక్తిని కనిపెట్టగలుగుతాయి. ఒకరిని చూసి మరొకరని అయోమయపడడం ఈ కుక్కలకు తెలియని విద్య.

మట్టిలో కూరుకుపోయినా.. గుర్తించవలసిన వస్తువుకానీ, మనిషికానీ బురదలో కూరుకుపోయి ఉంటే ట్రాకింగ్ కుక్కలు తెల్లవారు ఝూమునే ఆ ప్రాంతంలోని బురదను వాసన చూసి విషయాన్ని గ్రహిస్తాయి. ఎక్కడా ఎలాంటి క్లూ దొరకనపుడు కుక్కలు అదృశ్యమైన, లేదా మరణించిన వ్యక్తి చిట్టచివరిసారి సంచరించిన చోటికి తీసుకువెళ్తే అక్కడి నుంచి వాసన ఆధారంగా నేరస్తుణ్ణి పట్టుకోడానికి వేట మొదలుపెడతాయి. చివరగా సంచరించిన స్థానాన్ని ఎల్‌కెపి అంటారు. అంటే లాస్ట్ నోన్ పాయింట్ అని అర్థం. సెర్చ్‌డాగ్ ఏకబిగిన 8గంటలసేపు అలుపూ ఆయాసం లేకుండా పనిచేయగలుగుతుంది. దాంతోబాటు వెళ్ళే నిఘా అధికారికి కూడా అంత ఓపిక ఉండాలి. పొదల్లోనూ, తుప్పల్లోనూ, ముళ్ళలోనూ, బురదలోనూ, మంచులోనూ దూసుకుపోవడమే వాటికి తెలుసు. వెంటవచ్చే వారు కూడా వాటితో సమానంగా పనిచేయడానికి సిద్ధపడి ఉండాలి. భూకంపాలు వచ్చినపుడు, కొండచరియలు కూలినపుడు, భవనాలు నేలమట్టమై పెద్దయెత్తున ప్రాణనష్టం జరిగినపుడు ఇవి అద్భుతమైన సేవలందిస్తుంటాయి. అందుకే అమెరికా ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీలో సెర్చ్‌డాగ్‌లను పెద్దయెత్తున పెంచుతోంది. వాసనపట్టడంలో నైపుణ్యం ఉన్న జాతులను కనిపెట్టి వాటికి సైనికులతో సమానమైన శిక్షణ ఇప్పిస్తోంది.

ట్రాకింగ్ డాగ్

ఇవికాక క్రైమ్‌సీన్‌లో పనిచేసే కుక్కలు వేరే ఉన్నాయి. ఈ కుక్కలు ఎక్కడెక్కడో వెతికి భూమిలో ఖననమైన వ్యక్తినికానీ, నీళ్ళలో మునిగిపోయిన వ్యక్తిని కానీ పసికట్టి బైటికి తీయాలి. ఈ విషయంలో వీటికి అధికారులు శిక్షణ ఇప్పిస్తారు. అయితే దొరికిన శవం ఇటీవల చనిపోయిన వ్యక్తిదా.. చాలా కాలం క్రితం చనిపోయిన వ్యక్తిదా అన్నది అది నిర్ధారించి చెప్పలేదు. కానీ మనిషి శవం ఎంత శిథిల స్థితిలో ఉన్నా, రక్తం, కణాలు, జుట్టు, ఎముకలు, పుర్రె ఇలా ఏ చిన్న క్లూ దొరికినా ఇవి పట్టుకుంటాయి. ట్రాకింగ్ డాగ్స్‌ను కడావర్ డాగ్స్ అంటారు.

