Home అంతర్జాతీయ వార్తలు యాపిల్ సాయం లేకుండానే ఐఫోన్ అన్‌లాక్

యాపిల్ సాయం లేకుండానే ఐఫోన్ అన్‌లాక్

se-apple-i-phone-done-imageలాస్‌ఏంజిల్స్: అమెరికాలో కాల్పులు జరిపిన ఉగ్రవాది ఐఫోన్‌ను అన్‌లాక్ చేయాలని దర్యాప్తు సంస్థ ఎఫ్‌బిఐకు, యాపిల్ కంపెనీకి మధ్య కొద్ది రోజులుగా నడుస్తున్న వివాదానికి తెరపడింది. యాపిల్ సహాయం లేకుండానే ఉగ్ర వాది ఐఫోన్‌ను తాము అన్‌లాక్ చేశామని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకటించింది. అమెరికాలోని శాన్‌బె ర్నార్డినోలో విచక్షణారహితంగా కాల్పులు జరిపి 14 మంది ప్రాణాలు తీసిన ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూర్ ఐ ఫోన్ విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. ఐఫోన్ అన్‌లాక్ చేయాలని ఎఫ్‌బిఐ యాపిల్ సంస్థను కోరి నప్పటికీ తాము వినియోగదారుల భద్రతకు ప్రాధాన్యమిస్తామని, అన్‌లాక్ చేయడం సాధ్యంకాదని తెలిపింది. దీనిపై ఎఫ్‌బిఐ కోర్టును ఆశ్రయించింది. ఫోన్ అన్‌లాక్ చేయాలని కోర్టు యాపిల్‌ను ఆదేశించింది. అయినప్పటికీ యాపిల్ వెనక్కి తగ్గలేదు. ఈ విషయంలో యాపిల్‌కు ప్రఖ్యాత గూగుల్, ఫేస్‌బుక్ తదితర కంపెనీలు కూడా అండగా నిలిచాయి. అయితే ఇప్పుడు యాపిల్ సహాయం లేకుండా ఐఫోన్ అన్‌లాక్ చేసుకునే సౌలభ్యం లభించిందని, యాపిల్‌పై పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటున్నామని ఎఫ్‌బీఐ వెల్లడించింది. ఐఫోన్ అన్‌లాక్ విషయంలో ఎఫ్‌బీఐకి ఎవరు సహకరించారనే విషయంలో స్పష్టత లేదు. అయితే ఎఫ్‌బీఐ ఐఫోన్ అన్‌లాక్ కోసం ఇజ్రాయెల్‌కు చెందిన ఓ ఫోరెన్సిక్ కంపెనీ సహాయం తీసుకుంటున్నట్లు అక్కడి మీడియా సమాచారం.