Home ఆఫ్ బీట్ ప్రజాసేవ కోసమే సివిల్స్ వైపు

ప్రజాసేవ కోసమే సివిల్స్ వైపు

కర్తవ్యంతో పని చేస్తే పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించవచ్చు.

వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతి

ఇంజినీరింగ్ పూర్తిచేసి మంచి ఉద్యోగంలో చేరినా ఆత్మసంతృప్తి కలగలేదు. చదువుకునే రోజుల్లో చేసిన వాలంటరీ సేవలే గుర్తుకొచ్చేవి. ప్రజాసేవ చేయడా నికి సివిల్‌సర్వీసెస్ కంటే పెద్ద వేదిక ఏదీ ఉండదనుకుంది. రిటైర్డ్ ఐఎఎస్ అయిన తండ్రి స్ఫూర్తితో సివిల్స్‌వైపు అడుగులేసింది. రెండో ప్రయత్నంలోనే ఏకంగా ఆల్‌ఇండియా రెండో ర్యాంకు సాధించి, అనుకున్న లక్షాన్ని చేరుకుంది. ప్రజాసేవ చేయాలనుకుంటే సివిల్ సర్వీసెస్ కన్నా పెద్ద వేదిక ఏదీ ఉండదంటున్న వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతామహంతిని మన తెలంగాణ ‘సకుటుంబం’ పలకరించింది.

collctor

మాది ఒడిషా రాష్ట్రం..నాన్న ప్రసన్న కుమార్ మహంతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పని చేసి రిటైర్డ్ అయ్యారు. నేను సివిల్ సర్వీసెస్‌లోకి రావడానికి ఆయనే నాకు స్ఫూర్తి. హైద్రాబాద్‌లోని విజ్ఞానభారతి పాఠశాలలో హైస్కూల్ విద్య పూర్తి చేసుకున్నాను. అనంతరం ఇంజనీరింగ్ చేశాను. మంచి జీతంతో ఉద్యోగం వచ్చింది. చదువుకునే రోజుల్లోనే వేసవి సెలవుల్లో పలు ఎన్జీఓలతో కలిసిసేవా కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ఆ కార్యక్రమాలు మనస్సుకు ఎంతో సంతృప్తి నిచ్చేవి. ఆ తర్వాత ఉద్యోగ జీవితంలో ఆ సంతృప్తి దొరకలేదు. దాంతో ప్రజాసేవ చేయడానికి నాకు విస్తృత వేదిక అవసరమని తెలుసుకున్నాను. నాన్న ప్రోత్సాహంతోనే సివిల్స్ దిశగా అడుగులు వేశాను.
క్రమశిక్షణ .. అమ్మదగ్గరే నేర్చుకున్నా..
నాన్న ఐఎఎస్ అధికారి కావడంతో నిత్యం బిజీగా ఉండేవారు. ఆయన చాలా ఓపికతో ప్రజాసమస్యలను పరిష్కరించేవారు. అందులో ఎంత తృప్తి ఉంటుందో చెప్పేవారు. అమ్మ స్మితా మహంతి ఉపాధ్యాయురాలు. ఆమె దగ్గర నుండి క్రమశిక్షణ నేర్చుకున్నాను. ఆమె ఎంత బిజీగా ఉన్నా నాకు, చెల్లికి మంచి నడవడిక నేర్పింది. క్రమశిక్షణతో ఇతరుల పట్ల ఎలా మెసులుకోవాలో, సమాజం అంటే ఏంటనే విషయాలు నేర్పింది. జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను , కష్టాలను, బిజీ లైఫ్ ఎలా ఎదుర్కోవాలో ఆమె దగ్గరే నేర్చుకున్నాను. అది ఇప్పుడు చాలా ఉపయోగపడుతోంది.
ఐఎఎస్ శిక్షణ సానబెట్టింది..
ఐఎఎస్‌కు ఎంపికయ్యే ముందే నేను ఐఆర్‌ఎస్ ఆఫీసర్‌గా పశ్చిమబెంగాల్‌లోని సిలిగురిలో విధులు నిర్వర్తించాను. నాన్న , భర్త ప్రోత్సాహంతో ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించాను. ముస్సోరిలో ఐఎఎస్ శిక్షణ పూర్తయింది. ఒక ఐఎఎస్ ఆలోచనా విధానం ఎలా ఉండాలో నేర్చుకున్నాను. పదేళ్లకు సంబంధించి ఎన్ని రకాల పనులు చేయగలుగుతామో మొత్తం అక్కడే శిక్షణ ఇస్తారు. పారదర్శకత ఎలా పాటించాలో నేర్పిస్తారు. అక్కడ మాకు ఎప్పుడూ చెప్పే సూక్తి ఏమంటే రాయిలో నుండి రత్నాలను తీయాలని. అలాగే శిక్షణ కాలంలోనే భారత్‌దర్శణ్ కార్యక్రమం ఉంటుంది. అందులో భాగంగా దేశంలోని వివిధ రాష్ట్రాలకు పంపిస్తారు. అదో గొప్ప అనుభవంగా చెప్పవచ్చు. ఆయా రాష్ట్రాల్లో ఉండే వాతావరణం, ఆ ప్రాంత విశిష్టతలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు తెలుసుకోవడానికి ఆ విధంగా అవకాశం నాకు దక్కింది.
పుస్తకాలు చదివితేనే జ్ఞానం లభిస్తుంది..
చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు కట్టుబాట్లు అలవాటు చేస్తారు. కాని అవి ఎందుకొచ్చాయి. వాటి వెనుక అర్థం ఏమిటి అనేది చెప్పరు. అందరు చేస్తున్నారు కాబట్టి మనం చేయాలనే ధోరణినే ఎక్కువగా కనిపిస్తుంది. పిల్లలకు అన్నింటి గురించి అర్థమయ్యేటట్లు చెప్పాలి. పుస్తకాలు ఎంత ఎక్కువగా చదివితే అంత ప్రయోజనం ఉంటుంది. చిన్నప్పటి నుండి ఆ అలవాటు చేయాలి. పుస్తకాలు చదవడం వల్ల వచ్చిన ఎక్స్‌పోజర్ దేనిద్వారా కూడా రాదు. అందుకే వనపర్తిలో బాలభవన్‌ను ఏర్పాటు చేస్తున్నాను. అందులో అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంచుతాం. నేను స్వతహాగా పుస్తకాలు ఎక్కువగా చదువుతాను. అమితవ్‌ఘోష్ రచించిన దిగ్లాస్ ప్యాలెస్, శశిథరూర్ రచనలు చాలా ఇష్టం. ట్రావెల్ బుక్స్, ఇతర దేశాల కల్చర్, ఆయా ప్రాంతాల్లో ఉండే మనుషులు, వారి జీవన విధానం గురించిన బుక్స్ చదవడమంటే ఇష్టం. సిద్ధార్ద్ వరదరాజన్ ఆర్టికల్స్ బాగా చదువుతాను. కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పుస్తకాలు చదవడం చాలా వరకు తగ్గింది.
ఒడిస్సీ నృత్యం నేర్చుకున్నా..
సంప్రదాయ నృత్యం ఒడిస్సీ నేర్చుకున్నా. పలు వేదిక లపై ప్రదర్శనలు కూడా ఇచ్చా. ప్రస్తుతం సమయం లేక పక్కన పెట్టాను.

