Home లైఫ్ స్టైల్ వృత్తికోర్సుల్లో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి

వృత్తికోర్సుల్లో ఇంటర్న్‌షిప్ తప్పనిసరి

Osmania-University

“ప్రతి ఒక్కరి జీవితంలో విద్య చాలా ముఖ్యమైనది. సరైన విద్య అందకపోతే ఆ ప్రభావం పరోక్షంగా ఆర్థిక వ్యవస్థపైనా, సమాజంపైనా పడుతుంది. నాణ్యమైన విద్య అందకుంటే ఒక తరమే నష్టపోతుంది. ఈ విషయాలు క్షుణ్ణంగా  విశ్లేషించుకుని ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు సంస్కరణలు తీసుకువస్తున్నాం. ఉపాధి అవకాశాలు పెంపొందించే విద్యపై దృష్టి సారించాం. వృత్తి విద్యా కోర్సుల్లో ప్రమాణాలు పెంపొందించి పరిశ్రమలకు అనుసంధానం చేసేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. యూనివర్సిటీలలో ఇన్‌క్యుబేటర్ల  ఏర్పాటుపై అధ్యయనానికి ఒక కమిటీ, కరికులమ్, సిలబస్ మార్పుపై అధ్యయనానికి మరో కమిటీ, నైపుణ్యాల పెంపు, శిక్షణ అంశాలపై అధ్యయనానికి ఇంకో కమిటీని నియమించాం” అని ఉన్నత విద్యామండలి చైర్మన్ టి.పాపిరెడ్డి  ‘గమ్యం’కు ఇచ్చిన ఇంటర్వూలో వివరించారు.

ఇంజనీరింగ్‌లో పెరిగిన నాణ్యత :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉన్నత విద్యలో నాణ్యతపై దృష్టి సారించారు. సమైక్య రాష్ట్రంలో ఇబ్బడిముబ్బడిగా ఇంజనీరింగ్ కళాశాలలు ఉండేవి. సరైన మౌలిక సదుపాయాలు, ల్యాబ్ లు, అర్హులైన అధ్యాపకులు లేకపోవడంలో నాణ్యత లోపించింది. ఇంజనీరింగ్ సీట్ల సంఖ్యకూ, భర్తీ అయ్యే సీట్లకూ మధ్య చాలా వ్యత్యాసం ఉండేది. ఇంజనీరింగ్‌లో నాణ్యత ప్రమాణాలు పెంపొందించాలనే ఉద్దేశంతో కళాశాలల్లో నిరంతర తనిఖీలు నిర్వహించాం. నాసిరకం కళాశాలలు చాలా వరకు తగ్గాయి. కొన్ని కళాశాలలు స్వచ్ఛందంగా మూతబడ్డాయి. ప్రస్తుతం నడుస్తున్న కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెరిగాయి. కొన్ని ఇంజనీరింగ్ కళాశాలలకు, కొన్ని బ్రాంచీలకు డిమాండ్ ఉన్నప్పటికీ స్వల్పసంఖ్యలో సీట్లు మిగులుతున్నాయి. మెరుగైన సౌకర్యాలు, అర్హులైన అధ్యాపకులు ఉన్న ప్రైవేట్ కళాశాలలకు ఇప్పటికీ డిమాండ్ ఉంది. అందుకే ప్రముఖ బహుళజాతి సంస్థలు, కార్పొరేట్ కంపెనీలలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లోనే ఉద్యోగాలు
లభిస్తున్నాయి.

పరిశ్రమలతో యూనివర్సిటీల అనుసంధానం :పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం మేరకు విద్యార్థులు లభించడం లేదు. వారు చదువుకున్న చదువుకు, పరిశ్రమల అవసరాలకు మధ్య అంతరం ఉంది. ఈ అంతరాన్ని తగ్గించేందుకు ఈ పరిశ్రమలతో యూనివర్సిటీలను అనుసంధానం చేస్తున్నాం. ఇంజనీరింగ్, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సు ల్లో ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేశాం. జపాన్, జర్మనీ, ఉత్తర కొరియా వంటి దేశాలలో ఇంటర్న్‌షిప్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థులకు ఆచరణాత్మక అనుభవం వస్తుంది. అందుకే వృత్తి విద్యా కోర్సుల్లో ఆరు నెలల పాటు ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేస్తున్నాం. ఇందులో థియరీతో పాటు ప్రాక్టికల్స్ ఉండడటం ద్వారా కోర్సు పూర్తి కాగానే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు సిలబస్, కరికులమ్‌లో మార్పులు తీసుకువస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఐటి శాఖ మంత్రి కె.తారకరామారావు టాస్క్ ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యాల పెంపుదల, ఉపాధి శిక్షణకు చర్యలు చేపట్టారు.

వర్సిటీలలో ఇన్‌క్యుబేటర్లు : సొంతంగా స్టార్టప్‌లు రూపొందించే విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలోని ఐదు యూనివర్సిటీలలో ఇన్‌క్యుబేటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం జరిగింది. తర్వాత దశలవారీగా అన్ని యూనివర్సిటీలలో ఇన్‌క్యుబేటర్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. సృజనాత్మకత కలిగిన విద్యార్థులకు వీటి ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాం. ప్రతిభ కలిగిన విద్యార్థులకు పరిశ్రమల నుంచి అవసరమైన ప్రోత్సాహం లభిస్తుంది.
కొత్త కళాశాలలు అవసరం లేదు : ఏటా ఇంటర్

ఉత్తీర్ణత సాధిస్తున్న విద్యార్థులు దాదాపు మూడున్నర లక్షలు ఉంటే, వివిధ యుజి కోర్సుల్లో సుమారు 5 లక్షల సీట్లు ఉన్నాయి. విద్యార్థుల అవసరం మేరకు కళాశాలలు ఉంటే చాలు. కొత్త కళాశాలల అవసరం లేదు. అందుకే కొత్త కళాశాలలకు అనుమతులు మంజూరు చేయడం లేదు.

తెలంగాణలో విద్యార్థులు సంఖ్య కన్నా సీట్లే అధికంగా ఉన్నాయి. డిగ్రీలో 4 లక్షల సీట్లు అందుబాటులో ఉంటే 50 శాతం సీట్లు కూడా భర్తీ కావడం లేదు. చాలా కోర్సుల్లో సీట్లు ఏటా మిగులుతూనే ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న కళాశాలల్లో నాణ్యత ప్రమాణాలు పెంపొందించేందుకే చర్యలు తీసుకుంటున్నాం. బి.ఎ, బి.కాం, బిఎస్‌సి వంటి డిగ్రీ కోర్సుల సిలబస్ లో మార్పులు చేస్తున్నాం. డిగ్రీ సబ్జెక్టుల సిలబస్‌లో ముఖ్యమైన అంశాలను ఉంచుతూనే ఆయా సబ్జెక్టులలో నూతనంగా అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ, కొత్త అంశాలను జోడిస్తున్నాం. ఆయా కోర్సులకు పరిశ్రమల అవసరాలను గుర్తించి, వాటికి అనుగుణంగా కరికులమ్, సిలబస్‌లో మార్పులు తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

ఎం.భుజేందర్
ఫొటో : బాష