Home ఆఫ్ బీట్ అమ్మ పాటకు ఫిదా

అమ్మ పాటకు ఫిదా

ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని…అరె ఓ జంగమా విభూది లింగమా…వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే…ఒక పాట ఆడపిల్ల కష్టాల మీద పాడితే… మరో పాట దేవుడిపై…ఈ రెండింటికి వ్యతిరేకంగా ప్రేమికుల కోసం మరో పాట. ఓ పాట పాడమన్నా కచ్చితంగా ఆ పాటకు న్యాయం చేస్తానన్న నమ్మకాన్ని అభిమానులతో పాటు సినిమా ఇండస్ట్రీలో కల్పించింది. చిన్నప్పటి నుంచే ఆమె కష్టాల జీవితాన్ని చవిచూసింది. ముఖ్యంగా ఆడపిల్లలు వారి తల్లిదండ్రులు పడే కష్టాల నుంచే ఆమె గాత్రం పుట్టింది. ఆమె బాధలోంచే పాట పుట్టింది.
తనలాగే ఎంతోమంది ఆడబిడ్డలు కష్టాలు పడుతున్నారన్న ఆవేదనే ఆమె పాటకు రూపం అయ్యింది. రాతకు స్ఫూర్తి నిచ్చింది. అందరి ఆడపిల్లల మాదిరిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకుంది. ఒక పాటల రచయితగా , గాయనిగా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకుంది. ఆడపిల్లల తల్లి దండ్రులు ఆమె పాట వింటే తాము పడుతున్న కష్టాలను మరిచిపోయేంతగా పాటలను పాడుతుంది. మధుప్రియ అంటే తెలియని వారుండరు. ఫిదా తరువాత తనకు సినిమాల్లో అవకాశాలు ఇంకా ఎక్కువగా వస్తున్నాయని, ఒక ఆడపిల్లగా తాను ఇండస్ట్రీలో పడిన ఇబ్బందులను, అనుభవాలను సకుటుంబంతో పంచుకుంది.

madhu

మీ కుటుంబం నేపథ్యం ?
అమ్మ సుజాత, నాన్న పెద్దింటి మల్లేష్ (సింగరేణి ఉద్యోగి). మేము ముగ్గురం ఆడపిల్లలం. అక్క సుప్రియ చెల్లె సుప్రియ. మా సొంత జిల్లా ఆదిలాబాద్. ప్రస్తుతం మా నాన్న ఉద్యోగ రీత్యా కరీంనగర్ గోదావరి ఖనిలో ఉంటున్నాం.
మొదటగా మీరు ఎప్పుడు పాట పాడారు ?
చిన్నప్పుడే అమ్మ గురించి పాట పాడాను. 6 సంవత్సరాల వయస్సులోనే పాట పాడాను. చిన్నప్పటి నుంచే స్టేజీ షోలపై పాటలు పాడాను. అందులో ఎక్కువగా సామాజిక గీతాలు, తెలంగాణ ఉద్యమం, ఆడపిల్లల గురించే పాటలు పాడాను.
ఆడపిల్లనమ్మా అనే పాటను ఎవరు రాశారు ?
ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనా … అనే పాటను 9 సంవత్సరాల వయస్సులో రాశాను. అమ్మ ఇచ్చిన ప్రోత్సాహం వల్లే నాకు అది సాధ్యమయ్యింది. ఎక్కువ సార్లు ఆ పాటను స్టేజీ షోలో పాడాను. దీంతో నాకు చాలా గుర్తింపు వచ్చింది. ఆడపిల్లలు ఉన్న కుటుంబంలో పడే కష్టాలు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టే నేను ఆ పాట అందిరికీ చేరేలా పాడాను. 6 సంవత్సరాల వయస్సు నుంచి నేను పాటలు పాడుతున్నా.
ఆడపిల్లనమ్మా అనే పాటకు ఎప్పుడు ఎక్కువగా గుర్తింపు వచ్చింది ?
సూపర్ సింగర్ (జూనియర్స్)లో మొదటగా పాడాను. అప్పుడు పెద్దగా నాకు గుర్తింపురాలేదు. అదే సూపర్‌సింగర్ 3 జరుగుతున్నప్పుడు పాటల రచయిత చంద్రబోస్ ఆ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సూపర్‌సింగర్ 3 మళ్లీ నాతో ఆ పాట పాడించడంతో నాకు దేశ, విదేశాల్లో గుర్తింపు వచ్చింది.
ఫిదా పాట అవకాశం ఎలా వచ్చింది ?
మొదటగా దిల్ రాజు ఆఫీసు నుంచి ఫోన్ వచ్చింది. వరుణ్‌తేజ్ హీరోగా శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో సినిమా వస్తుంది మీరు ఒక పాట పాడాలని పిలిచారు. మొదటగా నేను నమ్మలేదు. రెండోరోజు మళ్లీ ఫోన్ చేస్తే, దిల్‌రాజు ఆఫీసుకు వెళ్లాను . పిలిచింది మొదటగా వేరే పాట కోసం కానీ, వచ్చిండే మెల్లమెల్లగా వచ్చిండే పాటకు అవకాశం వచ్చింది.
ఫిదాకు ముందు ఏదైనా సినిమాలో పాట పాడారా ?
చిన్న సినిమాలో మాత్రమే అవకాశం వచ్చింది. పెద్ద సినిమాలో ఎప్పుడూ అవకాశం రాలేదు. ఫిదానే నాకు పెద్ద సినిమా. ఫిదా తరువాత నేలటికెట్టు, టచ్ చేసిచూడు, సాక్షం సినిమాలో పాడాను.
సినిమాలో మీరు పాడిన పాటలకు మీకు నచ్చిన పాట ?
నాకు నచ్చిన పాట ఫిదా సినిమాలోనిదే.
ఇప్పటివరకు మీరు ఎన్ని పాటలు రాశారు.. ఎన్ని పాటలు పాడారు ?
15 పాటల వరకు రాశాను. నాకు బ్రేక్ నిచ్చిన పాట ఆడపిల్లనమ్మా అనే పాట. ప్రైవేటుగా పాడిన పాటలు మాత్రం వేలల్లో ఉంటాయి.
ప్రస్తుతం సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న వరుస సంఘటనలపై మీ అభిప్రాయం ?
నేను ఆడపిల్లనే. నాతో ఇద్దరు అక్కా, చెల్లెలు ఉన్నారు. ఆడపిల్ల సమాజంలో ఎన్నో బాధలు తట్టుకోవాల్సి ఉంటుంది. నేను అనుభవించి ఉండడంతో నాకా విషయం తెలుసు. అలాగని ప్రస్తుతం అమ్మాయిలు కూడా అమ్మానాన్నలకు చెడ్డపేరు తీసుకురాకుండా మెలగాలి. మంచిని ఎక్కువగా నేర్చుకోవాలి. పాశ్చాత్య పోకడల వైపు దృష్టి మళ్లించవద్దు. ఆడపిల్లల గౌరవాన్ని నిలపాలి.
మీ పెళ్లి తరువాత హ్యాపీగా ఉన్నారా?