wanaparthy
అమ్మాయిల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తా..
అమ్మాయిలకు వారి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు వారికి కావాల్సిన సౌకర్యాలను సమకూర్చడాన్ని లక్షంగా పెట్టుకున్నాను. కౌమారదశలో ఉన్న బాలికలకు హైజీనిక్ కిట్లు సరఫరా చేయనున్నాం. ఇటీవల ఎఎన్‌ఎంలతోఆయా పాఠశాలల్లో అమ్మాయిలకు హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించాము. హిమోగ్లోబిన్ తక్కువ శాతం ఉన్నవారికి ఐరన్ మాత్రలు పంపిణీ చేశాం. నూతనజిల్లా వనపర్తి కి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టి దాదాపు సంవత్సరంన్నర పూర్తయింది. ఇటీవల ప్రజావాణిలో ఎల్‌ఆర్ యుపి లాండ్ రెగ్యులేషన్ అప్‌డేషన్ ప్రోగ్రాంకు సంబంధించి దరఖాస్తు వచ్చింది. నేను దాన్ని సదరు అధికారులకు పంపించాను. ఆ సమస్య వెంటనే పరిష్కారం అయింది. బాధితుల అమాయకత్వం నా బాధ్యతను మరింత పెంచింది.
భర్తతో సమన్వయం..
నా భర్త రజత్‌కుమార్ షైనీ కూడా ఐఎఎస్. కొద్ది రోజుల క్రితం వరకు జోగుళాంబ గద్వాల్ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ధరిణి రాష్ట్ర ప్రత్యేకాధికారిగా పని చేస్తున్నారు. భార్యాభర్తలు వృత్తి జీవితంలో చేస్తున్న పని ఒక్కటే అయినప్పుడు సమన్వయం చేసుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది. మేము కూడా అదే చేస్తున్నాం. ఏదైనా సమస్య వస్తే ఇద్దరం కూర్చొని చర్చించుకుంటాం. ఆ తర్వాత పరిష్కార మార్గాలను వెదుకుతాం. అవసరమైతే కుటుంబ సభ్యుల సహకారాన్ని కూడా తీసుకుంటాం.
ప్రయాణాలంటే సరదా…
ఖాళీ సమయం దొరికితే ట్రావెలింగ్ చేస్తాను. భారత్ దర్శన్ కార్యక్రమం తర్వాత ఆయా ప్రాంతాల్లోని సంప్రదాయాల గురించి తెలుసుకోవడం అలవాటుగా మారింది. ఇప్పటికే యూరోప్, టర్కీ, జపాన్ దేశాలను సందర్శించాను. వాటిలో టర్కీ చాలా బాగా నచ్చింది. ఆ దేశ ఔన్నత్యం ప్రతీచోటా కనిపిస్తుంది. చదువుకునే రోజుల్లో హిందీ సినిమాలు ఎక్కువగా చూసేదాన్ని. బాహుబలి రెండు పార్టులూ చూశాను. ఏ దుస్తులు సౌకర్యంగా ఉంటే అవే ధరిస్తాను. చేనేత వస్త్రాలకే ప్రాధాన్యం ఇస్తాను.