Home హైదరాబాద్ తుపాకీ నీడలో ఐటి కారిడార్

తుపాకీ నీడలో ఐటి కారిడార్

24/7 ఆయుధ గస్తీ
హైటెక్ సిటీ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టం
నిఘా నీడలో ఐటీ
ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న సైబరాబాద్ పోలీసులు
రాత్రి వేళల్లో ప్రత్యేక చర్యలు

POLICE

మన తెలంగాణ/సిటీబ్యూరో : ఐటి కారిడార్‌ను శత్రుదుర్భేద్యంగా మార్చడానికి సైబరాబాద్ పోలీసులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని ఐటికి తలమాణికంగా నిలిచిన ఈ ప్రాంతంపై పోలీసులు మరింత దృష్టి సారించారు.వందలాది ఐటి కంపెనీలు, లక్షలాది మంది ఉద్యోగుల భద్రతకు 24 గంటల పాటు పోలీసులు ఆయుధ గస్తీ ఉండే విధంగా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.పెంచిన ఆయుధ గస్తీ వాహనాలు 24 గంటలు ఈ ప్రాంతంపై డేగ కన్నుతో కాపాలా కాస్తాయి. ముఖ్యంగా మహిళా ఉద్యోగులకు రాత్రి సమయంలో ఎలాంటి అవాంతరాలు రాకుండా ఈ గస్తీ వాహనాలు నిరంతరం తిరుగుతుంటాయి. ఐటి కారిడార్ పరిధిలోని రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ తదితర ప్రాంతాలలోని 21 కీలక ప్రాంతాలను భద్రతా అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాలను ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఆయుధ గస్తీ వాహనాలు తిరుగుతుంటాయి. పలు ఉగ్రవాద కార్యకలాపాలలో ఐటి ఉద్యోగులు అరెస్టు అయిన విషయం తెలిసిందే.

అలాగే ఐటి కారిడార్‌పై ఉగ్రవాదులు పంజా విసిరేందుకు గతంలో స్కెచ్ వేసిన విషయం కూడా తెలిసిందే. ఒక పక్క ఉగ్రవాద కార్యకలాపాలకు చెక్ పెట్టడంతో పాటు మరోపక్క అసాంఘీక కార్యకలాపాలకు తావులేకుండా ఈ ప్రాంతాన్ని పూర్తిగా సురక్షితంగా ఉంచడంపై సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా దృష్టి సారించారు. ఇటీవల ఐటి కారిడార్ భద్రతపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ ప్రాంత రక్షణకు నాలుగు పోలీసు పెట్రోలింగ్‌తో పాటు ఇంటర్‌సెప్టర్ వాహనం ఉందని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. కేవలం ఇంటర్‌సెప్టర్ వాహనంలో మాత్రమే సిబ్బందికి ఆయుధాలు అందుబాటులో ఉంటాయి.

పోలీసు పెట్రోలింగ్ వాహనాలలో ఉన్న సిబ్బంది వద్ద ఎలాంటి ఆయుధాలు లేవు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ ప్రతి పోలీసు పెట్రోలింగ్ వాహనంలో ఆయుధాలు ఉండాల్సిందేనని ఆదేశించారు. అలాగే నాలుగు పోలీసు పెట్రోలింగ్ స్థానంలో ఏడు వాహనాలను చేర్చారు. ఒక్కో వాహనంలో ఆర్మూడ్ రిజర్వూకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక డ్రైవర్ ఉంటారు. వీరు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే విధుల్లో ఉంటారు. ఆ తరువాత మరో బృందం చార్జి తీసుకుంటుంది. ఇలా ఒక్క వాహనానికి మూడు బృందాల చోప్పున సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.

