Home ఆఫ్ బీట్ తొలి బంజారా ప్రొఫెసర్

తొలి బంజారా ప్రొఫెసర్

తండా నుంచి ఆర్ట్ కాలేజీ దాకా..
ప్రొఫెసర్ సూర్యధనన్‌జయ్ విజయ ప్రస్థానం..

అది ఒక చిన్న తండా మూడు కిలోమీటర్లు నడిస్తే గాని బడి అందుబాటులో లేదు. ఆ తండాలో ఒక   కుటుంబం గంపెడు పిల్లలు. భాషను చూసి ఛీ అనీ చీదరించు కున్న  పరిస్థితుల నుండి వరి చేనులో వడ్లకు ముందు వచ్చే బెరుకులు తిని  బతికిన రోజులవి….. అందరిని చదివించాలని తల్లి దండ్రుల కోరిక. కాలం తలకిందులై తండ్రిని  తీసుకెళ్లింది. ఇల్లంతా  విషాదం, అకస్మాత్తుగా బాధ్యతలు అమ్మమీద పడ్డాయి. తన పిల్లల చదువులు ఎక్కడ ఆగిపోతాయేమో అని బెంగ. ఎన్ని  కష్టాలైన భరించి తన పిల్లలను చదివిపించు కోవాలనే తపన ఒక వైపు. బతుకుదెరువుగా వ్యవ సాయం ఆ ఇంటిని కాపాడింది. అందరూ చదువుకుంటున్నందువల్ల అమ్మకి సహకరించేవాళ్లు కరు వయ్యారు. బాగా చదువుకుని జీవితంలో స్థిరపడాలని  నాన్న  చెప్పిన మాటలు ఆమె అడుగులను బడి వైపు నడిపించాయి. ఆమెను-ఉన్నత  శిఖరాలకు ఎదిగించాయి. ఆర్ట్స్ కాలేజి తెలుగు శాఖ అధ్యక్షురాలు సూర్యధనన్‌జయ్‌తో ముచ్చట్లు…….. 

srt

మేడవ్‌ు ఎలా ఉన్నారు బాగున్నారా ? ( బాగున్నాను బాబు. )
మేడవ్‌ు మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి ?
మా అమ్మ నాన్నకి మేము మొత్తం పదిమంది సంతానం. వాస్తవానికి 12 మందిమి. ఇందులో ఇద్దరు పుట్టుకతోనే చనిపోయారు. చివరికి పదిమందిమి మిగిలాం. ఏడుమంది ఆడపిల్లలు, ముగ్గురు మగపిల్లలు. నేను మా అమ్మ నాన్నలకి తొమ్మిదవ బిడ్డను. మాది పెద్ద కుటుంబం. నాన్న నా చిన్నతనంలోనే చనిపోయారు. అప్పుడు నా వయస్సు నాలుగు సంవత్సరాలు. నాన్న ఉన్నన్ని రోజులు మా కుటుంబం ఎంతో ఆహ్లాదకరంగా ఉండేది. నాన్న చనిపోయిన మరుక్షణం నుండి మా కుటుంబంలోకి కష్టాలు కన్నీళ్ల్లు ప్రవేశించాయి. మాది వ్యవసాయ కుటుంబం. నాన్న చనిపోయిన తర్వాత అమ్మే అన్ని పనులు చూసుకునేది. అమ్మ చాల కష్టజీవి. మమ్మల్ని చాల బాగా చూసుకుంది. మా చదువు, భవిష్యత్తు గురించి బాగా ఆలోచించేది. మా నాన్న ఆడ పిల్లలను, మగ పిల్లలను సమానంగా చూసేవాడు. ముఖ్యంగా ఆడపిల్లలు చదువుకోవాలని బలంగా కోరుకునేవాడు. అందుకే నాన్న -ఉన్నప్పుడు పట్టుదలతో కోట్లాడి మా తండాలో బడి పెట్టించాడు. మా తండాకు మా నాన్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. మా నాన్న కూడ చదువుకున్నాడు. మా నాన్న పేరు బల్లునాయక్. వాళ్లు ఐదుగురు అన్నదమ్ములు. ఈ ఐదు ఇండ్లు ఒక తండాగ ఏర్పడ్డాయి. మా తండాకు మా నాన్న పేరే పెట్టుకున్నారు. నేడు మా తండా గ్రామ పంచాయితిగా ఏర్పడింది.
