Home ఎడిటోరియల్ నల్లధనంపై తెల్లమొహం

నల్లధనంపై తెల్లమొహం

modi143అధికారం చేపట్టక ముందు ఒక మాట ఆ తర్వాత మరో మాటతో ఎన్డీఏ సర్కారు పొద్దుపుచ్చుతోందే తప్ప, స్విట్జర్లాండ్ తదితర ‘పన్నురహిత’ స్వర్గాలుగా పిలవబడుతున్న దేశాల ప్రభుత్వాలతో నిక్కచ్చిగా సంప్రదింపులు జరిపిందీ లేదు, నల్లధనం వెనక్కి రప్పించే చర్యలు చేపట్టందీ లేదు. అధికారం చేపట్టిన వెంటనే ప్రథమ ప్రాధాన్య చర్యగా విదేశీ బ్యాంకుల్లో మగ్గుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పిస్తామని ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తామని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచార సభల్లో ఢంకా బజాయించారు. అధికారం దక్కాక సారథ్యంలోని ఎన్డీఏ వాగ్దానం చేసింది. ఈ ఘనతర హామీని నిలబెట్టుకొనే పటిష్ఠ కార్యాచరణకు మాత్రం పూనుకోలేదు. సుప్రీంకోర్టు మొట్టికాయవేశాకగాని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించలేదు. నల్లకుబేరుల పేర్లు వెల్లడించటం ద్వైపాక్షిక ఒప్పందాల ఉల్లంఘన అవుతుదని వాదించింది. చివరకు, సీల్డ్ కవర్‌లో తమ వద్దనున్న పేర్లను సుప్రీంకోర్టుకు సమర్పించింది. మన్మోహన్ సర్కారు నిష్క్రియాపరత్వాన్ని అదే వాదనలతో మోడీ ప్రభుత్వం మరపిస్తోంది.

దర్యాప్తును ముందుకు తీసుకెళ్లి పూర్తి సమా చారం రాబట్టే ప్రయత్నం చేయలేదు. తాజాగా స్విట్జర్లాండ్‌లోని హెచ్‌ఎస్‌బీసీ బ్యాంకులో భారతీయుల మరిన్ని నల్లఖాతాలు ఉన్నట్లు వెల్లడైంది. ఇన్‌వెస్టిగేటివ్ జర్నలిస్టుల అంతర్జాతీయ బృందం శోధనలో పలుదేశాలతో పాటు భారతీయుల ఖాతాలు వెలుగులోకి వచ్చాయి. ఆ బ్యాంకు మాజీ ఉద్యోగి హెర్వె ఫాల్కియానుంచి ఈ జాబితాను రాబట్టలేదు. మొత్తం 1,195 ఖాతాల్లో రూ.25,420కోట్లు ఉన్నట్లు సమాచారం. ఈ జాబితాలో అంబానీ తదితర వ్యాపార దిగ్గజాలతోపాటు నారాయణరాణే, స్మితాఠాక్రే వంటి రాజకీయవేత్తల కుటుంబసభ్యుల పేర్లు ఉన్నాయి. గతంలో ఫ్రాన్స్ 628మంది ఖాతాదారుల జాబితాను భారత్‌కు అందించిన విషయం తెలిసిందే. వీరిలో 200మంది అడ్రసు దొరకలేదని, మిగిలిన 428మంది ఖాతాల్లో రూ.4,500కోట్లు ఉన్నట్లు మోడీ సర్కారు తీరిగ్గా వెల్లడించింది. ఈ జాబితాలోని 128కేసుల్లో పన్ను మదింపు పూర్తిచేసి జరిమానా చర్యలు ప్రారంభించినట్లు పేర్కొంది.

మన్మోహన్ సర్కారు తీరులోనే ఇదంతా పన్ను ఎగవేత వ్యవహారమని సమస్య తీవ్రతను తక్కువ చేసిచూపడంలోనే మోడీ ప్రభుత్వం తలమునకలైందనే వాస్తవాన్ని బట్టబయలు చేస్తోంది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం మేరకు నల్లధనంపై సమగ్ర దర్యాప్తునకు ప్రత్యేక బృందం(సిట్) ఏర్పాటు చేయడం మినహా మోడీ సర్కారు తీసుకొన్న చర్యలు శూన్యమే. నల్లధనాన్ని వెనక్కి తీసుకురాగలిగితే.. దేశంలోని సగటు పౌరుల తలసరి ఆదాయం పెరుగుతుందని, ప్రజలపై పన్నుభారం 30శాతం దాకా తగ్గుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది. అధికారం చేపట్టక ముందు ఒక మాట ఆ తర్వాత మరో మాటతో ఎన్డీఏ సర్కారు పొద్దుపుచ్చుతోందే తప్ప, స్విట్జర్లాండ్ తదితర ‘పన్నురహిత’ స్వర్గాలుగా పిలవబడుతున్న దేశాల ప్రభుత్వాలతో నిక్కచ్చిగా సంప్రదింపులు జరిపిందీ లేదు, నల్లధనం వెనక్కి రప్పించే చర్యలు చేపట్టందీ లేదు.

తాజా జాబితాపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ చేసిన వ్యాఖ్యలే వారి చిత్తశుద్ధి ఏమిటో స్పష్టం చేస్తున్నాయి. ‘ఆ ఖాతాదారుల్లో అందరూ అక్రమం కాకపోవచ్చు… విచారణ ప్రారంభించడానికి కేవలం పేర్లు మాత్రమే సరిపోవు.’ అంటూ విత్తమంత్రి సెలవిచ్చారు. మోడీ, ఆయన మంత్రులు అప్పుడప్పుడు చెబుతున్నదంతా ఉత్త ఊకదంపుడు, జాతి కళ్లు కప్పే ప్రయత్నమేనని తేలిపోతోంది. రహస్య ఖాతాలకు కంచుకోటలాంటి స్విస్ బ్యాంకుల మెడలు వంచి అమెరికా, జర్మనీ ప్రభుత్వాలు తమకు కావాల్సిన వివరాల్ని రాబట్టుకొంటే, మోడీ సర్కారు నిరర్థక హామీలతో పొద్దుపుచ్చుతోంది. దేశంలో పన్నుల ఎగనామం పెట్టి, అక్రమార్జనను సముద్రాల ఆవల దాచిపెడుతున్న ఘరానా పెద్దలపై చట్టబద్ధమైన చర్యలు తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తోంది.

గ్లోబల్ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ అధ్యయనం ప్రకారం సరిహద్దులు దాటుతున్న భారతీయుల డబ్బులో మూడొంతులకు పైగా ఎగుమతి-దిగుమతి వ్యాపారములో సరకుల తప్పుడు మార్కెట్ ధరల ద్వారానే జరుగుతోంది. వ్యాపారలో దొంగలెక్కలు అరికట్టాలి. దేశీయంగా నల్లధనం ఉత్పత్తి మార్గాల్ని మూసేయాలి. విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి రప్పించేందుకు అంతర్జాతీ యంగా తగిన సంప్రదింపులు, కఠినవైఖరులు చేపట్టాలి. అందుకు మోడీ సర్కారు సిద్ధంగా ఉందా అన్నదే ప్రశ్న.