ఈ వాహనాలకు 21 అనుమానిత సమస్యాత్మక ప్రాంతాలు అప్పగించారు. ప్రతి రోజు పగలురాత్రి ఈ 21 పాయింట్లను కలుపుకుని పెట్రోలింగ్ పోలీసులు గస్తీ తిరుగుతారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో ప్రత్యేకించి అక్టోపస్ యూనిట్ లేకున్నా ఆప్పుడప్పుడు అక్టోపస్ అధికారులు ఐటి కంపెనీల వద్ద మాక్ డ్రిల్ నిర్వహిస్తుంటారు. ఉగ్రవాదులు ఐటి కంపెనీలపై దాడులకు తెగబడితే ఎలా తిప్పికొట్టాలి, ఉద్యోగులను ఎలా రక్షించాలి, గాయపడిన వారిని ఆసుపత్రులకు ఎలా తరలించాలి, ఐటి కంపెనీలో చొరబడిన ఉగ్రవాదులను ఎలా తుదముట్టించాలి అనే అంశాలను వారు కళ్లకుకట్టినట్లుగా మాక్ డ్రిల్ చేసి చూపిస్తుంటారు. ఆ సమయంలో స్థానిక పోలీసులు, పెట్రోలింగ్ వాహనాలు విధులు ఏ విధంగా ఉండాలనే అంశంపై కూడా వారికి తర్పీదు ఇస్తుంటారు. ఐటి కారిడార్‌లో డెలాయిట్ డిఎల్‌ఎఫ్, టిసిఎస్ కంపెనీలతో పాటు వందలాది ఐటి కంపెనీలు, లక్షలాధి ఐటి ఉద్యోగులు పనిచేస్తుంటారు. రాత్రి సమయంలో మహిళా ఉద్యోగులు కూడా విధులకు వచ్చిపోతుంటారు. వారి భద్రతపై కూడా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్యా దృష్టి సారించారు. ఏ క్షణంలో అపద ముంచుకొచ్చినా..సమాచారం రాగానే ఆయుధ గస్తీ వాహనాలతో పాటు ఆయా పోలీసు స్టేషన్‌ల సిబ్బంది ఎలా స్పందించాలి, ఆపదలో ఉన్న మహిళా ఉద్యోగులను ఎలా కాపాడాలనే అంశంపై కూడా పెట్రోలింగ్ సిబ్బందికి తర్పీదు ఇచ్చారు. అవసరమైన సమయంలో నిందితులపై కాల్పులు కూడా జరపాలని సూచించారు. గతంలో ఐటి కారిడార్‌లో జరిగిన నేరాలు, ఘోరాలు ఇక ముందు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నారు.

ఈ ప్రాంతం అత్యంత సున్నితమైనది విఐపిలు, వివిఐపిలతో పాటు సాఫ్ట్‌వేర్ కంపెనీలు, ఉద్యోగుల భద్రత సైబరాబాద్ పోలీసులకు ఛాలెంజిగా మారింది. ప్రపంచ దేశాల సదస్సులు, సమావేశాలు చాలా వరకు ఐటి కారిడార్ ప్రాంతమైన హైటెక్ సిటీలో జరిగాయి. శత్రుదుర్భేద్యమైన ఈ ప్రాంతంలో టార్గెట్‌లో ఉన్న ప్రముఖులపై ఎలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతను సైబరాబాద్ పోలీసులు కల్పించారు.ఇక్కడ ఏ చిన్న ఘటన చోటుచేసుకున్న దేశవ్యాప్తంగా సంచలనం రేపుతుంది. గతంలో జరిగిన అభయ కేసు తీవ్ర సంచలనం కలిగించింది. ఐటి కారిడార్ భద్రతలో సైబరాబాద్ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ వారి సేవలను కూడా పోలీసులు ఉపయోగించుకుంటున్నారు. ప్రతి ఐటి కంపెనీ సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్‌లో భాగస్వామిగా ఉంది. ఈ ప్రాంతంలో సిసికెమెరాల ఏర్పాటు, పోలీసులకు కావాల్సిన వాహనాలను ఈ సంస్థ సమకూర్చింది. ఐటి కంపెనీలలో క్యాబ్ డ్రైవర్ల వివరాలు, వారి ఫోటోలను ఇదివరకే సేకరించారు. కొత్త క్యాబ్ డ్రైవర్ వస్తే అతని వివరాలను కూడా పోలీసులు తీసుకుని భద్రపరుస్తున్నారు. ఇక ఐటి కంపెనీలలో పార్కింగ్ వద్ద సిబ్బందికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలే అవగాహన కల్పించారు.

వీరికి ప్రత్యేకంగా తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. మరోపక్క ఐటి కంపెనీ సెక్యూరిటీ గార్డులను కూడా అప్రమత్తం చేశారు. అనుమానిత వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే నిర్లక్షం వహించకుండా పోలీసులకు సమాచారం అందించాలని వారికి విజ్ఞప్తి చేశారు. సెక్యూరిటీ గార్డులు తరచు తనిఖీలు నిర్వహిం చాలని కోరారు. కంపెనీలోకి వచ్చిపోయే మార్గాలలో మెటల్‌డిటెక్టర్‌లను తప్పని సరిగా ఏర్పాటు చేసేవిధంగా కంపెనీ యాజమాన్యాలకు ఇదివరకే పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో కంపెనీలకు వచ్చిపోయే మార్గాలలో వీటిని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ సిసికెమెరాలను తప్పనిసరిగా ఏర్పాటు చేశారు. భద్రతా చర్యలు చేపట్టని ఐటి కంపెనీలపై కొరడా జులిపిస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. వారి సహకారంతోనే ఐటి కారిడార్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిరంతర గస్తీ నిర్వహిస్తున్నారని ఉన్నతాధికారులు చెబుతున్నారు.