Home ఎడిటోరియల్ ఇస్లామిక్ బ్యాంక్ పై విముఖత!

ఇస్లామిక్ బ్యాంక్ పై విముఖత!

Islamic-Bank

దేశంలో ‘ఇస్లామిక్ బ్యాంకింగ్’ను ప్రవేశపెట్టే ప్రసక్తి లేదని ఇటీవల రిజర్వు బ్యాంక్ (ఆర్‌బిఐ) తప్పనిసరి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకొంది. ‘ఇస్లామిక్’ అనే పదం మోడీ కి, ఆయన సైద్ధాంతిక మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌కి పడకపోవడమే ఆ నిర్ణయం వెనుక కారణమని చెప్పకతప్పదు. వడ్డీలు లేని బ్యాంకింగ్ వ్యవస్థను ఇస్లామ్ షరియత్ సూచిస్తున్నది. దానికి ప్రాముఖ్యం ఇవ్వడం మోడీ స్వభావానికి సరిపడని అంశం. భారతీయ బ్యాంకింగ్ వినియోగదారులకు అటువంటి సౌకర్యాన్ని పరిచయం చేస్తే పార్టీకి, తమ భావజాలానికి అసౌకర్యం కలుగుతుందని ఆయన ఖచ్చితంగా అంచనా వేశారు. కాని ఆ నిర్ణయంవల్ల లక్షలాదిమంది భారతీయ వినియోగదారులు విలువైన సౌకర్యాన్ని పొందలేకపోతున్నారు. ఆర్‌బిఐ స్వయం ప్రతిపత్తిగల రాజ్యాంగ సంస్థ అయినప్పటికీ దాని నిర్ణయం వెనుక స్వేచ్ఛ లేదని అర్థమవుతోంది.

ఇస్లామిక్ బ్యాంకింగ్ అన్నది రశీదులు, రుసుములు, వడ్డీలు లేని ఆర్థిక సహాయ పద్ధతి. ధనాన్ని రుణంగా ఇవ్వడం ద్వారా లాభాలు గడించడాన్ని ఇస్లామిక్ బ్యాంకింగ్ నిబంధనలు అంగీకరించవు. ఉదాహరణకు ఆ వ్యవస్థలో క్లయింట్ల కోసం ఇస్లామిక్ బ్యాంకులు ఆస్తులను కొంటాయి. వాటిని కొద్ది లాభానికి అమ్ముతాయి. క్లయింట్లు వాయిదా పద్ధతిలో ధరను తిరిగి చెల్లించవచ్చు. మరో పద్ధతిలో బ్యాంకుకు, రుణ గ్రహీతకు మధ్య లాభాల పంపిణీ ప్రాతిపదిక వ్యవస్థను ఇస్లామిక్ బ్యాంకింగ్ అనుమతిస్తుంది. ధనాన్ని మదుపు పెట్టడాన్ని, అనుత్పాదక స్పెక్యులేషన్లకు పెట్టుబడి పెట్టడాన్ని ఖురాన్ అనుమతించదు. అంటే జూదం, మద్యం, పొగాకు ఉత్పత్తులు, ఆయుధాలు వంటి రంగాల్లో పెట్టుబడులను అనుమతించదు. మన దేశంలో నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు అయిన కో ఆపరేటివ్ సొసైటీలు, చిట్‌ఫండ్‌లు ఇస్లామ్ అనుమతించే ఆర్థిక సాధనాలే.

ఇవి ఆర్‌బిఐ నియంత్రణలో ఉండవు. ఇటీవల కేరళలో ఇస్లామిక్ బ్యాంకింగ్ పద్ధతిలో సహకార (కో ఆపరేటివ్) బ్యాంకులను నెలకొల్పారు. చెర్మన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ద్వారా అవి అస్తిత్వంలోకి వచ్చాయి. అలాగే మహారాష్ట్రలో కూడా లోక్ మంగళ్ కో ఆపరేటివ్ బ్యాంక్ నెలకొంది. ఈ రంగంలో నైతికంగా చెల్లుబాటయ్యే మ్యూచువల్ ఫండ్స్ కొన్ని ఉన్నాయి. షరియాను పాటించే స్టాక్ ఇండెక్స్, తాసిస్ షరియా 50 సాధనాలు కూడా ఉన్నాయి. సంఖ్యలో ఇవి తక్కువే అయినా దేశంలో మార్కెట్ అవసరాలను తీర్చడానికి సరిపోతాయి. ఈ నేపథ్యంలో ఇస్లామిక్ బ్యాంకింగ్‌ను అనుమతించకపోవడానికి రెండు కారణాలను ప్రభుత్వం పేర్కొంది. ఆర్థికంగా జనాభాను కలుపుకుపోయే ‘జన్‌ధన్’ అకౌంట్లవంటి ఇతరత్రా సాధనాలు అందుబాటులో ఉన్నాయన్నది మొదటి కారణం.

ఇస్లామిక్ బ్యాంకింగ్‌లో వడ్డీ ఉండదన్నది ప్రభుత్వం చెబుతున్న కారణం. ఆ మార్పులకు చట్ట సభల మద్దతు అవసరం. ఇక్కడ మళ్లీ బిజెపి సంఖ్యాబలం ప్రస్తావనకు వస్తోంది. పైకి చెప్పని మరో కారణం ఏమిటంటే ఇస్లామిక్ బ్యాంకింగ్ టెర్రరిజానికి ఊతం ఇస్తుంది అన్న భయం. ఉగ్రవాదులకు అందే డబ్బుకు ఆ బ్యాంకులు ఒక మార్గంగా మారవచ్చన్న భయం కూడా ఉంది. కానీ ఇదంతా ఇస్లామిక్ బ్యాంకింగ్‌పై అపోహలు పెంచుకోవడంగా భావించాలి.

ఇస్లామిక్ బ్యాంకింగ్ మతపరంగా షరియా బోర్డులు, కమిటీల పర్యవేక్షణలోకి వెడుతుందన్న భయం ఆలోచించదగ్గదే. అయితే భారతీయ ముస్లిం జనాభా దాదాపు 18కోట్లు దాకా ఉందన్నది వాస్తవం. వారంతా అటువంటి బ్యాంకింగ్ కావాలని కోరుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ బ్యాంకింగ్ అన్నది రెండు ట్రిలియన్ డాలర్ల లావాదేవీలుగల వ్యవస్థ. దాని వృద్ధి వేగంగా రెండంకెల రేటుతో ముందుకు సాగుతోంది. మధ్యప్రాచ్యం, ముస్లిం దేశాలు ఈ వ్యవస్థలో అధిక భాగాన్ని కలిగి ఉండగా, అభివృద్ధి చెందని బ్యాంకింగ్ వ్యవస్థలు గల దేశాలు కూడా ఇస్లామిక్ బ్యాంకింగ్‌కు తలుపులు తెరచి ఉంచాయి. పశ్చిమదేశా ల్లో ఇస్లామిక్ బ్యాంకింగ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక విశేషం. షరియా అనుకూల సేవల ప్రాముఖ్యత ఆయా దేశాల్లో పెరుగుతోంది. ఇటీవల కాలంలో హాంకాంగ్, లక్సెంబర్గ్, దక్షిణాఫ్రికా, బ్రిటన్‌లలో ఇస్లామిక్ బాండ్లు పెరిగినట్లు బిబిసి ప్రకటించింది.

మన దేశంలో ఆర్థికవ్యవస్థ సెక్యులర్ నైజానికి చాలా దూరంగా ఉండిపోయింది. అవిభక్త హిందూ కుటుంబం(హెచ్‌యుఎఫ్)అధికం గా వాడుకలో ఉండడం ఒక ఉదాహరణ. వర్గాల అవసరాలను బట్టి ఆర్థిక నియమాలను రూపొందించడం దేశంలో ఆనవాయితీగా ఉంది. వడ్డీలేని ఆర్థిక వ్యవస్థలు మరో రూపంలో దానిని వసూలు చేస్తాయని కొంతమంది వాదిస్తున్నారు. ఉదాహరణకు ‘కరంట్ అకౌంట్’ లో వడ్డీ ఉండదు. అందుచేత ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా కొత్త ఆర్థిక సాధనాలను ఆలోచించవచ్చునన్న సూచన వినబడుతోంది. చాలా పశ్చిమదేశాల్లో అదే జరిగింది. అయితే ఇక్కడ రాజకీయ సంకల్పం కొరవడడం స్పష్టంగా కనపడుతోంది. ఏది ఏమైనా డబ్బు, బ్యాంకింగ్ నిర్వచనాలు చాలా వేగంగా మార్పు చెందుతున్నాయి. ముఖ్యంగా మొబైల్ వ్యాలెట్లు అందుబాటులోకి రావడం, బిట్ కాయిన్ వంటి క్రిస్టో కరెన్సీ అవతరించడం వంటి పరిణామాలు అస్తిత్వంలోకి రాగలిగినప్పుడు ఇస్లామిక్ బ్యాంకింగ్ వంటి మరో ఆర్థిక సౌకర్యాన్ని అడ్డుకోవడానికి సమర్థన అంతగా లేదు.

అది తిరోగమన ఆర్థికవ్యవస్థ ఎంతమాత్రం కాదు. డెవిడ్ గ్రేబర్ వ్యాఖ్యానించినట్లుగా వాణిజ్యం రంగంపట్ల ఇస్లామ్ వినూత్న దృక్ఫథాన్ని కలిగి ఉండడం ఆ బ్యాంకింగ్ వ్యవస్థలో కనపడుతోంది. ఆయన ఈ మాటను తన ‘రుణం: తొలి 5000 సంవత్సరాలు’ అనే అద్భుతమైన పుస్తకంలో రాశారు. లాభాల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించడాన్ని ఇస్లామిక్ మేధావులు ఎన్నడూ తెగడలేదు. ఆ ధోరణితోనే వారు ‘వడ్డీ వ్యాపారం’ ను నిషేధించారు. ఆర్థిక వేదాంతంలో ధరల స్థ్థిరీకరణ పట్ల వ్యతిరేకత మూలసూత్రంగా కనిపిస్తుంది.  మార్కెట్‌లను భగవంతుడు తమంత తామే నియంత్రించుకునే పద్ధతిలో రూపొందించాడని ఆ వేదాంతం చెబుతుంది. ఆడం స్మిత్ ప్రతిపాదించిన ‘కనపడని హస్తం’ ఇందులో ఉంది. స్మిత్ తన రచనల్లో మధ్య యుగాల నాటి పద్ధతుల నుంచి స్ఫూర్తి పొందారని డేవిడ్ గ్రేబర్ వివరించారు. మొత్తానికి ‘ఇస్లామ్’ అన్న మాట నే అసహ్యించుకునే స్థితిలో ఉన్న మోడీ, ఆర్‌ఎస్‌ఎస్ ఇస్లామిక్ బ్యాంకింగ్‌లోని మంచిని ఒప్పుకోరని ఆర్‌బిఐ ఇటీవలి నిర్ణయం తో స్పష్టమైంది.

* సునీతా అరోరా