Home దునియా పెళ్లే పరమార్థమా..!

పెళ్లే పరమార్థమా..!

Marriage Lifeస్పీడ్‌గా వచ్చిన కారు ప్రెస్‌క్లబ్‌లోని చుట్టు అరుగు కట్టిన చెట్టు దగ్గరగా పార్క్ చేసి, కళ్ళజోడు తీసి పట్టుకొంటూ డోర్ తెరచి నిలబడింది ఆమె. హుందాగా నిలబడిన తీరు, తెలివైన కళ్ళు, అడుగులో ఆత్మవిశ్వాసం… నమస్తే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారా..? ఏం ట్రాఫిక్…నత్త లాగా నడుస్తూ వచ్చింది కారు… యా మై లేట్… యాభైల్లో అరవైల్లో ఊహించని ఆహార్యం, మాట, జీవన విధానం…

‘ఎస్… నేను కరెక్టగా చెప్పగలననుకొంటున్నాను. కనీసం మూడు తరాల మనుషులను నేను చిన్నప్పటి నుంచి గమనిస్తూ వస్తున్నాను. ముందు మా నాయనమ్మ.. ఎంత ధైర్యవంతురాలు.. ఇల్లు, పొలం పని… పాలు అమ్మటం, పిడకలు వేయటం, ఇల్లంతా ఆవిడ భుజాలపైన నడిచేది. ఏపనీ చేయకుండా అరుగులపైన కూర్చుని రాజకీయాలు మాట్లాడే మా తాత ఆమెను చచ్చేలా కొట్టడం చూసాను. మా అత్త స్కూల్ టీచరు. ప్రతి పైసా మామకు లెక్క చెప్పి ఇచ్చేది. తనకో, పిల్లలకో ఏదైనా కొనుక్కోవాలంటే ఎప్పుడూ మామ ముందు చేయి చాపి లెక్కలు చెప్పవలసిందే.

“ఇక మా అమ్మ మా చదువులు, నాన్న కెరీర్ కోసం ఇంట్లో ఉండేది. ఇంటి పని మాత్రమే యు..నో ఆమె ఎం.ఎ ఎకనామిక్స్. దేహీ అని నాన్నను రూపాయి అడుక్కోవలసిందే. ఈ ముగ్గురి స్త్రీల జీవితంలో స్వేచ్ఛ అనే పదం లేదు. పది మందిలోకి ధైర్యంగా వెళ్ళే జీవితాలు కావు. స్లేవరీ..బానిసత్వం..వాళ కుటుంబాలు తిన్నగా, ప్రేమగా సాగాయనుకొంటారు సమాజంలో ఎక్కడ… వాళ్ళ చుట్టూ స్నేహితులు, తర్వాత నాతో చదువుకొని పెళ్ళాడిన వాళ్ళు. ఆ కుటుంబాల్లో వాళ్ళ పాత్ర…. వాళ్ల జీవిత విధానం నాకు భయం వేసింది. .. ఆ కాన్సెప్ట్‌లో నేను ఇమడలేననిపించింది. సో..ఇప్పుడు నేను హాపీగా ఉన్నాను…. అందామె దూరంగా చూస్తూ ఆమె కళ్ళు వెలుగ్గా ఉన్నాయి”. అన్నట్లు ఆమె పేరు సంధ్య. ఒక షేర్ మార్కెట్‌కు చెందిన కంపెనీలో ఆమె సి.ఇ.ఓ.

“చిన్నప్పుడు మా పిన్ని దగ్గర వైజాగ్‌లో ఉండి చదువుకొన్నాను. ఆమె యూనివర్శిటీలో ప్రొఫెసర్. మా బాబాయ్ కూడా ప్రొఫెసర్. పిన్ని చక్కని రచయిత్రి. మీరు అర్థం చేసుకోండి ఆమె రాసిన ప్రతి రచనలో ఏవో పోలికలు వెతికేవాడు బాబాయి… ఆమెకు నెమ్మదిగా, రాసే సరదా, ఉద్యోగం చేసే సరదా అన్నీ పోయాయి. బాబాయి అనుమానం, హింస, అణచివేత భరించలేక పోయింది. డీప్ డిప్రెషన్. నాకు పదిహేనేళ్ళు ఉన్నప్పుడు ఆమె ఆత్మ హత్య చేసుకొంది. తరువాత పెద్దవుతున్న కొద్దీ ఒక్కరయినా సంతృప్తిగా ఉండేవారు అనిపించే కుటుంబం ఉంటుందా అని చూసేదాన్ని. ఏమో నాకు అనిపించలేదు. సో పెళ్లి గురించి నేను ఆలోచించలేకపోయాను. పెళనే వ్యవస్థలో సమానత్వం నాకు కనిపించలేదు. నేను జీవితాంతం ఒప్పుకొంటూ పోవాలి అన్న భావన భరించలేక పోయాను” అన్నారు శాంత. ఆమె ఐ.టి.లో జాబ్ చేస్తున్నారు.

