Home సినిమా చరిత్రను తెరకెక్కించేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి

చరిత్రను తెరకెక్కించేటప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి

తెలుగు చిత్ర పరిశ్రమలో రౌద్రపూరిత నటనకు ప్రతిరూపంగా నిలిచిన కృష్ణంరాజు రెబల్‌స్టార్‌గా పేరుతెచ్చుకున్నారు. 1966 సంవత్సరంలో ‘చిలకా గోరింక’ చిత్రంతో మొదలైన ఆయన ప్రస్థానం దిగ్విజయంగా 50  ఏళ్లకు చేరుకుంది. దాదాపు 300 చిత్రాల్లో నటించిన ఆయన ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. శనివారం పుట్టినరోజును జరుపుకుంటున్న కృష్ణంరాజు హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన విశేషాలు…

Krishnam-Raju*అప్పుడే ఆత్మవిశ్వాసం కలిగింది…
‘చిలకా గోరింక’ చిత్రంలో ఎస్వీ రంగారావుతో కలిసి నటించిన సన్నివేశం నా నటనకు తొలి అడుగు. అభినయంలో ఆయన శిఖర సమానుడు. నటనలో ఆయనను అందుకునేందుకు ప్రయత్నించి ఆ శిఖరానికి సగం చేరుకున్నాను. ఈ చిత్రంలో నటించాకే నాలో నటుడు ఉన్నాడనే ఆత్మవిశ్వాసం కలిగింది.
*స్టైలిష్ విలన్‌గా నటించా…
ఆతర్వాత ‘నేనంటే నేనే’ చిత్రంలో స్టైలిష్ విలన్‌గా నటించాను. ఆ చిత్రానికి పేరు రావడంతో ప్రతినాయకుడిగా పదికి పైగా సినిమా అవకాశాలు వచ్చాయి. కానీ అందులో రెండు చిత్రాలు మాత్రమే ఎంచుకున్నాను. నటనకు అవకాశం ఉండి ప్రత్యేకంగా ఉన్న పాత్రలకు ప్రాధాన్యమిచ్చాను.
*సినిమాలు చేసేవాళ్లు పలు రకాలు…
చిత్ర పరిశ్రమలో కొందరు తమకోసం సినిమాలు చేసుకున్న వాళ్లున్నారు. మరికొందరు తమ కోసం సినిమాలు చేస్తూ పరిశ్రమ అభివృద్ధికి పాటుపడ్డారు. కొందరు కేవలం చిత్ర పరిశ్రమ కోసమే సినిమాలు చేశారు. రామ్‌గోపాల్ వర్మలాంటి వాళ్లు తమ కోసం సినిమాలు చేసుకున్నారు. ఎంఎస్ రాజులాంటి నిర్మాతలు కేవలం ఇండస్ట్రీ కోసం సినిమాలు రూపొందించారు.
మా గోపీకృష్ణ పతాకంపై పరిశ్రమ అభివృద్ది కోసం ఆలోచిస్తూనే మా వంతు ప్రయత్నాలు చేశాం. అందుకే ఎవరున్న లేకున్నా మా సంస్థ అలాగే కొనసాగుతుంది.
*అప్పుడు గొప్పగా ఉండేది…
తొలి తరంలో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లు మంచి కథాబలమున్న చిత్రాలు చేశారు. అప్పుడు మన సినిమా గొప్పగా ఉండేది. ఇక ఆతర్వాత కొన్నాళ్లు యాక్షన్ సినిమాలు వచ్చాయి. వాటిలో పది నిమిషాలకో ఫైట్ ఉండేది. ఫైట్ ఫైట్‌కు సిగరెట్ తాగేందుకు హాల్‌లో నుంచి ప్రేక్షకులు వెళ్లేవారు. అప్పుడే థియేటర్‌లో సిగరెట్ నిషేధించారు.
*ఆ ప్రయత్నం చేశాం…
మూసలో వెళ్తున్న తెలుగు సినిమా దారి మార్చాలని ప్రయత్నం చేశాను. సొంతంగా గోపీకృష్ణ సంస్థ పెట్టడానికి కారణం అదే. కృష్ణవేణి, మన ఊరి పాండవులు వంటి కథలు ఆ కాలంలో చెబితే ఏ నిర్మాత ముందుకొచ్చేవాడు కాదు. కొడుకు తప్పు చేస్తున్నాడని తెలిసినా తండ్రి ఏమీ అనడు. కూతురు చేసేది తప్పో ఒప్పో తెలియకున్నా నిందిస్తాడు. ఇది సమాజంలో ఆలోచనా తీరు. ‘కృష్ణవేణి’ చిత్రాన్ని రూపొందించడం ఆ కాలంలో కత్తి మీద సాము. కానీ మేము ఆ ప్రయత్నం చేశాం.
