Home వార్తలు నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ‘జెంటిల్‌మన్’

నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ‘జెంటిల్‌మన్’

అష్టాచమ్మా, గోల్కొండ హై స్కూల్, అంతకుముందు ఆతరువాత వంటి హిట్ చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణ.  ఇటీవల నాని హీరోగా, సురభి, నివేదా థామస్ హీరోయిన్‌లుగా ఆయన తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీ ‘జెంటిల్‌మన్’తో భారీ హిట్‌ను అందుకున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మోహన్‌కృష్ణతో ఇంటర్వూ…

Directorనానీ న్యాయం చేయగలడనిపించింది…
ఈ కథతో నేను సినిమా చేద్దామనుకున్నప్పుడు నాని ‘ఎవడే సుబ్రమణ్యం’ సినిమాలో నటిస్తున్నాడు. ఆతర్వాత తను రెండు సినిమాలకు కమిట్ అయ్యాడు. దాంతో నాని కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ సమయంలో మరో హీరోతో వెళ్లిపోదామనుకున్నాను. శర్వానంద్‌కు కథ చెప్పాను కానీ తను ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ సినిమాతో బిజీగా ఉన్నాడు. చాలా మంది హీరోలకు చెప్పాను కానీ నానీ అయితేనే ఈ కథకు న్యాయం చేయగలడనిపించింది. అందుకే తన కోసం కొంతకాలం ఎదురుచూసి ఈ సినిమా మొదలుపెట్టాను.
టైటిల్‌కు తగ్గ సినిమా…
నా సినిమాలకు తెలుగు టైటిల్స్ పెట్టాలనుకుంటాను. కానీ
ఒక వ్యక్తిని విలన్ అని భావిస్తే… అతను విలన్ కాదు నిజమైన జెంటిల్‌మన్ అని చెప్పే విధంగా సినిమా ఉంటుంది. అందుకే సినిమాకు ‘జెంటిల్‌మన్’ అనే టైటిల్ పెట్టాం. మొదట ఉత్తముడు అనే టైటిల్ అనుకున్నాం కానీ కుదరలేదు. ఉత్తమ విలన్ అనే టైటిల్ మా కథకు బాగా సెట్ అవుతుంది. అయితే ముందే విలన్ మంచోడని తెలిసిపోతుంది. అలా తెలియకూడదనుకున్నాం.
క్లైమాక్స్‌ను కుదించాం…
ఈ సినిమా చివరి పది నిమిషాలు ప్రేక్షకులకు తెలియని విషయాలు చెప్పాలనుకున్నాం. వాళ్లు ఊహించని అంశాలు ఉండాలి. దాని కోసం చాలా ఆలోచించాం. దాదాపు 18 నిమిషాల పాటు క్లైమాక్స్ సీన్ తీశాం. దాన్ని 12 నిమిషాలకు కుదించాం. స్క్రీన్‌ప్లే పెద్ద ఛాలెంజ్ అయింది. క్లైమాక్స్‌లో నాని పర్‌ఫార్మెన్స్‌కు మంచి ప్రశంసలు వస్తున్నాయి.
కథను పూర్తిగా అర్థం చేసుకోవాలి…
డేవిడ్ నాథన్ అనే తమిళ రచయిత రాసిన కథ ఇది. ఆ కథను మన సంస్కృతికి తగ్గట్లుగా మార్పులు చేశాను. నేను ఇది వరకు కూడా ‘మాయాబజార్’ అనే సినిమాను వేరే వాళ్ల కథతో తెరకెక్కించాను. వేరొకరు రాసిన కథను మనం డైరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కథను పూర్తిగా అర్థం చేసుకోవాలని నేను సరిగ్గా డైరెక్ట్ చేయకపోతే రచయిత అసంతృప్తి చెందుతాడు. ఈ సినిమా విషయంలో డేవిడ్ నాథన్ ఎంతో సంతోషంగా ఉన్నారు.
అందుకే నివేదను తీసుకున్నాం…
నివేదా థామస్ పాత్రకు మొదట నిత్యామీనన్, కీర్తి సురేష్… ఇలా రకరకాల పేర్లు అనుకున్నాం. కానీ కో డైరెక్టర్ సురేష్ మలయాళంలో నివేద నటించిన మరిరత్నం అనే సినిమా చూపించారు. పాపనాశం సినిమాలో ఆమె కమల్ కూతురిగా అద్భుతంగా నటించింది. అందుకే తనను హీరోయిన్‌గా ఫైనల్ చేశాం. ఈరోజు నివేద, నాని పర్‌ఫార్మెన్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది.
మణిశర్మ మ్యూజిక్‌కు మంచి స్పందన…
మా సినిమాకు మ్యూజిక్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఎంతో కసితో మణిశర్మ సినిమాకు సంగీతాన్ని అందించారు. 60 నుండి 70 లైవ్ ట్రాక్స్ ఇచ్చారు. ఒరిజినల్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉపయోగించారు. పట్టుదలతో… ఎంతో ఇష్టంగా ఈ సినిమాకు పనిచేసి అనుకున్నది సాధించారు.
యుఎస్‌లోనూ కలెక్షన్లు బావున్నాయి…
కమర్షియల్‌గా ‘జెంటిల్‌మన్’ మంచి సక్సెస్‌ను సాధిస్తోంది. యుఎస్‌లో కూడా వీకెండ్ కలెక్షన్స్ బావున్నాయి. ‘అష్టాచమ్మా’ నా కెరీర్‌లో మొదటి హిట్. ఆతర్వాత మరోసారి నానితో చేసిన ఈ సినిమా నా కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
షేక్స్‌స్పియర్ కథలతో సినిమా చేయాలనుంది…
అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శించే సినిమా చేయాలనుంది. అలాగే నాకు షేక్స్‌స్పియర్ నవల్స్ అంటే చాలా ఇష్టం. అందులో రొమాన్స్, కామెడీ ఉండే కథను తీసుకొని ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాలనుకుంటున్నాను. కుటుంబరావు రాసిన రెండు నవలల రైట్స్ తీసుకున్నాను. బుచ్చిబాబు రాసిన ‘చివరకు మిగిలేది’ అనే మరో నవల హక్కులను పొందాను. వాటిని చిత్రాలుగా తెరకెక్కించాలని అనుకుంటున్నాను.