Home సినిమా మరపురాని నృత్య తటిల్లత సిల్క్ స్మిత

మరపురాని నృత్య తటిల్లత సిల్క్ స్మిత

Silk-Smitha

మత్తెక్కించే కళ్లు, నిషా, కలిగించే చూపులు, పిచ్చి ఎక్కించే శరీర సౌష్ఠవం, కసి పెంచేలా మునిపంటితో విల్లులా కనిపించే పెదవిని సోకుగా కొరుకుతూ కనిపించడం, అర్ధనగ్నంగా వుండే తొడలపై చేతులు వేసి మెలికలు తిరగడం, బ్రా లాంటి జాకెట్, బికిని తరహా దుస్తులు ధరించి కాలు ఎత్తిపెట్టి ఇచ్చే భంగిమలు, ముద్దు ఇచ్చేయాలని తమకంతో డ్యాన్స్ చేస్తూ హీరో ముఖాన్ని దగ్గరగా లాక్కోవడం, బిగికౌగిట బంధించే యత్నం చేయడం, తమకంతో ఒళ్లు విరుచుకోవడం, విరహ తాపాన్ని వినూత్నంగా చూపుతూ, తనువుని తటిల్లతలా ఊపుతుండటం- ఇవీ నాట్యతార, నటి సిల్క్ స్మిత ప్రత్యేకతలు.

ఈ ప్రత్యేకతల కారణంగానే యవ్వనంలోకి అడుగిడేవారు, యువకులు, మధ్యవయస్కులు, వృద్ధులు సినిమాలో ఆమె డ్యాన్స్‌లు చూసి మదన తాపంతో కొట్టుమిట్టాడేవారు. నిద్రలేని రాత్రులు గడిపేవారు. ఏమిటా విరగబాటుదనం అని పైకి విమర్శిస్తూ మాట్లాడినా చాలా మంది లోలోపల సంతోషిస్తూ పదే పదే ఆ దృశ్యాలను గుర్తుచేసుకునే వారు. ఈ కోవకు చెందిన వారిలో పురుషులతో పాటు స్త్రీలు వుండేవారు.

అర్ధనగ్న నృత్యాలతో ఆకట్టుకునే పాత్రల్లో ఎక్కువగా కనిపించినా తనలోనూ మంచినటి వుందని కొన్ని చిత్రాల్లో నిరూపించుకుంది సిల్క్ స్మిత. అవకాశాలు వస్తే ఇంకా ఎక్కువగా తన నటనా ప్రతిభ బహిర్గతం చేయాలని తలచేది. అందువల్లనే 1979 నుంచి 1996 వరకు ఆమెకు ముందు నాట్యతారలుగా గుర్తింపు వున్న వారికీ ఆమెతోగాని, ఆ తర్వాత గాని వ్యాంప్ ఆర్టిస్టులుగా, డ్యాన్సర్లుగా వచ్చిన వారికి గట్టి పోటీ ఇవ్వగలిగింది. ఎంత గట్టి పోటీ అంటే సినిమాలో సందర్భం వున్నా లేకపోయినా ఏదోరకంగా ఆమె డ్యాన్స్ చేసే పాటను ఇరికించాల్సిందే అని పంపిణీదారులు ఒత్తిడి చేసేంతగా.

అందువలన సినిమా విడుదల కావాలంటే స్మిత డ్యాన్స్ కంపల్సరీ అని, సినిమాకు మినమం గ్యారంటీ వుంటుందని తెలుస్తుంది. నిర్మాతలు ఆమె కాల్షీట్ల కోసం నెలల తరబడి నిరీక్షించి, ఆ పాటను నృత్య దర్శకుడు కొత్త భంగిమలతో చిత్రీకరింపజేస్తే తృప్తిగా సినిమాని నిర్మాతలు విడుదల చేసేవారు. పంపిణీదార్లు ఉత్సాహపడుతూ అధిక పబ్లిసిటీ ఇచ్చి విడుదల చేసేవారు. ఇతర కారణాల వల్ల అంటే కథ, కథనం, నటీనటుల ఎంపిక బాగోలేదన్న కారణంతో విడుదల కాకుండా వుండి పోయిన చిత్రాలలో క్కూడా, సిల్క్ స్మిత నాట్యం ఒకటి తమ చిత్రంలో పెట్టి. పబ్లిసిటీ ఇచ్చి థియేటర్లలో వదిలేసేవారు.

