Home రాష్ట్ర వార్తలు ఘన ఘట్టానికి పిలుపు…

ఘన ఘట్టానికి పిలుపు…

 Kaleshwaram project

 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌ను కలుసుకొని ఆహ్వానించిన కెసిఆర్

ముందుగా రాజ్‌భవన్‌లో గవర్నర్ విద్యాసాగర్ రావును కలిసిన సిఎం
అనంతరం అధికారిక నివాసం వర్షలో ఫడ్నవీస్‌ను కలిసి ఆహ్వానం అందించిన కెసిఆర్

హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్‌ను రావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి కెసిఆర్ బయలుదేరి ముంబై రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసారు. అనంతరం మహారాష్ట్ర సిఎం అధికార నివాసమైన వర్షకు చేరుకొని, దేవేంద్ర పడ్నవీస్‌ను కలిసారు. 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు.

మహారాష్ట్ర ప్రభుత్వం, దేవేంద్ర ఫడ్నవీస్ సహకారం వల్లనే నేడు కాళేశ్వర స్వప్నం సాకారం అవుతోంది. ఈ నేపథ్యంలోనే ఫడ్నవీస్‌ను ప్రారంభోత్సవానికి పిలిచారు. జలవివాదాలతో ప్రాజెక్టులను నాన్చే విధానానికి ముఖ్యమంత్రి కెసిఆర్ చరమగీతం పాడారు. స్నేహపూర్వకంగా ఉంటూ, ఇచ్చిపుచ్చుకునేదోరణిని అనుసరిస్తూ అంతర్రాష్ట్ర సమస్యల గండం నుంచి గట్టెక్కించగలిగారు. 2016 ఆగస్టు 23న ముంబైలోని సహ్యాద్రి గెస్ట్ హౌస్‌లో మహారాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మధ్య ప్రాజెక్టుల నిర్మాణానికి ఒప్పందం కుదిరింది. గోదావరి జలాల వినియోగంలో సమాచారం ఇచ్చిపుచ్చుకోడానికి అంగీకరించారు. ఒప్పందంపై మహారాష్ట్ర సిఎం దేవేంద్ర పడ్నవీస్, తెలంగాణ సిఎం కెసిఆర్ సంతకాలు చేశారు.

లోయర్ పెన్‌గంగ ప్రాజెక్టులో బాగంగా చనాక కొరాట బ్యారేజి నిర్మాణం, ప్రాణహిత వద్ద తమ్మిడి హట్టి బ్యారేజి నిర్మాణం (148 మీటర్ల ఎత్తు), కాళేశ్వరం ప్రాజెక్టు కోసం (100+1 మీటర్ల ఎత్తు) వరకు మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మాణానికి ఇద్దరు ముఖ్యమంత్రుల సమక్షంలో ఇరు ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది.

ప్రాణహిత చేవేళ్ల రీడిజైన్‌లో భాగంగా ప్రభుత్వం మూడు మార్పులు చేసింది. ప్రాణహిత ప్రాజెక్టును ఆదిలాబాద్ జిల్లాకే పరిమితం చేయడం, మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించి, నీటిని ఎల్లంపల్లికి తరలించడంతో పాటు రంగారెడ్డి జిల్లా ఆయకట్టును పూర్తిగా తొలగిస్తూ మూడు ప్రధాన మార్పులు చేశారు. తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో నీటిని తీసుకునేలా డిజైన్లు చేయగా, మహారాష్ట్ర భూభాగంలో చాలా ముంపు ఉంటుందన్న కారణంతో ఆ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీనికితోడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా బిజెపి నేతృత్వంలో మహారాష్ట్రలో పెద్ద ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమానికి ఇప్పటి ముఖ్యమంత్రి దేవేంద్ర పడ్నవీస్ సోదరి నాయకత్వం వహించారు.

152 మీటర్ల ఎత్తుకు తమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు తొలుత అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్‌రావు చర్చలు జరిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం స్థానికుల వ్యతిరేకతను చూపుతూ, ఒప్పుకోలేదు. అనంతరం బిజెపి ప్రభుత్వంలో సైతం హరీష్‌రావు చర్చలకు యత్నించారు. కానీ కుదరలేదు. నేరుగా ముఖ్యమంత్రి కెసిఆర్ రంగంలోకి దిగి, ముంబై వెళ్లి పడ్నవీస్‌తో చర్చించారు. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యతిరేకించి, అధికారంలోకి వచ్చాక ఒప్పుకోవాలా, రాజకీయంగా మా పరిస్థితి ఒప్పుకుంటే ఎలా ఉంటుందన్న పడ్నవీస్ ప్రశ్నలతో ముఖ్యమంత్రి కెసిఆర్ వాస్తవం గ్రహించారు.

2008లో ప్రాజెక్టు పనులు ప్రారంభమైనా, 2016 వరకు ఎత్తుపై ఏకాభిప్రాయం కుదరలేదు. అప్పటికే ఎనిమిదేళ్లు గడిచిపోవడంతో ఇక లాభం లేదని, వాళ్లు చెప్పినట్లే ప్రాజెక్టు నిర్మాణానికి ఒప్పుకున్నారు. నీళ్లు ఎన్నైనా తీసుకోండి కానీ, మా ప్రాంతంలో భూమి ముంపుకు ఒప్పుకోమని పడ్నవీస్ స్పష్టంగా తేల్చి చెప్పడంతో, 152 మీటర్ల నుంచి నాలుగు మీటర్ల ఎత్తు తగ్గించి, 148 మీటర్ల ఎత్తులో నిర్మాణానికి కెసిఆర్ ఒప్పుకున్నారు. తమ్మిడిహట్టి వద్ద 148 మీటర్లకు ఒప్పుకోవడంతో, మేడిగడ్డ నుంచి నీటి వినియోగానికి సైతం మహారాష్ట్ర ఒప్పుకుంది. ఇక్కడ కూడా మహారాష్ట్ర భూభాగంలో కొంత భూమి బ్యారేజీ నిర్మాణంలో మునుగుతుంది.

ఈ మధ్యలో కేంద్ర జలసంఘం కూడా తమ్మిడిహట్టి వద్ద ఆశించిన నీటి లభ్యత లేదని తెలపడంతో ముఖ్యమంత్రి నిర్ణయానికి సాధికారిక ముద్ర పడ్డట్లయింది. దీంతో అక్కడ లభించే నీటిని ఆదిలాబాద్‌కే పరిమితం చేశారు. బ్యారేజీల నిర్మాణంతో మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర సమస్యలు కొని తెచ్చుకోవద్దన్న ఉద్దేశంతో ఎక్కువ భాగం నీరు నదీ అంతర్భాగంలోనే నిల్వ ఉండేలా ప్రభుత్వం రీడిజైన్ చేసింది. కాళేశ్వర కల సాకారం వెనుక మహారాష్ట్ర సిఎం సహకారం, కెసిఆర్ దూరదృష్టి ఉన్నాయి. శంకుస్థాపన సమయంలో కూడా పడ్నవీస్‌ను ప్రభుత్వం ఆహ్వానించగా, స్థానిక పరిస్థితుల నేపధ్యంలో రావడానికి వీలుపడదన్న సమాచారం వచ్చింది. ప్రారంభోత్సవానికి వచ్చే అవకాశం ఉంది.

Invitations for Kaleshwaram project opening ceremony