Search
Wednesday 14 November 2018
  • :
  • :

కుమారతో కెటిఆర్

KTR

హైదరాబాద్ :  బెంగళూరు పర్యటనలో భాగంగా పరిశ్రమలు, ఐటి శాఖ మంత్రి కెటి. రామారావు బుధవారం కర్నాటక ముఖ్యమంత్రితో కుమారస్వామితో భేటీ అయ్యారు. ఉదయం ఆయన తో కలిసి అల్పాహార విందులో పా ల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కుమార స్వామికి మంత్రి కెటిఆర్ వివరించారు. ముఖ్యంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయతో పాటు తెలంగాణకు హరిత హారం ద్వారా మొక్కల పెంపకం కార్యక్రమాల విశేషాలను కర్నాటక సిఎంతో పంచుకున్నారు. తమ హరితహారం విశేషాలను వెల్లడించడంతో పాటు ఒక మొక్కను కూడా కుమారస్వామికి బహూకరించారు. ఆత్మీయంగా ఆయనకు శాలువా కల్పి చిరు సత్కారంచేశారు. ముఖ్యమంత్రి అయినప్పటికీ కుమార స్వామిలోని వినయం, అత్యంత సాధారణంగా ఉండే తత్వం తనను అమితంగా ఆకర్షించినట్లు మంత్రి కెటిఆర్ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.
నిఖిల్ గౌడ షూటింగ్ స్పాట్‌కు వెళ్ళిన కెటిఆర్
అనంతరం తన కుమారుడు, సినీనటుడు జాగ్వార్ ఫేమ్ నిఖిల్ గౌడ హిరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘సీతారామ కళ్యాణం’ షూటింగ్ స్పాట్‌కు మంత్రి కెటిఆర్‌ను కుమార స్వామి తోడ్కొని వెళ్ళారు. ఈ సినిమాను ఆయనే ప్రొడ్యూస్ చేస్తున్నారు. యూనిట్ సభ్యులను నిఖిల్ గౌడ్ పేరుపేరున మంత్రి కెటిఆర్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా సినిమా రషెస్‌ను తన లాప్‌టాప్‌లో కెటిఆర్‌కు చూపించారు. అదే సమయంలో సినిమా డైరెక్టర్ హర్షను కూడా పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. డైరెక్టర్ హర్ష గతంలో కొరియోగ్రఫర్ అని, ఇప్పటి వరకు 900 పాటలకు కొరియోగ్రఫీ చేశారని నిఖిల్ తెలిపారు. ఆశ్చర్యపోయిన కెటిఆర్ “అన్ని సినిమాలు చేశావా? ఇంతకు నీ వయసెంతా” అని అడిగారు. “నా వయసు 38 సంవత్సరాలు” అని హర్ష చెప్పగా, “మరి అన్ని పాటలు ఎలా చేశావు, సినిమాల్లోకి వచ్చి ఎంత కాలమైంద”ని కెటిఆర్ ప్రశ్నించారు. “నేను చిన్న వయసులోని సినీరంగంలోకి వచ్చాను సర్. అప్పడు నా వయసు 16 సంవత్సరాలు”అని డైరెక్టర్ తెలిపారు. ఆయనను కెటిఆర్ అభినందించారు. షూటింగ్ ఎన్ని రోజులకు పూర్తవుతుందని అడగగా, ఇంకా 45 రోజులు పడుతుందని, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కు రెండు నెలలు పడుతుందని, అయితే రెండు సమాంతరంగా చేస్తున్నామని వారు వివరించారు. వచ్చే సెప్టెంబర్ కల్లా సినిమాను విడుదల చేస్తామని నిఖిల్ చెప్పారు.

Comments

comments