*చాలా కొత్తగా అనిపించింది…
మహా భారతం కథను ఒక ఊరికి ఆపాదిస్తూ ‘మన ఊరి పాండవులు’ సినిమా కథను తయారు చేశారు బాపు-రమణ. ఇది వేరే నిర్మాతలకు చెబితే చేయలేము అన్నారట. కానీ నాకు చాలా కొత్తగా అనిపించింది. సహజంగా ఉన్నట్లు తోచింది. గోపీకృష్ణ సంస్థలో ఈ చిత్రాన్ని 30 రోజుల్లో పూర్తిచేశాం. సినిమా ఘన విజయం సాధించి పాతిక వారాలు ఆడింది.
*ఆ వేడుకలో అందరినీ కలుస్తా…
నా పుట్టిన రోజుతో పాటు 50 ఏళ్ల పండుగను కూడా జరపాలని అనుకుంటున్నాం. అందుకే ఈ పుట్టిన రోజున అభిమానులను కలవడం లేదు. స్వర్ణోత్సవం సందర్భంలో అందరినీ కలుస్తాను. 30-40 ఏళ్లుగా నన్ను అభిమానిస్తున్న వాళ్లు ఇప్పటికీ ఉన్నారు. స్వర్ణోత్సవ వేడుకలో వారిని సన్మానించాలని అనుకుంటున్నాను. మరో రెండు, మూడు నెలల్లో ఆ వేడుకను నిర్వహిస్తాము.
*ప్రోత్సహించాలి కానీ నిరుత్సాహపరచవద్దు…
‘బాహుబలి’ తర్వాత తెలుగు సినిమా ఎల్లలు లేనంతగా ఎదిగింది. హాలీవుడ్ చిత్రాలకు పోటీగా ఈ చిత్రం విదేశాల్లో వసూళ్లు సాధించింది. బాహుబలి స్ఫూర్తిగా ఎవరైనా సినిమాలు చేయవచ్చు. గొప్ప చిత్రంతో పోల్చుకొని ప్రయత్నించినప్పుడు అంతా ప్రశంసించాలి, ప్రోత్సహించాలి కానీ నిరుత్సాహపరచవద్దు.
*అదే ప్రధాన లక్షం…
బాహుబలిలాంటి సినిమాలు చేయాలనుకునే వాళ్లకు సాంకేతికంగా సహకరించేందుకు ఓ సంస్థను ప్రారంభించబోతున్నాం. ఇందులో బాలీవుడ్‌లో పేరున్న దర్శకుల నుంచి సాంకేతిక నిపుణులు, పేరున్న సంస్థలు బాగస్వాములుగా ఉంటాయి. ప్రతిష్టాత్మక చిత్రాలు చేయాలనుకునేవాళ్లకు సలహాలు, సూచనలు అందించడం ఈ సంస్థ ప్రధాన లక్షం.
 *చరిత్ర గీటు దాటలేదు…
నేను ‘బొబ్బిలి బ్రహ్మన్న’ సినిమా చేస్తున్నప్పుడు కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ పాత్రను మరింత గొప్పగా చేసి చూపించాం కానీ చరిత్ర గీటు దాటలేదు. చరిత్రను తెరకెక్కించేటప్పుడు దర్శకులు ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు దేశమంతా ‘పద్మావత్’ చిత్రం గురించి చర్చ జరుగుతోంది. రాజపుత్ర మహారాణి పద్మావతి వాళ్ల వంశానికి, ఆ ప్రాంతానికి ప్రతీక. ఆమె జీవిత కథతో సినిమా చేస్తున్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక సినిమాకు వ్యతిరేకంగా అల్లర్లు చేసే వాళ్లకు సెన్సార్‌కు సంబంధం లేదు. ఎవరికి నచ్చినట్లు వాళ్లు సినిమాలు చేసుకునే అవకాశం అందరికీ ఉంది. అయితే ఎవరేం చేసినా చూసుకునేందుకు సెన్సార్ ఉంది. ఆతర్వాత సినిమా చూడాలా వద్దా అని నిర్ణయించుకునే అధికారం ప్రేక్షకులకు ఉంది.
* ఇటీవల కాస్త మెత్తబడుతున్నాడు…
గతంలో పెళ్లి మాటెత్తితేనే వద్దనేవాడు ప్రభాస్. ఇటీవల కాస్త మెత్తబడుతున్నాడు. ముందు బాహుబలి తర్వాత చూద్దాం అన్నాడు. ఇప్పుడు సాహో అంటున్నాడు. ఏమైనా పెళ్లి విషయంలో అతని ఆలోచనలో మార్పు వచ్చింది. సాహో తర్వాత ప్రభాస్ తదుపరి సినిమా మా సంస్థలో ఉంటుంది. దర్శకుడు ఎవరన్నది చెబుతాను.