“మా అమ్మకే నచ్చలేరండీ నా ఫ్రెండ్స్.. వాళ్ళతో నేను స్పెండ్ చేసే సమయం. బాబోయ్ నేను చాలా భయపడ్డాను. మమ్మీ సరే… ఆవిడ దృష్టిలో ప్లానర్‌గా అంటే కుటుంబ జీవితం నేను గడపాలనుకొంది…. నావల్ల కాదు అందరితో ఇప్పుడు హ్యాపీ… మీరు తినే టిఫిన్ నేనే చేశాను బావుంది కదా అన్నాడు నీహాల్… ఇతను మార్కెటింగ్ మేనేజర్. “మా నాన్న అంటే నాకు చాలా ఇష్టమే. కానీ ఆయనెంత హారిబుల్ అంటే మా అమ్మను పని మనిషి కంటే తేలిగ్గా చూసేవాడు. నిరంతరం ఆవిడ ప్రతి నిమిషం వణికిపోతూ ఆయన సేవ చేసేది….

“ మా నాన్న ప్రొఫెసర్.. సాయంత్రం ఆయనకు ట్యూషన్స్ ఉండివి. స్టూడెంట్స్ వచ్చాక ఇంట్లో మా అమ్మ, మేం సూది కింద పడితే వినబడేంత నిశ్శబ్దంగా ఉండేవాళ్ళం. స్టవ్ పైన మా కోసం ఏదో వండుతున్న మా అమ్మను స్టూడెంట్స్ వినేలా తిట్టికొట్టాడు. అలాంటివి ఎన్నో జరిగాయి. పెళ్ళి ఎందుకు వద్దనుకున్నారు అన్న ప్రశ్నకు సమాధానాలు ఇవన్నీ. ఎంతో మందితో మాట్లాడేక వచ్చిన అనుభవాల సారం ఏమిటంటే ఈ తరంలో చాలా మందికి వివాహం పట్ల విముఖత. వివాహ వ్యవస్థ చాలా విలువైందనీ, దాని వల్లనే ఆరోగ్యరమైన సమాజం సజావుగా నడిచిందనే అభిప్రాయాలతో ఈతరం ఏకీభవించటం లేదు. వివాహంతో జీవితానికి స్థిరత్వం వస్తుందనే భావన కొందరికి రుచించలేదు. వివాహం అవసరమేమో కానీ అదే జీవితం కాదని కొందరి అభిప్రాయం. అసలు పెళ్ళే వద్దు ఒంటరిగా హాయిగా బతుకుతామంటున్నారు. ఇది ప్రకృతి విరుద్ధమా? మంచి ఆలోచనా, మానసిక అనారోగ్యానికి సూచనా? అన్న దాని పైన కూడా ఏకాభిప్రాయం లేదు ఒక సర్వే ప్రకారం ఎవరి బతుకులు వాళ్ళవిగా ఇతరుల జోక్యం అంగీకరించడం అనే భావనతో అమెరికాలో పలు వాలుగా ఇళ్ళలో ఒకే ఇల్లు ఒంటరిగా జీవించేవాళ్ళదే. ఇప్పుడు మన దేశంలో కూడా ఈ భావన పెరుగుతోంది. పెళ్ళి వద్దనే వాళ్ళు పెళ్ళి పట్ల విముఖత చూపించే వాళ్ళ సంఖ్య పెరిగి పోతోంది.

ఒకప్పుడు 60 ల్లో వివాహమే జీవిత పరమార్థం. ఒంటరిగా ఉండేవాళలో ఏదో లోపం చూపేది సమాజం. వాళ్ళని అనుమానించేవాళ్ళు. ఇక ఆడవాళ్ళ విషయంలో కాకుల్లా పొడిచేవాళ్ళు కానీ ఈ తరానికి ఆ సమస్య లేదు. యువతీ యువకులు ఇద్దరూ చక్కగా చదువుకొని ఎవరి కాళ్ళ పైన వాళ్ళు నిలబడిన వాళ్ళు. పెళ్ళి వద్దనుకుంటున్న వాళ్ళు ఒంటరిగా ఉండటం అంటే ఏమిటో అర్థం చేసుకోమంటున్నారు.

వివాహవ్యవస్థలో వచ్చే ఎన్నో అనర్ధాలకు మేం దూరం అంటున్నారు. వివాహం అంటే ఎన్నో ఆంక్షలు, నిబంధనలు స్వయంగా భాగస్వామిని ఎంచుకోలేకపోవటం, అంటే పెళ్ళితో వచ్చే ఒక బానిస భావాన్ని ఎదుటిమనిషి అర్థం చేసుకోలేకపోవటం కూడా కారణం చూపిస్తూ ఇలాంటివన్నీ జీవితాన్ని సుఖంగా గడుపుకునేందుకు అడ్డంకిగా ఉన్నాయని భావిస్తున్నారు.
స్వచ్చమైన ప్రేమ, ఇష్టం, ఒకళ్ళపట్ల ఇంకొకళ్ళకి నమ్మకంతో కలసి జీవించే పద్ధతి లేని వివాహ వ్యవస్థకు తాము వ్యతిరేకం అంటున్నారు… ఈ తరం దృష్టిలో పెళ్ళికి ఉన్న లక్షం వేరు. స్త్రీ పురుషుల సంబంధాలను కొత్త కోణంలో చూస్తున్నారు. ఇద్దరి బాధ్యతలు ఒకటేనని, ఒకళ్ళ కంటే ఇంకొకళ్ళు ఎక్కువ తక్కువ కారనీ జీవితం అంటే పిల్లల్ని కనటం వారి కోసం శ్రమించటం అదే పరమార్థంగా బతకడంలో ఎలాంటి తృప్తి ఉండదని కనుక జీవితాన్ని కొత్తగా అలా డిజైన్ చేసే అవకాశం ఉండక తాము ఒంటరిగా ఉండిపోతున్నామని ఇంకొందరు కచ్చితంగా చెబుతున్నారు.

సంసార జీవితంలో స్వేచ్ఛ లేదంటారు కొందరు అబ్బాయిలు. స్నేహితులు, సమయం, సందర్భాలు అన్ని తమ చేతిలో ఉంచుకొని ఆంక్షలు లేని అత్యుత్తమమైన జీవితం అందుకోగలిగింది ఈ ఒంటరి ప్రయాణంలోనే అంటారు. ఇకపోతే కొన్ని పరిశోధనలు ఒంటరిగా జీవించటంలోనే కొన్ని లాభాలు ఉంటాయన్నారు. ఒంటరిగా ఉంటే ఆర్థికపరమైన సమస్యలు చాలా తక్కువ ఉంటాయి. ఒంటరి వాళ్ళకి సమర్థత, ఆత్మస్థైర్యం రెండూ ఎక్కువే.. వ్యతిరేక ఆలోచనలు ఉండవు. ఎవరిపైన ఆధారపడరు. ఎవరో తమకు అన్యాయం చేశారన్న గిల్టీ ఫీలింగ్‌లు ఏవీ ఉండవు.

వివాహ బంధంలో కనబడే ఎలాంటి వ్యతిరేక అంశాలు ఒంటరివాళ్ల జీవన విధానంలో కనిపించవని అధ్యయనకారులు చెపుతున్నారు. ఇక సామాజిక శాస్త్రవేత్త లయితే వ్యక్తి గత లక్షాలన్నింటినీ ఒంటరిగా ఉన్నప్పుడే సాధించుకోగలరు అంటున్నారు. చదువు, ఉద్యోగం, మంచిపొజిషన్, మంచి లక్షాల కోసం ఒంటిరిగా నడవటం వల్లనే సాధ్యపడతాయి అంటున్నారు. వీటిని విశ్లేషణకు తీసుకున్న యువతరం చక్కని హోదాల్లో ఉన్నవాళ్ళు సమయం దొరికితే దేశం చుట్టేవాళ్ళు. చక్కని స్టార్టప్‌లు స్థాపించి అత్యున్నత దశకు ఎదగాలనుకొనే వాళ్ళు. సమాజసేవ చేద్దామనుకొనే వాళ్ళు ఒక ధ్యేయాన్ని ముందు ఉంచుకొని జీవితం మొదలు పెట్టినవాళ్ళు ఉన్నారు. వీళ్ళకు వివాహం పట్ల ఉత్సాహం లేదు. సమయం లేదంటున్నారు. జీవిత భాగసామి తమ ధ్యేయాన్ని లక్షాన్ని అర్ధంచేసుకోలేదేమోనని ఆలోచించేవాళ్ళుగానూ ఉన్నారు. ముఖ్యంగా ఆడపిల్లలు ఏ లక్ష సాధనలో ఉన్న, ఉన్నతోద్యోగం, కోసం ప్రయత్నిస్తున్నా, చేస్తున్నా, వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు ఫీల్డ్‌కు సంబంధించి ఎక్కువ తిరగవలసి రావటం, టార్గెట్స్ ఉండటం, టెన్ టు ఫైవ్ …కాకపోవటం ముఖ్యంగా ఒంటరిగానే బావుంది అని చెప్పటానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణంలో వాళ్ళకి తోడుగా ఉండే సహచరులు కావాలి. ఆశని, లక్షాన్ని, దానికి వెచ్చించే సమయాన్ని అర్ధం చేసుకోగలగాలి.

పెళ్ళిలో ఉండే సాధక బాధకాలు, కుటుంబ వ్యవస్థకి సమాజంలో ఉన్న గౌరవం తెలిసినవే.. కానీ వివాహంలో ఉన్న అసమతుల్యత తొలగించలేమన్నది గాఢమైన నమ్మకంగా చెపుతూనే వాళ్ళది ఒంటరి జీవితం సౌకర్యంగానే అనిపిస్తోంది. బంధువులతో, స్నేహితులతో మెరుగైన సంబంధాలుంటాయని వివాహ బంధంలో కనిపించే ఇతర వ్యతిరేక అంశాలేమీ బాధించక పోవటం వల్ల సుఖంగా ఉన్నామంటున్నారు. ఒంటిరిగా ఉంటే ఆరోగ్యపరమైన శ్రద్ధ, జాగ్రత్తా ఉంటాయి. శరీరాన్ని వ్యాయామాలు, భోజన నియమాలలో అదుపులో ఉంచుకోగలుగుతారు. ఒత్తిడిని పారద్రోలే సక్రమమైన సంబంధాలు నిలుపుకోగలుగుతారు. ఎలాంటి కలతలు బాధించవు. హాయిగా స్వేచ్ఛగా ఉండటంతో ఎన్నో లాభాలున్నాయని, కెరీర్‌లో నిలదొక్కుకోగలుగుతున్నామని, లక్షం వైపు తిన్నగా నడవగలుగుతున్నామని యువత నొక్కి చెబుతున్నారు.

ఒక అధ్యయనం ఈ తరం. యువత బాధ్యతలు భారంగా పరిగణిస్తూ ఉన్నారనీ, వాళ్ళకి మాత్రమే అలవాటైన ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని, కాబోయే భాగస్వామికి పరిచయం చేయటం ఒప్పించటం కూడా అసాధ్యమేనని అనుకొంటున్నారని చెపుతోంది. రెండు కుటుంబాల్లో భిన్న ప్రవత్తులతో, ఆలోచనలతో, ఆశలతో, పెరిగినవాళ్ళు ఏక కుటుంబంగా సర్దుకోవటంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఆ ఫలితాలన్నీ కళ్ళారా చూసిన భయం యువతరాన్ని కొంత వివాహానికి విముఖులను చేస్తారని చెబుతున్నాయి. ఇది కొత్త తరం ఆలోచన. ఆర్థికంగా స్థిరపడ్డాక జీవితాన్ని కోరుకునే తీరులో నిర్మించుకోవాలని హద్దులెరగని స్వేచ్ఛలో హాయిగా విహరించాలనీ, తమ ఆశయాల పట్ల నిర్ణయాధికారం తమకే ఉండాలనీ కోరుకులంటున్న యువత ఆహ్వానిస్తున్నది ఒంటరి యానాన్నే. ఒక ఆనందపూరితమైన భవిష్యత్తులోకి నడిచే మార్గానికి ఈ ఆలోచన దారి తీస్తోందా? మనిషిని ఉక్కిరి బిక్కిరి చేసే అనుబంధాల సుగంధపు లేపనాలు లేకుండా ఒంటరి జీవనం సంతృప్తి ఇస్తుందా? మూసిన గుప్పిటితో ఎప్పుడూ ఊరించే జీవితం ఏమి ఇవ్వబోతోంది? ఇవి సమాధానం దొరక వలసిన ప్రశ్నలు.

-సి. సుజాత, మన తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి

It is All about after Marriage Life