మ..మ..మాస్ డాగ్

లక్ష్యాన్ని పసిగట్టడంలో మరో అద్భుతమైన కుక్క అవలంచ్ డాగ్. మంచు తుఫాన్‌లో ఇరుక్కుపోయి హిమపాతంలో 15 అడుగులలోతుకు కూరుకుపోయినా సరే మనుషులను, శవాలను గుర్తించి వెలికి తీసే ప్రతిభ వీటిది. సెయింట్ బెర్నార్డ్, జర్మన్‌షెపర్డ్, లాబర్‌డార్ రిట్రైవర్స్ ఈ రకం సేవలు అందించడంలో ముందుంటాయి. ప్రకృతి బీభత్సాలలో చెల్లాచెదరై పుట్టకొకటి, చెట్టుకొకటిగా అయిపోయిన మూగజీవాలను, పెంపుడు జంతువులను గుర్తుపట్టి రక్షించేందుకు కూడా కుక్కలను వినియోగించడం ఈ మధ్య కాలంలో పెరిగింది. వాసన కుక్కలకే ఈ విధమైన శిక్షణ ఇవ్వడం వల్ల వీటి సేవల వల్ల కలిగే ఉపయోగం పెరిగింది. ఈ కుక్కలకు ఇచ్చే శిక్షణను మిస్సింగ్ యానిమల్ సెర్చ్ (మాస్) అంటారు. ప్రాణాలతో ఉన్నా, విగతజీవిగా మారినా పట్టవలసిన జంతువు శరీరం లభించే వరకు ఇవి అన్వేషణ సాగిస్తూనే ఉంటాయి. ఈ రకమైన తర్ఫీదు ఇవ్వడంలో బ్రిటన్‌లోని మిస్సింగ్ యానిమల్ సెర్చ్ డాగ్ అసోసేషియన్ ఎంతో ముందుంది.

శిక్షణ కత్తిమీద సామే…

వాసనపట్టడం కుక్కకు సహజగుణమే అయినా దాన్ని మన అవసరాలకు అనుగణంగా వాడుకోడం కోసం ఇచ్చే శిక్షణ ఇవ్వడం కత్తిమీది సాముగానే ఉంటుంది. కుక్కను మచ్చిక చేసుకుంటే తప్ప శిక్షకుడు వాటికి శిక్షణ ఇవ్వలేడు. కనుక ఎక్కువ టైము పడుతుంది. పైగా కుక్క చిన్నప్పటి నుంచే ఈ రకం శిక్షణ మొదలైతే తొందరగా మాట వింటుంది. కాస్త పెద్దదయ్యాక శిక్షణ ఇవ్వాల్సివస్తే ఎక్కువగానే శ్రమపడాల్సివస్తుంది. చిన్నవయసు కుక్కకు 810 వారాలు కావాల్సివస్తే, కాస్త పెద్దవయసు కుక్కకు శిక్షణ ఇవ్వాల్సివస్తే 1218 నెలలు, ముసలితనం మీదపడిన కుక్కకు శిక్షణ ఇవ్వాల్సి వస్తే 510 సంవత్సరాలు కావాల్సి వస్తుంది. కుక్క యేదైనా, ఏ జాతికి చెందినదైనా మాటవినేలా చేయాలంటే ఒబిడియెన్స్ ట్రైనింగ్ ఇస్తారు. ఇది ఎంతో కీలకమైన శిక్షణ. కుక్కలు ప్రమాదంలో చిక్కుకుపోకుండా మాటలతోనో, ధ్వనులతోనో నిలువరించడానికి, ఎలా ముందుకు పోవాలో సజెషన్స్ ఇవ్వడానికి, శాంతిభద్రతల అధికారులకు చేదోడు వాదోడుగా ఉంటూ చట్టాన్ని అమలుచేయడానికి సహకరించేందుకు ఈ ఒబిడియెన్స్ ట్రైనింగ్ ఎంతగానో అవసరం. శిక్షకుడికి, కుక్కకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉండాలి. అప్పుడే అది చెప్పిన మాట వింటుంది. చెప్పినట్టు చేస్తుంది. సాధారణంగా కుక్కలన్నీ మచ్చికయ్యే జంతువులే కనుక ప్రాథమిక శిక్షణకు ఎంతో సమయం పట్టదు. అడ్వాన్స్ కోచింగ్‌లోనే ఓర్పు, నేర్పు, సమయం కావాలి. రిస్క్ కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఎజిలిటి ట్రైనింగ్

చిన్నకుక్కలకు చురుకుగా కదలడం, సులువుగా ముందుకు దూసుకుపోవడం, ఎవ్వరినీ కరవకుండా చెప్పిన పని చేసుకురావడం, చేతి సైగను, కంటి చూపును గమనించి మసలుకోవడం వంటివి ఈ ట్రైనింగ్‌లో నేర్పిస్తారు. ఏది చేయాలన్నా బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి కనుక శరీరం అనువుగా, అనుకూలంగా ఉండడానికి వా టికి రోజూ వ్యాయామం చేయిస్తారు. ఈ శిక్షణను ఎజిలిటి ట్రైనింగ్ అంటారు. ఇలాంటి వ్యాయామాలను ప్రా రంభించేందుకు ముందు దాన్ని మచ్చిక చేసుకోడానికి సరదా ఆటలు ఆడిస్తారు. గ్రౌండ్ అంతా పరిగెత్తడం, కూ చోమంటే కూచోడం, నించోమంటే నించోవడం, బంతి విసిరేసి పట్టుకురమ్మంటే పట్టుకు రావడం వంటి చిన్నచిన్న పనులు చేయిస్తారు. ఇలా చేసినందుకు మాట విన్న ప్రతిసారి దానికి చిన్న ట్రీట్ ఇస్తారు.