సిల్క్ స్మిత్‌ది చక్కని ఫొటో జెనిక్ ఫేస్. ఆమె శరీరపు ఒంపులు కూడా ఫొటోజెనిక్‌గానే ఉండేది. పలు వరుస కొంచెం కనిపించేలా నవ్వినా…. పలు వరుస పూర్తిగా కనిపించేలా చిరునవ్వుతో చిందించినా, నాయిక కొనను దవడ వైపు గలపై పంటి వరుసతో కసిగా తాకించినా, కళ్లు చిట్లిస్తూ చూసినా, తమకంతో రెండు చేతులూ పైకి పెట్టి ఒక దానితో ఒకటి తాకించినా ప్రేక్షకులలో గుబులు పుట్టించేది, వెర్రెక్కించేది. ఈ కారణంగానే 18 సంవత్సరాలలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 450లకిపైగా చిత్రాలలో 506కి మించి డ్యాన్సులు చేసింది. వీటిలో కొన్నిచిత్రాల్లో చక్కని నటననూ ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు పొందింది.

తెలుగు పడతి అయిన సిల్క్ స్మిత్‌లోని ప్రతిభను నటుడు, స్క్రిప్ట్ రచయిత, దర్శకుడు విసు చక్రవర్తి గుర్తించాడు. సానపడితే వజ్రమే అనుకున్నాడు 1978లో. ఆ ప్రయత్నాలు చేశాడు. ఆంటోని ఈస్ట్‌మెన్ దర్శకత్వంలో రూపొందే మలయాళ చిత్రం ‘ఇనయె లేడి’లో 1979లో వ్యాంప్ పాత్ర పోషించే అవకాశం తొలిసారి వచ్చింది. ఇది 1981 జులై 9న విడుదలైంది. ‘పుష్పరాగం’లోనూ నటించింది. ఈ మలయాళ చిత్రం మొదటి చిత్రంగా 1979లో విడుదలైంది. కె. విజయన్ తన దర్శకత్వంలో రూపొందించే ‘వండి చక్కరమ్’ తమిళ చిత్రంకోసం ఆమెను సిల్క్ అనే బార్ గాళ్ పాత్ర ఇచ్చి, సిల్క్ స్మిత్‌గా పరిచయం చేశాడు. సరిత, శివకుమార్, విసు చక్రవర్తి నటించిన (విసు చక్రవర్తి పరిచయం చేస్తేనే విజయన్ ఆమెకు అవకాశం ఇచ్చాడు) ఈ చిత్రం 1980 ఆగస్టు 29న విడుదలైంది. ఘన విజయం సాధించింది. సరితకు జాతీయ అవార్డును తెచ్చింది. స్మితకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. భారతీ రాజా దర్శకత్వంలోని ‘సీతాకోక చిలుక’లో చక్కని నటి అని 1981 జులై 18న విడుదలయ్యాక పేరు తెచ్చుకుంది.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు దగ్గర కొవ్వలి గ్రామంలో కడ్లపాటి సరసమ్మ, శ్రీరామ మూర్తిలకు 1960 డిసెంబర్ 2న విజయలక్ష్మిగా జన్మించింది. వీరి బంధువు అన్నపూర్ణ పిల్లని దత్తత తీసుకుని ఏలూరులో స్థిరపడింది. చదువు, నాలుగో తరగతితో ఆగిపోయినా సినిమా పిచ్చి మాత్రం ఎక్కువయింది. నల్లగా బొద్దుగా, ఆకట్టుకునే మత్తు కళ్లతో వుండేది. అందరి కళ్లు ఆమె మీదనే వుండేవి. సినిమాల్లో నటించాలనే కోరిక కలగడంతో, దత్త పుత్రిక కోరిక తీర్చడానికి తెలిసున్నవాళ్లు వుంటే మద్రాసుకు 1978 ప్రాంతంలో అన్నపూర్ణ మకాం మార్చింది. గుంపులో ఒకరిగా జూనియర్ ఆర్టిస్టుగా కొంతకాలం చేసింది. నాటకాల్లో నటించే ప్రయత్నమూ చేసింది.

ఒకానొక సందర్భంలో కామెడీ ఆర్టిస్టు, స్క్రిప్ట్ రైటర్, దర్శకుడు విసు చక్రవర్తి దృష్టిలో పడింది. విజయలక్ష్మి కళ్లు, వెడల్పాటి చక్కని పలు వరుస, విల్లు మాదిరి వంగిన తడి పెదవులు చూసి భవిష్యత్తులో నటి అవుతుందని తలచాడు. నటి అయిన తన భార్య కర్ణపూతో ఆమె గురించి చెప్పి, నటనలో శిక్షణ ఇమ్మని, తమిళ, ఆంగ్లభాషల్లో మాట్లాడటం నేర్పమని చెప్పాడు. నాట్యాలలో శిక్షణ కూడా ఇప్పించారు. తమ ఇంట్లోనే వుంచి! విసు చక్రవర్తి ‘సూచన’తో దర్శకుడు విజయన్ వండి చక్కెరమ్‌లో సిల్క్ అనే వ్యాంప్ పాత్ర ఇచ్చి, సిల్క్ స్మిత్ అనే పేరుని ఖాయం చేశారు.

అప్పటినుంచి డ్యాన్సర్‌గా, వ్యాంప్ ఆర్టిస్ట్‌గా లెక్కకి మించి అవకాశాలు రాసాగాయి. షూటింగ్ స్పాట్‌లో సీరియస్‌గా వుండే సిల్క్ స్మిత నాట్యతారగా రికార్డు నెలకొల్పాలని, చేపట్టిన వృత్తికి న్యాయం పూర్తిగా చేయాలని తలుస్తూ తన డ్యాన్స్‌కు తగ్గ కాస్టూమ్స్ ఎంపిక చేయడంలోనూ ఆరితేరిపోయింది. దాంతో సినిమా వారికీ, ప్రేక్షకులకూ క్రేజీ డ్యాన్సర్ అయిపోయింది. ఐటమ్ సాంగ్స్‌లో ఐటమ్‌గరళ్‌గా కనిపిస్తూ నాట్యాలతోనే కాకుండా కొన్ని చిత్రాల్లో చక్కని నటననూ ప్రదర్శించింది.

ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు బాలూ మహేంద్ర ‘ముండ్రామ్ పిరమ్’ తమళ చిత్రంలో సిల్క్ స్మితతో చేయించిన హెడ్మాస్టర్ భార్య పాత్ర నటిగా ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఈ చిత్రంలో కమల్ హాసన్, శ్రీదేవి నాయికా నాయికలు. అయినా స్మితకు నటిగా పేరు బాగా వచ్చింది. ఈ చిత్రాన్ని హిందీలో సద్మా పేరుతో పునర్నిర్మిస్తే, ఆ చిత్రంలోని నటన ద్వారానూ ప్రాచుర్యం పొందింది. “నన్ను అలాంటి పాత్రకు ఎంపిక చేసి నటింపజేసిన గొప్పదనం బాలూ మహేంద్ర గారిదే!” అని చెప్పేది. గంగై అమరన్ దర్శకత్వంలో రూపొందిన కోళి కూవుతు, కొక్కొరకో తమిళ చిత్రాల్లో లయనం సిన్మాలో మంచి పాత్రలు లభించాయి. ఈ సినిమాల్లోని పాత్రలు తనకు చాలా ఇష్టమని చెప్పేది. అలాగే స్ఫటికం మలయాళం చిత్రంలోని పాత్ర కూడా.