ఒక సాధారణ బంజారా మహిళ ప్రొ॥సూర్య ధనుంజయ్ అయినందుకు ఎలా ఫీలవుతున్నారు ?
చాల సంతోషంగా ఉంది. (నవ్వుతూ….) అందరు కలగన్నట్లే నేను యూనివర్సిటి ఆర్ట్స్ కాలేజిలో చదవాలని కలగన్నాను. నాకు ఆర్ట్స్ కాలేజిలో చదవాలని చాల కోరిక ఉండేది. మొదట రంగారెడ్డి జిల్లాలో ఎస్‌టి కోటాలో ఉద్యోగాలు లేవు. నాకు ఓపెన్ కోటాలో టీచర్ ఉద్యోగం వచ్చింది. మా వారు అభ్యతరం వ్యక్తం చేశారు. అప్పుడు జీతం1200. ఉద్యోగానికి సెలవుపెట్టాను. తర్వాత పీజి కోఠి ఉమెన్స్ కాలేజిలో సీటు వచ్చింది. పీజి అయిపోయాక డిగ్రీ లెక్చరర్ అయ్యాను. అప్పుడు ఎనలేని సంతోషం కలిగింది. మళ్లీ ఎంఫిల్ లో చేరాను. ఎంఫిల్ అయిపోగానే ప్రొ: -ఉద్యోగానికి ఎంపికయ్యాను. కోఠి వు-మెన్స్ కాలేజిలో నా బోధనా వృత్తి ప్రారంభమైంది. ఎంతో ఎత్తుకు ఎదిగాను నేను, కాని నేను ఎదిగిన దారి విరిగిన నిచ్చెన మెట్లదారి..
మీ కుటుంబంలో ఎంత మందికి ఉద్యోగాలొచ్చాయి ?
ఎవరికి రాలేదు నేను ఒక్కదాన్నే ఈ స్థాయికి ఎదిగాను.
ఈ స్థాయికి ఎదగడానికి మిమ్మల్ని ప్రోత్సహించిందెవరు ?
పెళ్లి కాకముందు అమ్మ ప్రోత్సాహం. ప్ళ్ళైన తర్వాత మా వారు ధనన్‌జయ్ ప్రోత్సాహం ఉంది. నాకు చిన్నతనంలోనే ప్ళ్ళైంది. అప్పుడు నా వయస్సు పదహారేండ్లు అప్పుడు నేను ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. మా అమ్మ పెళ్లి చేసే ముందు మా వారికి చెప్పింది. నా బిడ్డ చాల బాగా చదువుతుంది. ఎలాగైన చదివించుకోమని చెప్పి మా వారితో మాట ఇప్పించుకుంది. పెళ్లి కారణంగా నా ఇంటర్ మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత మా వారు ఓపెన్ డిగ్రీలో చేర్పించారు.
ప్ళ్లై పిల్లలు పుట్టిన తరువాత ప్రొ: స్థాయికి ఎదిగారు అది ఎలా సాధ్య పడింది ?
నాకు 20ఏళ్లకే ఇద్దరు పిల్లలు పుట్టారు. నేను ఈ స్థాయికి రావడానికి నా భర్త ధనన్‌జయ్ లేకపోతే సూర్య లేదు. ఆయన తన పని తాను చేసుకుంటూ నాకు సహకరించేవాడు, ఇంట్లో పనికూడ చేసి పెట్టేవాడు. ఆయన చదువులో టాపర్. ఆయన ఎప్పుడు చదివే వాడో అర్ధం కాకపోయేది. ఏ పరీక్ష రాసినా పాసయ్యే వాడు. ఆయనకు అనేక ఉద్యోగాలొచ్చాయి. కాని ఆయనకు పోలీసు ఆఫీసర్ కావాలనే కోరిక. అలాగే నాలో కూడ ఏదో ఒకటి సాధించాలనే తృష్ణ రోజురోజుకి పెరిగింది. నా కంటూ ఒక అడ్రస్సు ఉండాలని కలగన్నాను. ఆ కలను కలగానే మిగలనివ్వలేదు నా కృషి వల్ల ఇలా ఆర్ట్స్ కాలేజిలో అవకాశం వచ్చింది.
