Home నిర్మల్ అక్రమ దందా

అక్రమ దందా

kalyana-lakshmi-schemeకల్యాణ లక్ష్మికి తిరుకల్యాణం
భైంసాలో అవినీతి రిజిస్ట్రేషన్
మధ్యవర్తుల ద్వారా అక్రమ దందా

భైంసా: పెళిళ్లు సైతం సరిగ్గా జరుపుకోలేని పేదల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మికి అవినీతి ఛీడ దాపురించింది. కల్యాణలక్ష్మి పథకం కింద డబ్బు పొందాలంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంది. దీనికి గాను కేవలం రూ.220 మాత్రమే ఫీజు రూపంలో చెల్లించవలసి ఉండగా కక్కుర్తి పడుతున్న రిజిస్ట్రార్ పేదల నుంచి రూ.700 వరకు వసూలు చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే మొదటికే మోసం వస్తుందని వెరుస్తున్న ప్రజానికం నోరు విప్పలేకపోతున్నారు. సబ్ రిజిస్ట్రార్ మధ్యవర్తులతో అక్రమ వసూళ్లు చేయిస్తుందన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఇలా ప్రతీ రోజు వేలాది రూపా యల మామూళ్ళ దందా కొనసాగుతుంది. రిజిస్ట్రేషన్‌లు, మార్టిగేజిలకు ఎవరైనా డబ్బులు ఇవ్వమని అంటే నిబం ధనల సాకుతో సబ్ రిజిస్ట్రార్ వారి పనులను చేయదన్న విమర్శలున్నాయి. దళారుల ద్వారా వెళితే అప్పటికప్పుడే పని పూర్తవుతుందంటున్నారు.

మూడేళ్ల క్రితం భైంసా సబ్ రిజిస్ట్రార్‌గా జ్యోతి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుండి మామూళ్ళ జాతరకు తెరలేపారన్న విమర్శలున్నాయి. తాజాగా నిర్మల్ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని లోకేశ్వరం, కుంటాల మండలాలకు సైతం భైంసా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలోకి వచ్చాయి. దీంతో ఆడిందే ఆట, పాడిందే పాటగా మామూళ్ళ దందా కొనసాగుతుందని చెపుతున్నాయి. తెలిసిన వారు రిజిస్ట్రేషన్ కోసం వెళ్తే నిబంధనల సాకు చూపుతుండగా మళ్లీ వారే దళారులతో వెళితే పని పూర్తవుతుంది. దీంతో నాయకులు పనికోసం వెళ్లగా పని కాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. బైంసా పట్టణం ప్రముఖ వాణిజ్య కేంద్రం. ఇక్కడ రియలెఎస్టేట్ వ్యాపారం 3 పూలు 6 కాయలుగా వర్దిల్లుతుంది. దీంతో ప్రతీరోజు రిజిస్ట్రేషన్ కార్యాలయంంలో పండగ వాతావరణమే కనిపిస్తుంటుంది.

దీంతో పాటే ముడుపులు సైతం భారీగానే అందుతున్నా యన్న విషయం బహిరంగ రహస్యమేనంటున్నారు. వసూళ్ళ యిన పైసలను భైంసాలో సబ్ రిజిస్ట్రార్ అసలే తీసుకోరని నిర్మల్‌లో దళారులు ఇంటికెళ్లి ముట్టజెప్పడం ప్రతీ రోజు అనావాయితేనంటున్నారు. డాక్యుమెంట్ రైటర్ ఒకరు తనకు వేయి రూపాయలు, సబ్‌రిజిస్ట్రార్ అసలు చేయి తడపందే ఫైలు కదలదని దీంతో తాము మరీ ముడుపులు ఇచ్చి పనులు చేసుకోవాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. ఈ విషయమై ఎవరికైనా చెబితే సవాలక్ష కొర్రీలు వేస్తూ తమ పని చేయరని వాపోయారు. గత్యంతరం లేక డబ్బులు ముట్టచెపుతున్నట్లు పలువురు చెప్పారు. ఇది ఒకరోజుది కాదని ఇక్కడ ప్రతీ రోజు ఇదే తంతు జరగడం మామూలేనని చెప్పారు. ప్రతీ నెల లక్షల్లో అక్రమ వసూళ్లు జరుగుతాయన్నారు. పరిస్థితిలో మార్పు తేవాలంటున్నారు.

ఫిర్యాదుకు సన్నాహాలు: భైంసా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమ దందాపై రాష్ట్ర స్థాయి అధికారులకు ఫిర్యాదు చేసేందుకు పలువురు సన్నద్ధమవుతున్నారు. ముడుపులు ఇస్తేనే పనులు చేస్తున్న విషయం తెలుపగా ఇది మంచి పద్ధతి కాదని స్వయాన చెప్పినట్లు తెలిసింది. అయినా సబ్ రిజిస్ట్రార్ తన తీరు మార్చుకోకపోవడంతో ఫిర్యాదు చేసేం దుకు సన్నద్ధమవుతున్నారు.

నాకేమీ సంబంధం లేదు:- సబ్ రిజిస్ట్రర్ జ్యోతి: కార్యాలయానికి పనుల నిమిత్తం వచ్చే వారి వద్ద ఇతరులు, దళారులు డబ్బులు వసూలు చేయడంతో తన కు ఎలాంటి సంబంధం లేదని సబ్‌రిజిస్ట్రార్ జ్యోతి తెలిపారు. అక్రమ వసూళ్ల దందాపై మన తెలంగాణ ఆమె ను నేరుగా సంప్రదించింది. అయితే ఎవరు కూడా డబ్బులు ఇవ్వవద్దని ఆమె తెలిపారు. ముడుపులు ఇవ్వక పోతే ఫైలు ముందుకు కదలదని కొర్రీలు వేస్తూ సతాయి స్తున్న విషయాన్ని సబ్ రిజిస్ట్రార్ వద్ద ప్రస్తావించగా ఆమె సమాదానం దాటవేశారు.