వాసనకుక్కకే వాసన నేర్పడం

వాసనకుక్కకే వాసనపట్టడం నేర్పడం అంటే తాతకు దగ్గులు నేర్పినట్లుంటుంది. కానీ తప్పదు. శిక్షకుడి సామర్థానికి ఇది నిజంగా పరీక్షే!

క్లిష్టపరిస్థితులలోనూ అదుర్స్

పరిస్థితులుబాగోకపోయినా, వాతావరణ పరిస్థితులు ఏ మాత్రం సహకరించే స్థితిలో లేకపోయినా ఈ కుక్కలు అన్వేషణ చేయాల్సివస్తే లక్ష్యాన్ని సాధించడంలో ఇవి ఎంత వరకు కృతకత్యం అవుతాయి? అన్న విషయం మీ ద కెనడాకు చెందిన డాగ్ అసోసేషియన్‌కు చెందిన డాక్ట ర్ అరోమా, అల్బెర్టా యూనివర్శిటీకి చెందిన డా. దేబ్‌కుమార్ ఒక అధ్యయనం చేశారు. పరిస్థితి ఎంత సంక్లిష్టం గా ఉన్నా కుక్కల ప్రతిభాపాటవాలలో ఎలాంటి తేడాలేదని, ఇవి నూటికి నూరుశాతం విజయం సాధిస్తున్నాయని కనిపెట్టారు. కుక్కకు ఉన్న వాసనపట్టగల గుణాన్ని పరీక్షించాలని కొన్ని కృత్రిమ వాసనలు సృష్టించి వాటిని జల్లి కుక్కను విడిచిపెట్టినా సరే అది తాను పసికట్టవలసిన మనిషిశరీరాన్నే కనిపెట్టింది.

సలూకీ

ఇది ఈజిప్ట్‌కు చెందిన శునకం. దీనిపేరు సలూకీ. అక్కడివాళ్ళు దీన్ని రాయల్ డాగ్ అని పిలుస్తారు. మనిషికి ఎంతో నమ్మశక్యమైన, అమిత విశ్వాసపాత్రమైన ఆప్తమిత్రాలు ఈ సలూకీ శునకాలు. పొడవైన పెద్దపెద్ద కాళ్లు, లోపలికి అంటుకుపోయినట్టుగా ఉండే కడుపు దీని ఆకారాన్ని ఎంతో సులువుగా వంగి ఎంత ఇరుకు రంధ్రంలోంచైనా తలదూర్చి ఎంత లోతుగా ఉన్న వస్తువునైనా స్పష్టంగా చూడగలుగుతుంది. పరుగులో మంచి వేగం దీనికి మరో కలిసి వచ్చే అంశం. వీటికి స్వతంత్ర భావాలు ఎక్కువ. తనంతటతానుగా ఉంటూనే మనిషి దగ్గర ఎంతో మర్యాదగా, అభిమానంగా ఉంటుంది. 60 పౌండ్ల బరువు, 28 అంగుళాల ఎత్తు ఉండే సలూకీ ఖరీదు 2,500 డాలర్లు.

చెకోస్లవేకియా తోడేలుకుక్క

జర్మన్ కర్పాతియన్ తోడేళ్ళకు క్రాసింగ్ చేయిస్తే పుట్టిన మిశ్రమజాతి కుక్క ఈ తోడేలు కుక్క. 1955లో ఈ ప్రయోగం జరిగింది. తొలుత 48 కుక్కలను పుట్టించారు. జర్మన్ షెపర్డ్‌లోని వినయం, విధేయత, కలుపుగోలుతనం, మాటవిని పనిచేసే లక్షణం, తోడేలులోని కండబలం, శారీరతత్వం, శక్తిసామర్థాలు వగైరాలు ఈ సంకరజాతి పిల్లలలో కనిపించా యి. బుద్ధిబలం, భుజబలం ఉన్న ఈ శునకాలను సరిహద్దు భద్రతా దళాలకు సహాయపడేందుకు అందజేశారు. సుశిక్షతమైన శునకాలు గాలింపుచర్యలలో పాల్గొనడానికి, ఆపదలో ఉన్న మనిషిని పసిగట్టి క్షేమంగా బైటికి తేవడానికి ఎంతో ఉపకరించాయి అని వాటి సేవలు వినియోగించుకున్న అధికారులు ధ్రువపరిచారు. దీని ఖరీదు 1000 డాలర్లు.