తెలుగులో సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన ‘ఆదిత్య 369’లో రాజనర్తకిగా, శరత్ దర్శకత్వలో రూపొందిన ‘బావ బావమరిది’లో పోషించిన చింతామణి లాంటి పాత్రలోను ప్రతిభను చూపింది. కొన్ని చిత్రాల్లోనే నటిగా అవకాశం ఇస్తున్నారు. అలా ఇచ్చారు కదాని డ్యాన్సులు ఇక చేయను. చీర కట్టుకుని మాత్రమే నటిస్తాను అని కూర్చుంటే ఇన్ని సినిమాల్లో అవకాశాలు దక్కేవి కావు. మంచి పాత్రలు చేయాలని వున్నా వాటికోసమే నిరీక్షిస్తే వెనుకబడిపోవటమే కాదు ఈ డ్యాన్స్ పాత్రలూ మిస్సైయిపోతాయి. డ్యాన్సర్‌గా నన్ను ప్రేక్షకులు అభిమానిస్తున్నారు. కనుక నేను ఎంపికైన వృత్తికే పూర్తి న్యాయం చేయాలి” అని చెప్పేది.

అసంతృప్తితో ఆత్మహత్య
సిల్క్ స్మిత డ్యాన్సర్‌గా కొంత బిజీ కాగానే రాధాకృష్ణ అనే వ్యక్తి ఆమెకు ఆప్తుడుగా మారాడు. గైడ్‌గా, సెక్రటరీగా ఇలా బాధ్యతలు చేపట్టాడు. ఆమె తనకు నచ్చిన రీతిలో కట్టించుకున్న ఇంటిలోనే తనూ వుండే వాడు. తరువాత తన కుటుంబాన్ని కూడా ఆ ఇంటికి తీసుకొచ్చాడు. స్మితకు స్వంత మనుషులు కరువయ్యా రు. అతడు చెప్పిన ప్రకారమే నడుచుకోవడం, నటించా ల్సి రావడంతో స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోయి నట్టయింది ఆమెకు. ఎన్నాళ్లు ఓపిక పట్టిందో, ఎంతకా లం సహించిందో గాని 1996 సెప్టెంబర్ 22న రాత్రి పదిగంటల ప్రాంతంలో ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. ఆ రోజు ఉదయం షాపింగ్ కూడా చేసిందట.

ఒక ఉత్తరం రాసి పెట్టి తన గదిలోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 23వ తేదీన ఉద యం తర్వాత ఆత్మహత్య వార్త వ్యాపించింది. ఆమె రాసిన ఉత్తరం ‘అభాగ్యురాలు 1996 సెప్టెంబర్ 22న’ అనే పదాలతో ప్రారం భమైంది. “నాకు నా వారు అంటూ ఎవరూ లేరు. నేను నమ్మినవారు నన్ను మోసం చేశారు. బాబు తప్ప ఎవరికీ నా మీద ప్రేమ లేదు. అందరూ నా సొమ్ము తిన్నవారే. నా చుట్టు వున్నవాళ్లు నాకు మనశ్శాంతి లేకుండ చచ్చిపోయేట్టు చేశారు. నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్నాను. అతను నన్ను మోసం చేశాడు. దేవుడు ఉంటే వాడిని చూసుకుంటాడు. రోజూ టార్చర్ భరించలేను. ఐదేళ్ల క్రితం నాకు ఒకడు జీవితం ఇస్తానన్నాడు. ఇప్పుడు ఇవ్వను అన్నాడు. నా జీవితంలో ఎన్నో భరించాను….” అంటూ ఉత్తరం రాసి పెట్టి మరణించింది. అభిమానులలో అశాంతిని నెలకొల్పింది. సీరియస్ సినిమాలు అంటే ఇష్టపడేది.