తెలుగుపై మమకారంతోనే తెలుగు ప్రొ: అయ్యారా ?
నేను మొదట బిఈడి ఇంగ్లీషు మీడియంలో చదివాను. నాది డిగ్రీలో సోషియాలజి ఆంథ్రపాలజి. పీజికి సోషియాలజి, తెలుగు అప్లై చేశాను. ఈ రెండింటిలో తెలుగే మంచిదని తెలుగు చదివా.
ఒక వైపు గృహిణిగా, మరోవైపు యూనివర్సిటిలో బాధ్యతలను ఎలా నిర్వర్తిస్తున్నారు ?
నేను ఉద్యోగంలో చేరినపుడు ఇంకా మా బాబు పాలుతాగుతూనే ఉన్నాడు. అందరూ వెళ్లిపోయిన నేను కాలేజిలోనే చదువుకుని ఇంటికి వచ్చేదాన్ని. ఇంటికొస్తే పిల్లల బాగోగులు చూడటానికే సమయం సరి పోయేది. చిన్నప్పటి నుండి చాల కష్టాలు పడి వచ్చాను కాబట్టి నాకు ఇంట్లో పనులు పెద్దగ కష్టంగా అనిపించలేదు. కాని ఒక్కోసారి ఒక దశలో కుటుంబం, ఉద్యోగం పిల్లలు చాల సంఘర్షణ పడిన సందర్భాలు ఉన్నాయి. మా ఆయన సహకారంతో ఎక్కువ కష్టంగా ఉండేది కాదు. అలా ఈ రెండు పనులను చేయడానికి ముఖ్యంగా టైవ్‌ు మేనేజ్‌మెంట్ ఉండాలి అది నేను తప్పకుండా పాటిస్తా..
యూనివర్సిటీలో మొట్టమొదటి బంజార మహిళ ప్రొ: మీరేనా ?
అవును మొదటి జంజారా మహిళ ప్రొఫెసర్‌ని నేనే. ఇది నా జీవితంలో మర్చిపోలేని విశేషం.
మీకు బాగా గుర్తుండిపోయే సందర్భం ఏమైన ఉందా ?
నేను డిగ్రీ లెక్చరర్ అయినపుడు చాల సంతోషం కలిగింది. అది నా మర్చిపోలేని సందర్భం .
విద్యార్థి దశలో చాల భయాందోళనకు ఘర్షణకు లోనైన మీరు ఇప్పుడు బోధన వృత్తిని ఎలా ఫీలవుతున్నారు ?
నాకు ఉద్యోగం వచ్చింది. నేను పాఠాలు చెప్పగలనా అని చాల భయాందోళనతో ఉండేదాన్ని. ఇంత పెద్ద కాలేజిలో పెద్దపెద్ద పిల్లలున్నారు. నేను చెప్పగలనా అన్నప్పుడు మా వారన్నారు…ఎవరూ పుట్టుకతో పండితులు కారు నీ అనుభవపూర్వకంగా నేర్చుకుంటావు అని నాకు ధైర్యం చెప్పారు.అలాంటి నేను చాల ఆత్మ విశ్వాసంతో చెప్పడం మొదలు పెట్టి ఇప్పుడు అలవోకగా చెప్పగలుగుతున్నా.
మీ తర్వాత బంజార మహిళలు ఉన్నత విద్యలోకి వస్తున్నారా ?