పెరూవియన్ ఇన్‌కా ఆర్చిడ్

పెరుదేశానికి చెందినది ఈ శునకం. ఇన్‌కా సంస్కృతి రాక ముందరి నుంచే ఈ శునకం ఉన్నట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఒంటిమీద చిన్న వెంట్రుక కూడా లేకుండా నున్నగా..బోడిగా అనిపించినా ఎంతో మంచి కుక్కగా పేరు తెచ్చుకుంది. చర్మం రంగుకూడా మామూలు కుక్కలకు ఉన్నట్టు ఉండదు. ఏనుగుతోలు కప్పుకున్నట్టుగా అనిపిస్తుంది. దీనికి ట్రైనింగ్ ఇవ్వడం కొంచం కష్టంగానే ఉన్నా ఒకసారి పనిచేయడం నేర్చుకుంటే దాని పనితనమేంటో చేతలలో చూపిస్తుంది. దీని ఖరీదు 3వేల డాలర్లు.

అజావాక్ 

సన్నగా, పొడవుగా, బాదం రంగు కళ్ళతో గమ్మత్తుగా కనిపించే ఈ శునకం ఆఫ్రికా దేశానిది. దీని పరుగు విచిత్రంగా ఉంటుంది. మనుషులకు ఈ కుక్క నచ్చడానికి దాని వింతపరుగే కారణం. ఇది ఆఫ్రికాజాతి కుక్కే అయినా ప్రస్తుతం అమెరికా, కెనడా దేశాలలో కూడా అమ్మకానికి దొరుకుతోంది. ఇది రకరకాల రంగులలో లభ్యమైనా ఇసుకరంగు, బ్రౌన్‌రంగు కుక్కలకే చాలా డిమాండ్ ఉంటుంది. దీని ఖరీదు 3వేల డాలర్లు.

అకిత 

ఇది జపాన్‌కు చెందిన కొండజాతి కుక్క. జపాన్‌లోనూ ఉత్త ర ప్రాంతపు కొండలలో ఇవి ఎక్కువగా కనబడుతుంటాయి. వీటిలో  ప్ర ధానంగా రెండు రకాలున్నాయి. మొదటి రకాన్ని స్థానికంగా అకితకెన్ అనీ, రెండు రకాన్ని అకిత ఇను అని పిలుస్తారు. జపనీ భాషలో ఇను అంటే కుక్క అని అర్థం. దీన్నే మరికొందరు జపనీస్ అకిత అని పిలుస్తారు. అమెరికాలో కూడా ఈ జాతి ఉంది. వాటిని అమెరికన్ అకిత అనిపిలుస్తారు. జపాన్ అకితలో రంగులు తక్కువే! అమెరికా అకిత మాత్రం అన్ని రకాల రంగుల్లోనూ కనబడుతుంది. దీని ఒంటి మీద వెంట్రుకలు చిన్నచిన్నవిగా ఉంటాయి. సైబీరియన్ హస్కీ డాగ్‌లాగా దీనికి కూడా డబుల్‌కోట్ ఫర్ (బొచ్చు) ఉంటుంది. ఖరీదు 4,500 డాలర్లు.

 రాట్‌వైలర్ 

ఇది పూర్తిగా సంసారపక్షమైన శునకం. ఇది పొట్టిగానూ, మధ్యమ పొడువుగానూ ఉంటాయి. వీటిని జర్మన్‌లో రాట్‌వైలర్ మెట్జర్ హండ్ (రాట్‌వైల్ కావలి కుక్క) అని పిలుస్తారు. గొర్రెలను, మేకలను, పశువులను మంద కట్టు చెదిరి బెదిరి పారిపోకుండా కాపలాకాయడానికి వీటిని రైతులు పెంచుకుంటూ ఉంటారు. పశువుల దాణా వేసిన బండ్లను లాగడానికి, పశుమాంసం ఉన్న బండ్లను మార్కెట్‌కు లాక్కురావడానికి వీటిని వినియోగిస్తారు. 19వ శతాబ్దం చివరి వరకు వీటిని ఇలాగే వినియోగించేవారు. ఆ తర్వాత రైళ్ళు రావడంతో వీటికి ఈ చాకిరి నుంచి విముక్తి లభించింది. ప్రస్తుతం ఈ కుక్కలను సెర్చ్ అండ్ రెస్కూ పనులకు, అంధులను జాగ్రత్తగా కోరుకున్న చోటికి తీసుకువెళ్ళే గైడ్లగానూ, కావలిపనులు చేసే పోలీస్ డాగ్స్‌గానూ వీటిని వాడుతున్నారు. వీటి ఖరీదు 6వేల డాలర్లు.

ఫరాహౌండ్ 

మాల్టా దీవులకు చెందిన జాతి కుక్క ఈ ఫరాహౌండ్. ఇక్కడి స్థానిక మాల్టసీ భాషలో వీటిని కెల్బ్ టాల్ ఫెనెక్ అని పిలుస్తారు. అంటే కుందేలు కుక్క అని అర్థం. మొదట్లో ఈ కుక్కను కుందేళ్ళ వేటకు వినియోగించేవారు. ఈ కుక్కలు ఎంతో దర్జాగా, డాబుగా ఉంటాయి. ఎంతో తెలివైన కుక్కగా దీనికి డాగ్ ప్రేమీల అభినందనలున్నాయి. ఆటలాడడంలో అందెవేసిన చేయి. దీని ఖరీదు 6,500 డాలర్లు.

టిబెటన్ మాస్టిఫ్

టిబెట్‌కు చెందిన అత్యంత సాహసోపేతమైన శునకం ఇది. ఇవి ఒకచోట అనక ఉంటాయి. కనుక వీటి సంచారం చైనా, నేపాల్, టిబెట్ దేశాలలో ఎక్కువగా కనబడుతుంది. మన దేశంలో హిమాచల్ ప్రదేశ్‌లో కనబడుతుంది. గొర్రెలు దొంగల పాలైపోకుండా కావలి కాయడానికి ఇక్కడి ప్రజలు ఉపయోగిస్తుంటారు. అమిత ధైర్య సాహసాలకు పెట్టింది పేరైన ఈ జాతి కుక్కను అనేక దేశాల వారు అభిమానంగా పెంచుకుంటూ కాపాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ జాతి కుక్క ప్రపంచవ్యాప్తంగా అన్నిచోట్లా కనబడుతోంది. 33 అంగుళాల ఎత్తువరకు పెరిగే ఈ శునకం 160 పౌండ్ల బరువు ఉంటుంది. దీని ఖరీదు 7వేల డాలర్లు.

సామోయడ్ 2

ఇవి చక్కగా తెల్లగా, బొద్దుగా, ముద్దుగా ఉండే శునకాలు. సైబీరియాలో సామోయెడిక్ భాషలు మాట్లాడే సంచార జాతులు పెంచుకునే కుక్క ఇది. అందుకే దీనికి సామోయడ్ శునకం అనే పేరు వచ్చింది. వీళ్లు సామాన్లు తీసుకుపోయే బండ్లను లాగడానికి ఈ కుక్కలు ఎంతగానో ఉపయోగపడేవి. చూడడానికి నాజూకుగా, అమాయకంగా కనిపించినా దీనికి ఇంతింత బరువు లాగగలిగే శక్తి ఉండడంతో దీనికి ప్రపంచవ్యాప్తంగా పెద్ద గుర్తింపు వచ్చింది. దీని ఖరీదు 8వేల డాలర్లు.

లోచెన్స్

సెర్చ్ డాగ్‌లలోకెల్లా అత్యంత ఖరీదైన శునకంగా లోచెన్స్‌కు మంచి పేరు, పెంచుకునే వారిలో క్రేజు, మోజు ఉన్నాయి. వీటిని డాగ్ అభిమానులు చిట్టిసింహం అని ముద్దుగా పిలుచుకుంటారు. చూడడానికి పొట్టిగా, పొడవాటి వెంట్రుకలతో తమాషాగా ఉంటుంది. ఇది పునరుజ్జీవన కాలం నుంచి నశించిపోకుండా అందివస్తున్న జాతి అని శునకాల నిపుణులు చెబుతుంటారు.  కాలంనాటి చిత్రపటాలలో ఈ జాతి శునకాలు మనకు కనబడుతుంటాయి. ఒకప్పుడు ఎందరివద్దనో ముద్దులు కురిపించిన ఈ శునకం ఇప్పుడు అరుదైన జాతిగా, అంతరించిపోయే జాతిగా మారిపోయింది. అందుకే ఈ రకం కుక్క కావాలంటే అతి కష్టమ్మీద దొరుకుతోంది. ప్రస్తుతం దీని ఖరీదు 10వేల డాలర్లు.

డా॥ వంగల రామ కృష్ణ