Home కలం తల ఎత్తుకొని రాసిన కవిత్వం

తల ఎత్తుకొని రాసిన కవిత్వం

Pasa-Book

పొయినేడు ‘చెట్టును దాటుకుంటూ’,,,, కవితల సాలు పోసిన కవి జూకంటి జగన్నాథం కొత్త కవితల పుస్తకం ‘పస’. జూకంటి కవిత్వానికి ఓ నలభై ఏండ్లు నిండవచ్చు. ఇది ఆయన రాసిన పదిహేనవ పుస్తకం రాసిందెప్పుడూ కొత్తగానే ఉంటది. మన చుట్టూ గిరిగిరా తిరుగుతున్న లోకం బొంగరాన్ని ఆపి దాని అసలు రంగును బయటపెట్టినట్లుంటది జూకంటి కవిత్వం.
తెలంగాణ కవుల్లో జగన్నాథంది సొంత తొవ్వ. ఒకరి తీరు ఈయన రాయక పోవడమే కాకుండా ఈయనలాగా ఇతరులు రాయలేరు. జూకంటి రాతల్లో అర్థం కానిదేమీ ఉండదు. భాష అందరు మాట్లాడుకునే ముచ్చటే అయినా భావం పానాదులు దాటుతుంది. ఏది చెప్పినా సుస్పష్టం గా ఉంటుంది. పొద్దుపోక రాసినట్లుగాక కొత్త పొద్దుపొడుపు కోసం తండ్లాడినట్లుంటది.
వచ్చిన తెలంగాణతో కవికి తృప్తి లేదు. మరో వైపు తెలంగాణ కవుల ఎవరి చెక్కిలిగింత వారిదే, రాజాధిరాజా! రాజమార్తాండ! పదాలకే పరపతి ఇప్పుడు. ‘గిట్లనుకుంటె గట్లయింది’ అంటే సోపతెవరుండరు. ఇవన్నీ బర్కతులేని మాటలని దూరం ఉంటరు. అయినా నాకపించింది, నాక్కనిపించింది. నేను రాస్తాననుకుంటూ జూకం టి జగన్నాథం తన పంథా విడిచి పెట్టడంలేదు. కోపం దాని తాపంగాని తాను రాసిన దాంట్లో తప్పే మున్నదని అంటున్నాడు. పోనీలే… అంటే వినరు. అక్షరం ముల్లుకర్ర తో పొడుస్తూనే ఉంటాడు.
జూకంటి కవిత్వానికి రంధి బతుకు అంతగా అతకడానికి కారణం ఆయన మట్టి భాష, కనీటి భాష. ఏ జీవితాల్ని చదివి ప్రోది చేసుకున్నాడో గాని పంక్తుల మధ్య సామెత వేసినాడంటే బర్మార్ లా పేలుతుంది.
ఈ కవి ఎంత సమాజం నుంచి నేర్చుకున్న అంతకన్నా ఎక్కువ బతుకులోంచి నేర్చిండు. తన జీవితంలోంచి కష్టజీవుల జీవితాన్ని అంచనా వేసిండు. అదే దృష్టితో ప్రపంచాన్ని కొలిచిండు.
ఊరంటే ప్రేమతో – ‘దేశానికే కాదు ప్రపంచా నికే / గ్రామం బరువు అయ్యింది/ చెరువుకు దూరం అయ్యింది/ ఊరితో సెల్ఫీదిగాలని ఉంది’ అనడంలో ముందుముందు ఊరు చూడడానికి దొరుకుతుందో లేదోనన్న గుబులు ఉంది.
కవులు కాకరకాయలు పులకించి / పల్లకీ మోస్తుండ్రు అపురూపం / వాళ్ళు తన్ని పడేస్తే వీళ్లు పడేసితంతుండ్రు / ఇన్నినాళ్లు ఆవుతోలు కప్పుకుంది పులిరూపం / గుర్తించడంలో ఓడడమే పెద్దశాపం’ తెలంగాణలో మారిందేమీ లేదని ‘రంధి’ పడతాడు కవి.అదే విధంగా ‘నీళ్లు అని కొంత సేపు రాళ్లని ఇంకొంతసేపు / నిప్పులు అని ఓ సారి తప్పులు అని ఇంకోసారి / గొప్పలు ఒక పరి అప్పులు ఒక పరి / పచ్చని బతుకుల్లో నిప్పులు ‘అలుకుతుం డ్రు’ అని ‘తెర్లు’కవితలో పరిస్థితి తేట తెల్లం చేస్తాడు.
