Home తాజా వార్తలు వీధి వ్యాపారులతో సున్నితంగా వ్యవహరించాలి…

వీధి వ్యాపారులతో సున్నితంగా వ్యవహరించాలి…

KTR

హైదరాబాద్: ఆక్రమణల తొలగింపులో వీధి వ్యాపారులను దృష్టిలో పెట్టుకొని సున్నితంగా వ్యవహరించాలని ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ అన్నారు. జిహెచ్‌ఎంసి ప్రారంభించిన ఫుట్‌పాత్‌ల ఆక్రమణల తొలగింపుపై ఉన్న‌తాధికారుల‌తో మంత్రి గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆక్రమణల తొలగింపు ప్రక్రియ కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. నగరంలో నిర్ణీత వెండింగ్ జోన్లతో కూడిన ఒక యాప్ తయారు చేయాలన్నారు. త్వరలోనే వీధి వ్యాపారులతో సంబంధిత అధికారులు సమావేశమై సమస్యలు పరిష్కరించాలన్నారు.

ఆక్రమణల తొలగింపు అనంతరం వెంటనే ఫుట్‌పాత్‌ల నిర్మాణాన్ని ప్రారంభించాలని అధికారులకు తెలిపారు. ఫుట్‌పాత్‌లను అత్యున్నత ప్రమాణాలు, యూనిఫైడ్ డిజైన్లతో వీలైనంత వరకు అన్ని సౌకర్యాలు ఉండేలా నిర్మించాలని ఆయన పేర్కొన్నారు. కొత్తగా నిర్మించే ఫుట్‌పాత్‌లకు జోనల్ కమిషనర్లు ప్రత్యేక బాధ్యత వహించాలని తెలియజేశారు. ప్రతిసారి పుట్ పాత్ ఆక్రమణలకు పాల్పడ్డ షాపు యాజమానుల ట్రేడ్ లైసెన్సుల రద్దుకు అవకాశాలు పరిశీలించాలని సంబంధిత అధికారులకు చెప్పారు. ఫుట్‌పాత్‌లపై ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు, ఇతర నిర్మాణాల విషయంలో ట్రాన్స్‌కోతో పాటు, ఇతర ప్రైవేట్ ఏజెన్సీలకు నోటీసులివ్వాలని ఆదేశించారు. నగరంలో నిర్మించే ఫుట్‌ఓవర్ బ్రిడ్జ్ పనులు తక్షణమే ప్రారంభించేలా చర్యలు తీసుకొని 3 నెలల్లోనే పనులను పూర్తి చేసేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి కెటిఆర్ సూచించారు.