Home మంచిర్యాల అక్రమాల ‘రియల్ ’ వంతెనలు

అక్రమాల ‘రియల్ ’ వంతెనలు

cons* ప్రభుత్వ అనుమతి లేకుండానే నిర్మాణాలు
* భూముల ధరలు పెంచుకునేందుకు యత్నాలు
* మితిమీరుతున్న రియల్ వ్యాపారుల ఆగడాలు
* మామూళ్ల మత్తులో తూలుతున్న అధికారులు

జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండానే వాగులు, పిల్ల కాలువలపై వంతెనలు నిర్మిస్తున్నారు. భూముల ధరలు పెంచుకునేందుకు ఏకంగా కోట్లాది రూపాయలు వెచ్చించి వంతెనలను నిర్మిస్తున్నా అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు ఎగనామం పెడుతూ ఇష్టారాజ్యంగా వంతెనలు నిర్మిస్తున్నప్పటికీ అధికారులు ప ట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని రంగంపేట, ఆండాలమ్మ కాలనీ మధ్యలో కార్మెల్ పాఠశాల రోడ్డులో రాళ్లవాగుపై వంతెనను నిర్మిస్తున్నారు. దాదాపు 38 ఎకరాల భూముల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లను ఏర్పాటు చేశారు. లేఅవుట్ కోసం దరఖాస్తులు చేసుకొని అనుమతి రాకముందే ప్లాట్లను ఏర్పాటు చేశారు. ఈ వెంచర్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన వ్యక్తులు మంచిర్యాల పట్టణంలోకి రావాలంటే రాళ్లవాగు వంతెనను దాటాల్సి ఉంటుంది. అయితే రియల్ వ్యాపారులు కొత్తగా రాళ్లవాగు వంతెనపై ప్లాట్లలోకి నేరుగా వెళ్లేందుకు వంతెనను నిర్మిస్తున్నారు. దాదాపు రూ. 3.30 కోట్ల సొంత నిధులతో వంతెన నిర్మాణాన్ని చేపట్టారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ వంతెన వలన కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్లాట్లు కొనుగోలు చేసే వారికి లాభం ఉంటుండగా రంగపేట, ఆండాలమ్మ కాలనీ వాసులు పాత వంతెన పై నుంచి తిరిగి రావాల్సి ఉంటుంది. అదే విధంగా 324 సర్వే నెంబర్‌లో రియల్ వెంచర్లు ఏర్పాటు చేసిన వ్యాపారులు శ్రీనివాస్ గార్డెన్ సమీపంలో వంతెనను ఏర్పాటు చేశారు. ఏసిసి మీదుగా ప్రవహించే పిల్ల కాలువలపై నిబంధనలకు విరుద్దంగా వంతెనను సొంత నిధులతో నిర్మించారు. మున్సిపాలిటీ, నీటి పారుదల శాఖ అనుమతి లేకుండానే వంతెన పనులను చేపట్టారు. ఈ వంతెన నిర్మించిన తరువాత ఆప్రాంతంలో భూముల రేట్లు పెరుగగా ప్రభుత్వ, పట్టా భూముల తేడా లేకుండా అధిక ధరలకు ప్లాట్లను విక్రయించినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే విధంగా సున్నంబట్టి వాడలోని రైల్వే ఎత్తు వంతెన పక్కన ప్రధాన మురికి కాలువపై సిమెంట్ బిల్లలతో వంతెన నిర్మించగా రోడ్డు సౌకర్యం ఏర్పడడంతో భూముల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ విధంగా రియల్ వ్యాపారులు వారి వెంచర్లలో భూముల ధరలను పెంచుకునేందుకు గాను ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వంతెనలు నిర్మిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌ను వివరణ కోరగా నిబంధనలకు విరుద్దంగా వాగు లు, చెరువులపై వంతెనలు నిర్మించిన వారిపై విచారణ జరిపించి చర్య లు తీసుకుంటామన్నారు. అంతే కాకుండా హమాలివాడలోని పోచమ్మ చెరువు మత్తడి ముందు కాలువ, కొత్త చెరువు మత్తడి ముందు మరో కాలువపై గతంలో రియల్ వ్యాపారులు అక్రమంగా వంతెనలు నిర్మించుకొని ప్లాట్లను అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.