Home IPL 2019 ప్రతీకారం కోసం హైదరాబాద్

ప్రతీకారం కోసం హైదరాబాద్

SRH vs KKRహైదరాబాద్: కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. సీజన్‌లో భాగంగా కోల్‌కతాతో ఆడిన ఆరంభ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు అనూహ్య ఓటమి ఎదురైన విషయం తెలిసిందే. అయితే ఆదివారం సొంతగడ్డపై జరిగే మ్యాచ్‌లో కోల్‌కతాను ఓడించడం ద్వారా ఓటమికి బదులు తీర్చుకోవాలని సన్‌రైజర్స్ తహతహలాడుతోంది. కిందటి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్‌కింగ్స్ అద్భుత విజయం సాధించిన హైదరాబాద్ ఈ మ్యాచ్‌కు ఆత్మవిశ్వాసంతో సిద్ధమైంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, బైర్‌స్టోలు అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ఈసారి కూడా జట్టు వీరి నుంచి ఇటువంటి ప్రదర్శనే ఆశిస్తోంది. ఈ సీజన్‌లో వార్నర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఇప్పటికే అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

ఈ మ్యాచ్‌లో కూడా వార్నర్‌పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే సత్తా కలిగిన వార్నర్ విజృంభిస్తే మ్యాచ్‌ను సొంతం చేసుకోవడం హైదరాబాద్‌కు కష్టమేమి కాదు. ఇక, బైర్‌స్టో కూడా దూకుడు మీదున్నాడు. అయితే కెప్టెన్ విలియమ్సన్ పేలవమైన ఫామ్‌తో సతమతమవుతుండడం జట్టుకు కలవరానికి గురి చేస్తోంది. విజయ్ శంకర్ కూడా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దీపక్ హుడా విఫలమవుతున్నాడు. బౌలింగ్‌లో చాలా బలంగా ఉన్న హైదరాబాద్‌కు బ్యాటింగ్ వైఫల్యం వెంటాడుతోంది. చాలా మ్యాచుల్లో బ్యాటింగ్ వైఫల్యం వల్లే హైదరాబాద్‌కు ఓటములు ఎదురయ్యాయి. ఈ మ్యాచ్‌లో గెలవాలంటే బ్యాట్స్‌మెన్ మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. కెప్టెన్ విలియమ్సన్ కూడా తన బ్యాట్‌కు పని చెప్పాలి. బైర్‌స్టో, వార్నర్‌ల జోరుకు విలియమ్సన్ బ్యాట్ తోడైతే హైదరాబాద్‌కు ఎదురే ఉండదు.

రసెల్‌తోనే ప్రమాదం
ఇక, ఈ సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి పోతున్న ఆండ్రి రసెల్‌తో హైదరాబాద్‌కు పెను ప్రమాదం పొంచి ఉంది. ఇంతకుముందు హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రసెల్ మెరుపు ఇన్నింగ్స్‌తో కోల్‌కతాకు సంచలన విజయం అందించిన విషయం తెలిసిందే. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తున్నాడు. క్రిస్‌లీన్, నరైన్, నితీష్ రాణా, దినేశ్ కార్తీక్, శుభ్‌మన్‌గిల్ తదితరులతో కోల్‌కతా బ్యాటింగ్ చాలా బలంగా ఉంది. బెంగళూరుతో జరిగిన కిందటి మ్యాచ్‌లో కూడా కోల్‌కతా దాదాపు 214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించినంత పని చేసింది.

IPL 38th Match Hyderabad vs Kolkata at Hyderabad