mdp
ఇన్ని సంవత్సరాలు అమ్మా,నాన్నలు కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇప్పుడు నా భర్త శ్రీకాంత్ కూడా అలాగే చూసుకుంటున్నాడు. నేను ఏదైతే సాధించాలనుకున్నానో అదే విధంగా నేను సక్సెస్ సాధించేలా ఆయన అహర్నిశలు నా వెంట ఉంటున్నాడు. అమ్మా,నాన్నలతో పాటు నా భర్తకు కూడా నేను రుణపడి ఉంటాను. అమ్మానాన్నలు లేకపోతే మధుప్రియ లేదు.
అవార్డులు ఏమైనా వచ్చాయా ?
అతి చిన్న వయస్సులోనే ఫిలింఫేర్ అవార్డు అందుకున్నాను. ఈ అవకాశం నాకు రావడం అదృష్టంగా భావిస్తున్నా. ఈ అవార్డు ఫిదాలో పాడిన పాటకు గాను వచ్చింది. దీంతోపాటు చాలా అవార్డులు వచ్చాయి. నన్ను అభిమానించే శ్రోతల వలనే నాకు ఈ అవార్డులు వచ్చాయి.
మీ ఇంట్లో రచయితలు, సింగర్‌లు ఎవరైనా ఉన్నారా ?
అమ్మా, నాన్న, తాతయ్య కూడా పాటలు పాడుతారు. వాళ్ల నుంచే నాకు సింగర్ కావాలన్న కోరిక కలిగింది. ప్రస్తుతం అక్క లాయర్, చెల్లెలు ఐఏఎస్‌కు ప్రిపేర్ అవుతోంది. నేను మాత్రం ఇలా సింగర్‌గా స్థిరపడ్డాను.
బిగ్‌బాస్ ఎలా అవకాశం వచ్చింది ?
మాటివిలో గతంలో నేను చాలా ప్రోగ్రామ్‌లు చేశాను. బిగ్‌బాస్ ప్రారంభంలో నన్ను అడిగారు. నా మైండ్‌సెట్ ఈ షోకు సెట్ అవుతుందని నన్ను ఎంపిక చేశారు. బిగ్‌బాస్‌లో నేనే చిన్నమ్మాయిని. బిగ్‌బాస్ షో చేస్తున్నప్పుడే ఫిదా సినిమా రిలీజ్ అయ్యింది. ఎక్కువ రోజులు బిగ్‌బాస్‌లో ఉండలేక పోయాను. అందరినీ అడిగి నేను నా నామినేషన్ చేయించుకున్నా. మరోసారి బిగ్‌బాస్‌లో అవకాశం వస్తే వెళతా.

మీకు నచ్చిన గాయనీ, గాయకులు, రచయితలు ? పాటలు రాయడం ఇష్టమా.. పాడడం ఇష్టమా?
పాటలు పాడడం ఇష్టం. కందికొండ, గోరటివెంకన్న, సుద్దాల అశోక్‌తేజలు రాసిన పాటలు ఇష్టం. గాయకుడు కైలాస్ కేర్ పాటలంటే పిచ్చి. శంకర్‌మహదేవన్, చిత్రలు పాడిన పాటలంటే ఇష్టం.
జీవితంలో ఏమీ సాధించాలనుకుంటున్నారు ?
అన్ని రకాల పాటలను పాడాలన్నదే నా జీవిత ఆశయం. ఏ పాటనైనా మధుప్రియ పాడుతుందని అభిమానులందరూ అనుకోవాలన్నది నా కోరిక. ఆడపిల్లల కష్టాల గురించి కొట్లాడడానికి మధుప్రియ ముందుండాలన్నదే నా ధ్యేయం. ఆడపిల్లల బాధలు మధుప్రియ బాధగా భావిస్తుంది.

ఎల్. వెంకటేశం
మన తెలంగాణ ప్రతినిధి