Home జాతీయ వార్తలు రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన విమానాశ్రయం

రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టిన విమానాశ్రయం

Airportచండీగఢ్: పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధాని చండీగఢ్‌లోని విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సేవలు కాస్తా ఇప్పుడు ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలకు దారితీశాయి. దీనికి సంబంధించిన వివరాలను పరిశీలిస్తే… చండీగఢ్ నుంచి అంతర్జాతీయ విమాన సేవలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలి విమానంలో పంజాబ్ ఉప ముఖ్యమంత్రి సుఖ్‌బీర్ బాదల్ షార్జా వెళ్లారు. మరోవైపు సేవల ప్రారంభోత్సవానికి ఏర్పాటుచేసిన బ్యానర్లలో చండీగఢ్ విమానాశ్రయాన్ని మొహాలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా పేర్కొన్నారు. దీంతో పంజాబ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్‌కు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ లేఖ రాశారు. చండీగఢ్ విమానాశ్రయాన్ని అంతర్జాతీయ స్థాయికి మార్చేందుకు పంజాబ్‌తో సమానంగా హర్యానా ప్రభుత్వం కూడా రూ. 200కోట్లు వెచ్చించిందని ఖట్టర్ లేఖలో పేర్కొన్నారు. అలాంటప్పుడు విమానాశ్రయం పేరును మొహాలీ అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించడం చాలా బాధాకరమన్నారు. విమానాశ్రయం పేరును కేంద్ర ప్రభుత్వం ఇంకా నిర్ణయించలేదని, పంజాబ్ అలా ప్రకటన చేసుకోవడం సరికాదని ఖట్టర్ అన్నారు. అంతర్జాతీయ స్థాయికి పునరుద్ధరించిన చండీగఢ్ ఎయిర్‌పోర్టుకు స్వాతంత్య్ర సమరయోధుడు షహీద్ భగత్‌సింగ్ పేరు పెట్టాలని పంజాబ్ కోరుకుంటోంది. అయితే హర్యానా మాత్రం రాష్ట్ర మాజీ మంత్రి మంగళ్ సేన్ పేరయితే బాగుంటుందని ప్రతిపాదించింది. దీంతో పేరు విషయమై ఇరు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇదిలాఉండగా ఎయిర్‌పోర్టుకు ఇంకా పేరును నిర్ణయించలేదని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడించారు.