Home తాజా వార్తలు దుమ్మురేపిన టిసిఎస్

దుమ్మురేపిన టిసిఎస్

IT major reports 23% growth in profit at Rs 7,901 crore

క్యూ2లో నికర లాభం 23 శాతం వృద్ధి
రూ.7901 కోట్లు నమోదు

ముంబై : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(201819) రెండో త్రైమాసిక(క్యూ2) ఫలితాల్లో సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) మంచి లాభాలను నమోదు చేసింది. డిజిటల్ సేవలకు పటిష్టమైన డిమాండ్ ఉండడంతో క్యూ2(జులై సెప్టెంబర్)లో సంస్థ నికర లాభం 22.6 శాతం పెరిగి రూ.7901 కోట్లకు చేరింది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ లాభం రూ. 6,446 కోట్లుగా ఉంది. అయితే ఫలితాలు మెరుగ్గా ఉన్నప్పటికీ కొన్ని సంస్థల అంచనాల కంటె దిగువనే ఫలితాలు ఉన్నాయి. సెప్టెంబర్ ముగింపు నాటి క్యూ2 ఫలితాల్లో టిసిఎస్ ఆదాయం 21 శాతం పెరిగి రూ.36,854 కోట్లు నమోదవగా, గతేడాది సంస్థ ఆదాయం రూ.30,541 కోట్లుగా ఉంది. త్రైమాసికం త్రైమాసికం ఆధారంగా చూస్తే ఆదాయం 7.57 శాతం పెరిగింది. ఏడాది ఏడాది ఆధారంగా చూస్తే 11 శాతం జంప్ చేసింది. అంతటా డిజిటల్ మార్పు.. బిఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్‌లో వేగవంతమైన వృద్ధి కొనసాగడం వంటి అంశాలతో రెవెన్యూ వృద్ధిని సాధించిందని సంస్థ సిఇఒ, ఎండి రాజేష్ గోపీనాథ్ అన్నారు.

డాలర్ రూపంలో రెవెన్యూ
ముంబై ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న ఈ కంపెనీ డాలర్ రూపంలో 3.2 శాతం వృద్ధిని సాధించి 5,215 మిలియన్ డాలర్లు ఆర్జించింది. అలాగే త్రైమాసికం త్రైమాసికం ఆధారంగా చూస్తే రెవెన్యూ వృద్ధి కరెన్సీ రూపంలో 3.7 శాతంగా ఉంది.

రూ.4 డివిడెండ్
ఈ ఫలితాల సందర్భంగా టిసిఎస్ ఒక్కో షేరుపై రూ.4 తాత్కాలిక డివిడెండ్‌ను ప్రకటించింది. కంపెనీ సభ్యులుగా రిజిస్టర్‌లో నమోదైన వాటాదారులకు లేదా షేర్ల లాభదాయక ఓనర్లుగా ఉన్న వారికి ఈ డివిడెండ్‌ను ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే ఈ త్రైమాసికంలో ఆపరేటింగ్ మార్జిన్ 26.5 శాతానికి పెరిగాయి.

కంపెనీలోకి 10,227 మంది ఉద్యోగులు
ఈ త్రైమాసికంలో నికరంగా కొత్తగా 10,227 మంది ఉద్యోగులను కంపెనీలోకి చేర్చుకున్నట్టు టిసిఎస్ ప్రకటించింది. గత 12 త్రైమాసికాల్లో చూస్తే ఇదే అత్యధికమని, దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 4,11,102 కు పెరిగిందని వెల్లడించింది. తమ కంపెనీ మహిళా ఉద్యోగులు 35.7 శాతంగా ఉన్నట్టు తెలిపింది. 100 మిలియన్ డాలర్ల కేటగిరీలో కంపెనీ నలుగురు కొత్త క్లయింట్స్‌ను చేర్చుకుంది. 20 మిలియన్ డాలర్ల కేటగిరీలో ఏడుగురిని, 10 మిలియన్ ప్లస్ డాలర్ల కేటగిరీలో 10 మందిని చేర్చుకున్నట్టు తెలిపింది.
క్యూ2 ముఖ్యాంశాలు
1 నికర లాభం రూ. 7901 కోట్లు, గతేడాదితో పోల్చితే 22.6 శాతం వృద్ధి
2 ఆదాయం రూ. 36854 కోట్లు, గతేడాదితో పోల్చితే 20.7 శాతం వృద్ధి
3 నిర్వహణ మార్జిన్ 26.5 శాతం, గతేడాదితో పోల్చితే 1.4 శాతం వృద్ధి
4 22.7 శాతం పెరిగి ఇపిఎస్ రూ. 20.6 గా నమోదు
5 ఒక్కో షేరుకు రూ.4 డివిడెండ్ ప్రకటన
6 బిఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్ రంగాల్లో గణనీయమైన వృద్ధి, వృద్ధికి సహకరిస్తున్న బ్రిటన్, యూరప్ విభాగాలు
7 100 మిలియన్ డాలర్లకు పైగా విలువైన నలుగురు కొత్త క్లయింట్లు
8 క్యూ2లో కొత్తగా 10,227 మంది ఉద్యోగుల నియామకం

IT major reports 23% growth in profit at Rs 7,901 crore