‘ఫికరు’ కవితలో నేటి గందరగోళ పరిస్థితిని చక్కగా అక్షరబద్దం చేస్తారు. పని చెప్పినట్లే వున్నది / శని తరుముతున్నట్లున్నది / అన్నం పెట్టినట్టే ఉన్నది / ఈపుకు సున్నం పూసినట్లే ఉన్నది / కూలిగిట్టినట్లే ఉన్నది/ అంతా క్యాలీ తప్పినట్లున్న ది’ పంక్తుల్లో అందీఅందని ప్రయోజనం కన బడుతుంది.‘ఆశలేని గోస’ జూకంటి కాదు గాండ్ల జగన్నాథం రాసిన కవిత, నూనె తీసే గానుగ బతుకులోంచి కవిత్వం, కన్నీళ్ళు పిండిన కవిత ఇది. ఊరూరా నూనెమిల్లులు/ గాండ్లకుల రక్తాన్ని తాగిన నల్లులు’గా పోల్చుతూ వృత్తి దెబ్బ తినడంతో మారిన బతుకు దుర్భరాన్ని ఈ దీర్ఘ కవితలో చిత్రించాడు.
‘ఇస్తారి కట్టలను అమ్మి/ సన్నబియ్యం పరం మా బాపుకొనుకచ్చి నపుడు/ ఆ నూకల పరమాన్న పచ్చిపులుసు మదిలకచ్చి / కండ్లు కుం తాల జలపాతమై దుంకు తుంది’. పూట నడవడం ఎంత దుఃఖమయమో పై పంక్తులు చెబుతాయి. ఈ కవితలో మునిగిపోతు న్నా కుల కశ్పిపడవను సంబంధిత జీవితాలపై దాని ప్రభావాలను అనుభవపూర్వకంగా దృశ్యమానం చేశాడు.
‘తోక కుక్కను ఊపుతుంది’ శీర్షికలోనే వెటకారం ఉంది. ఇందులో తోకనే బలీయమైన శక్తి అయినట్లు’ ఇంకా ఎటుపోతవ్ హవ్‌లా/ మనుషుల మీద గుగూల్ బైటాయించింది/ గక్కడనే కిందికీ మీదికీ/ బస్కీలు తియ్యాలె బేకూబ్’ అని అసలు నిజం చెబుతాడు.
పండుగ తెల్లారి రాని పత్రిక కోసం ఆరాటం, వరంగల్‌లో చిన్ననాడు ఎక్కిన గుర్రపుటాంగా, బుక్‌ఫెయిర్ అనుభవం , మనవరాలి ముద్రలు ఇలా ఎన్నో సందర్భాలు కవి చేతిలో చక్కని కవితలుగా రూపుదిద్దుకున్నాయి.
తెలంగాణ భాషకు, గోసకు నిలువుటద్దం జూకంటి కవిత్వం 41 కవితలున్న ఈ సంపుటిలో కదులుతున్న కాలాన్ని, దీని నడకల్లోని దాగుడుమూతల్ని ఎలాంటి దాపరికం లేకుండా నిలదీసిన సందర్భాలే అధికం. గుండె తడిగల ఈ కవిత్వం గుండెలకు తాకుతుంది. పంపకాల వరుసలో నిలబడకుండా కూలుతున్న బతుకుల పక్కన నిలబడిన అసలుసిసలైన తెలంగాణ గొంతుక ఈ కవిత్వంలో వినిపిస్తుంది.

పస (కవిత్వం)
రచన: జూకంటి జగన్నాథం
పేజీలు: 138, ధర : రూ. 100/-
ప్రతులకు: టి పద్మ 9440002532
నయనం ప్రచురణలు, సిరిసిల్ల