Search
Thursday 15 November 2018
  • :
  • :

మూడు, నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటా

సుమంత్ అశ్విన్, నిహారిక కొణిదెల జంటగా లక్ష్మణ్ కార్య దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హ్యాపి వెడ్డింగ్’. యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ నిహారిక కొణిదెలతో ఇంటర్వూ  విశేషాలు… 

Niharika

 మంచి అనుభవం…
నేను చాలా రోజులుగా క్యాజువల్‌గా ఉండే ఓ సినిమా చేద్దామని అనుకుంటూ ఉండేదాన్ని. అలాంటి సినిమానే ఇది. ఇందులో ఎక్కువ క్యారెక్టర్స్ ఉన్నా కూడా ప్రతి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. నేను మంచి క్యారెక్టర్ చేశాను. సీనియర్ నటులతో కలిసి ఈ సినిమా చేయడం మంచి అనుభవానిచ్చింది.

 విలన్‌లు ఉండరు…
సినిమాలో అక్షర అనే సింపుల్ అమ్మాయి పాత్రలో కనపడతాను. ఫ్యాషన్ డిజైనర్‌గా కనిపిస్తా. కథ విషయానికొస్తే… ఇంట్లో వాళ్ల సమ్మతంతో ప్రేమించిన వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ జరుగుతుంది. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. సినిమాలో విలన్‌లు ఉండరు. నా పాత్ర వల్లనే సమస్యలు, పరిష్కారాలు ఉంటాయి.

 నటనాపరంగా యాక్టివ్‌గా…
సుమంత్ అశ్విన్ నటించిన సినిమాలన్నీ నేను చూశాను. చూసినప్పుడు ఈ అబ్బాయి చాలా చలాకీగా ఉంటాడు… ఎక్కువగా మాట్లాడుతాడు అనిపించింది. కానీ సెట్స్‌లో తను వేరుగా ఉంటాడు. తన లోకంలో తను ఉంటాడు. వ్యక్తిగా తను చాలా నెమ్మది.. అయితే నటనాపరంగా యాక్టివ్‌గా ఉంటాడు.

 మూడు, నాలుగేళ్లే చేస్తా…
ఎక్కువ కాలం పాటు నాకు సినిమాలు చేయాలని లేదు. మూడు, నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకొని సినిమాలు మానేస్తాను. సినిమా రంగంలో ఉంటాను కానీ ప్రొడక్షన్ వైపు ఉంటాను. వెబ్ సిరీస్ చేసుకుంటాను. కాబట్టి సినిమాలో హీరో ఎవరని నేను ఆలోచించడం లేదు. రేపు సినిమాలు మానేసిన తర్వాత నా సినిమాలు చూసుకుంటే నా ప్రతి క్యారెక్టర్ నాకు నచ్చాలి.

 ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తా…
స్టార్ హీరోలతో సినిమాలు చేయనని కాదు. ఇప్పటివరకు అవకాశం రాలేదు. వస్తే తప్పకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తా. అయితే హీరోయిన్ పాత్రలకు మంచి ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతాను. నా పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా నా పాత్ర వల్ల సినిమాకు ఏదైనా ప్లస్ ఉండాలని కోరుకుంటున్నాను. తమిళం నేర్చుకున్నా…
నేను పుట్టిన సంవత్సరంలోనే తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వచ్చేసింది. మా ఇంట్లో నేను తప్ప అందరూ తమిళం చక్కగా మాట్లాడుతారు. అయితే నేను తమిళ సినిమాలు చూసి తమిళం నేర్చేసుకున్నాను. విజయ్ సేతుపతి, గౌతమ్ కార్తీలతో కలిసి సినిమా చేసేటప్పుడు నాకు తమిళం అర్థం కావడం వేరు… మాట్లాడడం వేరని తెలిసింది. ఇప్పుడు తమిళ ట్యూటర్‌ని పెట్టుకొని తమిళం నేర్చుకున్నాను. ఇప్పుడు తమిళం రాస్తాను కూడా.

 కెరీర్‌పైనే దృష్టి…
పెళ్లంటే నాకు చాలా గౌరవం. మా ఇంట్లో కానీ, నా స్నేహితుల్లో పెళ్లి చేసుకున్నవారు సక్సెస్‌ఫుల్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. మూడు, నాలుగేళ్ల తర్వాత పెళ్లి చేసుకుంటాను. ప్రస్తుతం మాత్రం కెరీర్‌పైనే దృష్టి పెడుతున్నాను.

Comments

comments