మంచి ప్రశ్న అడిగారు నేను హైస్కూల్లో ఉన్నపుడు ఇద్దరమే బంజార విద్యార్థులం. ఎస్‌సి హాస్టల్లో చేరాము. కాని నేడు ఎస్‌టి మహిళకు ప్రత్యేక హాస్టళ్లు రావడం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టళ్లలో చేర్పిస్తున్నారు. మాలో కూడ చదువుకోవాలనే అవగాహన పెరిగింది. చదువుకుని మంచి ఉద్యోగం వస్తుంది లేదా తెలివితో బతుకుతాం అని తెలుసుకుంటున్నారు. ఇప్పుడు నేను ఈ యూనివర్సిటిలో పని చేస్తున్నా కాబట్టి నా దగ్గరికి ఎస్‌టి, ఎస్‌సి పిల్లలు వచ్చి నన్ను సలహాలు అడిగినప్పుడు నాకు చాల సంతోషంగా ఉంటుంది. ఆగష్టు 15, జనవరి 26 న మా జిల్లాలో ఉన్న పాఠశాలలకు నన్ను ముఖ్య అతిథిగా పిలుస్తారు. నన్ను ఆదర్శంగా తీసుకోవడానికి పిలుస్తామని అంటారు.
ప్రపంచీకరణ ప్రభావంతో ప్రాంతీయ భాషలు క్షీణిస్తున్నాయి నిజమేనా.. మరి ఎలా కాపాడుకోవాలి?
ప్రపంచీకరణ నేపథ్యం ఒకసారి పరిశీలిస్తే అది శాస్త్ర సాంకేతికత కలిగి ఉన్నది. అది ప్రపంచాన్ని ఆకర్షించింది. సాంకేతికతతో అస్తిత్వాన్ని ధ్వంసం చేసింది. అందులో భాగంగానే స్థానిక భాషలు క్షీణిస్తున్నాయి. ఎక్కువగా ఏ భాష వల్ల ఉపాధి అవకాశాలు ఉంటాయో సమాజం ఆ భాష నేర్చుకుంటుంది. అందులో భాగంగానే ఇంగ్లీషు ఇంటర్నేషనల్ భాష అయింది. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ తెలుగు భాషాభిమానులకు ఒక శుభవార్త ఇచ్చింది. పదవ తరగతి వరకు తెలుగు తప్పనిసరి అని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇది తెలుగు కాపాడుకోవడంలో ఒక భాగం..
మీ తండాకు ఏం సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ?
ముందుగ మీతో ఒక విషయం చెప్పాలి. నేను యాడి చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశాను, మా భాషలో యాడి అంటే అమ్మ. సృష్టికి మూలం అమ్మేగా. ఎవరి అమ్మయిన అమ్మేగా అందుకే ఈ పేరు పెట్టుకున్నాం. నేను సెలవుల్లో మా తండాకెళ్లినపుడు అక్కడి పరిస్థితులు చూస్తే నాకెంతో బాధ కలుగుతుంది. ఇప్పటికి తండా పిరిస్థితులు అలాగే ఉన్నాయి. చిన్న చిన్న పిల్లలు తాగుడుకు బానిసలవుతున్నారు. విలువైన జీవితాలు నాశనమవుతున్నాయి. వీళ్లను ఈ పరిస్థితి నుంచి ఎలాగైనా బయట పడేయాలని మాకు బలమైన కోరిక ఏర్పడింది. వీరిని ఆధ్యాత్మికత వైపు నడిపించాలని అనుకున్నాను. ఎందుకంటే దేవుడంటే మనిషికి కొంత భయం ఏర్పడుతుంది. ముఖ్యంగా మా లంబాడిలు రాం…రాం….అని పలకరించుకుంటారు. అందులో భాగంగానే మా తండాలో రామాలయం కట్టించాను. ఇప్పుడు మా తండాలో ఎవ్వరు తాగటం లేదు. ఈ మార్పు చూసి నాకు చాల సంతోషం కలిగింది. ఇంకా సమాజానికి ఎంతో చేయాలని బలమైన కోరిక నాలో ఏర్పడింది. మా తండా వాసులు బస్సుకోసం మూడు కిలోమీటర్లు నడిచి వెళ్లాలి అలా ఎండకు ఎండుతారు వానకు తడుస్తారు. ఇది చూసి నేను చలించి పోయి మా ఊర్లో బస్సుషెల్టర్ ఏర్పాటు చేశాను.
