Home అంతర్జాతీయ వార్తలు ‘బుద్ధ అవతార’ లీలలపై నేపాల్ పోలీసుల కన్ను !

‘బుద్ధ అవతార’ లీలలపై నేపాల్ పోలీసుల కన్ను !

Buddha Boys Missing

ఖాట్మండు: బుద్ధుడి అవతారంగా కొందరు భక్తులు విశ్వసించే స్వయం ప్రకటిత ఆధ్మాత్మిక గురువు రాం బహదూర్ బోమ్జాన్‌పై నేపాల్ పోలీసుల నిఘా కొనసాగుతోంది. బుద్ధా బాయ్‌గా ప్రసిద్ధి చెందిన బోమ్జాన్ ఆశ్రమం నుంచి పలువురు భక్తులు అనూహ్యరీతిలో అదృశ్యం కావడంతో నేపాల పోలీసులు దీని వెనుక ఉన్న మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. నాలుగు కుటుంబాలు ఆశ్రమం నుంచి అదృశ్యం కావడంతో పాటు బుద్ధా బాయ్‌పై లైంగిక, భౌతిక వేధింపులకు చెందిన ఆరోపణలు కూడా ఉన్నాయి. బోమ్జాన్‌పై వచ్చిన ఈ ఫిర్యాదులపై దర్యాప్తు ప్రారంభించినట్లు నేపాల్ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు చెందిన ప్రతినిధి ఉమా ప్రసాద్ చతుర్వేది తెలిపారు.

బుద్ధ భగవానుడి అవతారంగా బోమ్జాన్‌ను ఆయన అనుచరులు భావిస్తారు. 2005లో వెలుగులోకి వచ్చిన బోమ్జాన్ నీళ్లు, నిద్రాహారాలు లేకుండా నెలల తరబడి అడవులలో ధ్యానముద్రలో ఉంటారని ఆయన భక్తులు చెబుతుంటారు. గత ఏడాది సెప్టెంబర్‌లో తనపై బోమ్జాన్ అత్యాచారానికి పాల్పడినట్లు ఒక 18 ఏళ్ల బౌద్ధ సన్యాసిని ఫిర్యాదు చేసింది. అంతేగాక ధ్యానంలో ఉన్నపుడు ఎవరైనా ఏకాగ్రతను భగ్నం చేస్తే వారిపై భౌతిక దాడులకు కూడా ఆయన పాల్పడతాడని కూడా ఫిర్యాదులు ఉన్నాయి. అయినప్పటికీ వేలాదిమంది భక్తులు ఆయన దర్శనం కోసం, ధ్యానంలో ఉన్నపుడు జరిగే మహిమల కోసం ఎదురుచూస్తుండడం విశేషం. కాగా, బోమ్జాన్‌కు అనుబంధంగా ఉన్న బోధి శ్రవణ్ ధర్మ సంఘ మాత్రం ఈ ఆరోపణలను కొట్టివేస్తోంది.

 

Investigate Disappearance of Buddha Devotees by Nepal, Self Styled God man Buddha Boy is under Scanner of police