బొమ్మరిల్లు, చందమామ కథలు, పత్రికలు చదవడంలో ఆనందం పొందేది. నటీమణుల్లో సావిత్రి అంటే బాగా ఇష్టం. తరువాత జయసుధ, రాధిక, సంజయ్,లక్ష్మి అంటే ఇష్టం. తను అభిమానించే నాట్యతార జయ మాలిని అని చెప్పేది. జయమాలిని అంటే పిచ్చి అనేది. మలయాళీ ఫ్యాన్స్ ఎక్కువ అని హుందాగా ప్రవర్తిసా ్తరనేది. ఆంధ్రా ఫ్యాన్స్ హద్దులూ మీరుతారు కనిపిస్తే అని చెప్పేది సిల్క్ స్మిత. కమల్‌హాసన్‌కు చిరంజీవి మంచి డ్యాన్సర్లు. వారు అంటే కూడా ఇష్టం అనేది.

హీరోయిన్‌గా నిర్మాతగా క్రాస్ బెల్ట్ మణి దర్శకత్వంలో ‘వీరవిహారం’ చిత్రం నిర్మించింది. వినోద్, కోట శ్రీనివాసరావు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రం 1987 ఏప్రిల్ 3న విడుదలైంది. ఆ తర్వాత త్రిపురనేని వరప్రసాద్ దర్శకత్వంలో రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్ నటించగా తను హీరోయిన్’గా ప్రేమిం చి చూడు చిత్రాన్ని నిర్మించి 1990లో విడుదల చేసిం ది. ఈ రెండు సినిమాలు పరాజయం చెంది ఆమెను ఆర్థికంగా కాస్త నష్టపరిచాయి. కాని ఆమె సంపాదించిన ఆస్తులు మాత్రం పోలేదు. ఆమెకూ దక్కలేదు. ‘భూదేవి’ చిత్రంలో ముఖ్యపాత్ర పోషించింది కానీ అది విడుదల కాలేదు. యమకింకరుడు, ఖైదీ, గూఢచారి నెం.1, ఛాలెంజ్, శ్రీదత్త దర్శనం, రాక్షసు డు, గీతాంజలి, బామ్మ మాట బంగారు బాట, అంతం, గోవిందా గోవిందా, పచ్చతోరణం, పల్నాటి పౌరుషం, మా ఆవిడ కలెక్టర్, ముఠా మేస్త్రీ, తదితర చిత్రాల్లో ఆమె నాట్యాలు ఇప్ప టికీ అలరిస్తూనే వున్నాయి.

అందుకే అమెరికా, ఇంగ్లాండ్, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ తదితర దేశాల్లో వున్న తెలుగు, తమిళ, హిందీ భాషల వారు సిల్క్ స్మిత పాటలను రీమిక్స్ చేసి, ఒరిజినల్‌గా వుంచి, వెబ్‌సైట్‌లలో పెట్టి వీక్షిస్తూనే వున్నారు. తను నటించే సీన్స్ చేసేటప్పుడు కొంత చిత్రీకరణ అయ్యాక వచ్చే బ్రేక్‌లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని రిలాక్స్ అయ్యేది. అది ఆమె అలవాటు చిన్నతనం నుంచీ అనేది ఈ కారణంగా చాలామంది ఆమెకు పొగరు, టెక్కు అని సీనియర్స్‌ని గౌరవించదు అని కూడా అనేవారు. స్మిత జీవిత కథనే ‘ది డర్టీ పిక్చర్’ పేరుతో విద్యాబాలన్ ముఖ్య పాత్ర పోషించగా ఏక్తాకపూర్ నిర్మించి విడుదల చేసింది. కోర్టు సమస్యలు రావడంతో స్మిత కథ కాదని తరువాత పబ్లిసిటీ ఇచ్చారు.

వి.ఎస్. కేశవరావు, సెల్‌ః 9989235320