ఇంకా బంజారాల పరిస్థితులు మారాలనుకుంటున్నారా ?
ఒక బంజార మహిళ పరిస్థితే కాదు ప్రతి మహిళ జీవితం మారాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళ ఎక్కడున్నా అణిచివేతకు గురౌతోంది. మహిళ అణిచివేత నుండి బయటపడలంటే మొదట చదువుకోవాలి. చదువుకుంటేనే సామాజిక సృహ పెరుగుతుంది. సమాజం పట్ల ఒక అవగాహన ఏర్పడుతుంది. సమాజంలో ఎలా జీవించాలో తెలుస్తుంది. మహిళ ఒక సామాజిక శక్తిగ ఎదుగుతుంది.
తెలుగు సాహిత్య రంగంలో మీ వ్యక్తిగత కృషి ఏమిటి ?
సాహిత్యంలో వ్యక్తిగతంగా నేను తక్కువగానే కృషి చేశాను. నేను మాత్రం బంజారాలపైనే పరిశోధన చేశాను. అందుకేనేమో నన్ను మొదటి బంజారా రచయిత్రి అంటారు. ఇది నాకు సంతోషమే.
మీకు నచ్చిన పుస్తకం ఏది ?
ఏలెక్స్ హేలి రాసిన పుస్తకం .ఏడు తరాలు ఈ పుస్తకం నా పై చాల ప్రభావం చూపింది.
మీ పై ప్రభావం వేసిన రచయిత ఎవరు ?
గుర్రం జాషువ, సినారె, శ్రీశ్రీ, వంటి రచయితలు,కవులు అనేకమంది.
సాహిత్యంలో బంజార సాహిత్యానికి స్థానం దక్కుతుందంటారా ?
కచ్చితంగా దక్కుతుంది. ఎందుకంటే బంజారాలు కూడ మనుషులే కదా..? వారికి కూడ ప్రత్యేక భాష, ఆచార, సాంప్రదాయాలు ఉన్నయి కదా… వారికంటూ ఒక సామాజక జీవితం, నేపథ్యం ఉన్నది. వారికి చరిత్ర ఉన్నది. వీటన్నిటినుంచే కవిత్వం, సాహిత్యం పుట్టింది. విశ్వవిద్యాలయాలలో బంజారాలపై, వారి జీవివ విధానంపై సాహిత్యంపై అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. ఇంత పరిశోధన జరుగుతుందంటే స్థానం దక్కినట్లే కదా.
బంజార సంస్కృతిలో స్త్రీ, పురుషుల మధ్య వివక్షత ఉంటుందా ?
జ. బంజార సంస్కృతిలో స్త్రీ, పురుషుల మధ్య వివక్షత తక్కువగా ఉంటుంది. స్త్రీ పురుషులు కలిసి పనిచేస్తారు. మా మగవాళ్లు వాకిలి ఊడుస్తారు. స్త్రీలు నాగలి దున్నుతారు. పొలం పనులు ఇంట్లో పనులు ఇద్దరు కలిసి చేస్తారు. ఇంకా చాల పనులు కలిసే చేస్తారు.
మహిళలకు మీరిచ్చే సందేశం ఏమిటి ?
మార్పులు రావాల్సి ఉంది. గ్రామీణ ప్రాంత ఆడ పిల్లలకు చిన్నతనంలోనే పెండ్లి చేయడం కూడ ఆడ పిల్లలు చదువుకు దూరం కావడం ఒక కారణం. చదువు ఆడ పిల్లలకు అవసరమా అనే భావన ఇంకా పల్లెలల్లో ఉంది. కాబట్టి మొత్తంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలంటే ముందుగా చదువుకోవాలి. చదువుకుంటేనే జీవితమంటే ఏంటో తెలుస్తుంది. అది తెలుసుకున్నప్పుడే తెలివిగా బతుకగలం.