Home సినిమా తారక్ మాటలు విని షాకయ్యా

తారక్ మాటలు విని షాకయ్యా

ఎన్టీఆర్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అరవింద సమేత’. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు త్రివిక్రమ్‌తో ఇంటర్వూ విశేషాలు…

Trivikaram

ఏం చెప్పాడో అలాగే చేశాడు..
ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ చనిపోయిన తర్వాత నేను, చినబాబు కలిసి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే డిసెంబర్, జనవరిలో చాలా సినిమాలు రిలీజ్ డేట్‌ను ప్రకటించుకున్నాయి. కానీ రెండు రోజుల తర్వాత ఎన్టీఆర్ ఫోన్ చేసి తాను షూటింగ్ వస్తానని చెప్పాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమా అనుకున్న సమయానికి విడుదల కావాలని అన్నాడు. తారక్ మాటలు విని షాకయ్యాను. అతను ఏం చెప్పాడో అలాగే చేశాడు.
అప్పుడు అయోమయంలో ఉన్నా..
‘అరవింద సమేత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నేను అయోమయంలో ఉన్నాను. హరికృష్ణ మరణం అందరి మనసుల్లో ఉండిపోయింది. నేను ఏం మాట్లాడినా దాంతోనే ముగించాలి. అందుకనే ఎక్కువగా మాట్లాడకుండా ఎన్టీఆర్‌కు వదిలేశాను.
కొత్త కోణాన్ని చూపించాం..
గతంలో ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో చాలా సినిమాలు వచ్చాయి. కానీ ‘అరవింద సమేత’లో ఒక కొత్త కోణాన్ని చూపించాం. ఫ్యాక్షన్ ప్రాంతాల్లో మహిళలు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు… వాళ్లు పడే బాధలు ఎలా ఉంటాయో ఈ చిత్రంలో చూపించాను.

దాంతో సంబంధం లేదు..
పవన్‌కళ్యాణ్‌తో తీద్దామనుకున్న కోబలి చిత్రానికి, ఈ సినిమాకు సంబంధం లేదు. అభిమానులు కోరుకునే అన్ని అంశాలతో పాటు మనసును కదిలించే భావోద్వేగాలు ఈ చిత్రంలో ఉంటాయి.
భావోద్వేగానికి గురవుతారు..
పెనిమిటి సాంగ్‌ను చూసినప్పుడు ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురవుతారు. ఈ పాటను ఎన్టీఆర్‌పైన 40 శాతం చిత్రీకరించాం. మిగతా అంతా కొండలు, మిగతా ప్రాంతాల్లో షూట్ చేశాం.
అవే సినిమాకు హైలైట్..
కథకు ఏం కావాలో అది మాత్రమే ఈ సినిమాలో చూపించాను. అనవసరమైన కామెడీ, హద్దులు మీరిన రొమాన్స్ వంటివి ఈ చిత్రంలో ఉండవు. విభిన్నమైన భావేద్వేగాలు ఈ సినిమాకు హైలైట్‌గా ఉంటాయి.
ఓ మైలురాయిగా..
ఈ సినిమా చూసిన తర్వాత జగపతిబాబును అందరూ ద్వేషిస్తారు. ఆయన పాత్రలో కొత్తదనం కనిపిస్తుంది. ఈ సినిమా జగపతిబాబు కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుంది.