Home దునియా పత్తి పెన్నుల శాయి పోసి రాసుకున్న కాలం

పత్తి పెన్నుల శాయి పోసి రాసుకున్న కాలం

Ink-Pen

పెన్నుకు పత్తి ఉంటది పత్తి ఎనుకనే గడ్డ ఉంటది. ప్లాస్టిక్‌వి కావచ్చు రాస్తుంటే రాస్తుంటే ఆ పెన్ను జర దొడ్డుగ పారేది. దానికో బుర్ర ఉంటది కీసకు పెట్టుకునేతందుకు క్లిప్ ఉంటది.

ఇప్పుడంటే మంచి పెన్నులతో రాస్తుండ్రుగని ఎన్కట శాయి పెన్నులు వాడేది శాయి అంటే ఇంక్, పెన్‌ను కలం అంటరు. శాయిని కూడ ఇండ్లలనే తయారు చేస్తరు. ఎట్లనంటే బియ్యంను నల్లగ అయ్యేట్టుగ ఏం చుతరు. ఏంచినంక రోట్లె వేసి నూరుతరు మారినంక అండ్ల కొన్ని నీళ్ళు జిలకరిస్తరు. అప్పుడు అది రాసుకునేందుక వీలుగ శాయి అయ్యేది ఇదంత 1950,60 సంగతి. ఆ శాయిని బుడ్డిల పోసికొని రాసే మేజా బల్ల దగ్గర పెట్టుకొని కలంను అండ్ల ముంచుకుంట రాస్తరు. సకిలం ముకులం పెట్టుకొని మేజా మీద వయ్యిల పట్వారీలు కర్నాలు లెక్కలు రాస్తరు. శాయి ముంచుకోని రాసిన కాలంపోయిన తర్వాత తయారైన సిరాబుడ్డిలు వచ్చినయి. సిరాబుడ్డిల శాయితోని మెల్లగ పత్తి పెన్ను మూత తీసిమరలు తిప్పి అండ్ల పోయ్యాలె. చిన్న పెన్ను సన్నం మూతి శాయిని సుతారంగ పోయ్యాలె చానా ఓపిక కావాలె అది అందరితోని కాదు ఓపిక ముతులు పోస్తరు. మెల్లగ పెన్నుకు ఆనిచ్చి నిండెదాక పోయ్యాలె. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంక్ పిల్లర్‌ల వచ్చినయి. ఇంక్ పిల్లర్‌ను సిరాబుడ్డిల ముంచి పెన్నుల పోస్తరు. అప్పుడు పెన్నుతోని రాస్తాంటే మంచిగ అన్పిచ్చేది. పత్తి పెన్ను లోపల సిర గమ్మతిగ పారుతుండె.

పెన్నుకు పత్తి ఉంటది పత్తి ఎనుకనే గడ్డ ఉంటది. ప్లాస్టిక్‌వి కావచ్చు రాస్తుంటే రాస్తుంటే ఆ పెన్ను జర దొడ్డుగ పారేది. దానికో బుర్ర ఉంటది కీసకు పెట్టుకునేతందుకు క్లిప్ ఉంటది. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఆ పాత పెన్నులు దొరుకుతయి. పెన్నులల్ల మస్తు రకాలు ఉంటయి. కట్టె పెన్నుల వలె కనపడే పెన్నులు ఉంటయి. అవి గమ్మతి అన్పిచ్చేది. ఆ తర్వాత పత్తి పెన్నులుపోయినంక రిఫీల్ పెన్నులు వచ్చినయి. పెన్నుల సిరపోసుడు అసలే ఉండది. రిఫీల్స్ వేసికొని పెన్నుతో రాస్తుండేది ఇప్పుడైతే మస్తురకాల పెన్నుల వస్తున్నయి. రిఫీల్ పెన్నుల తర్వాత జెల్ ఇంక్ పెన్నులు వచ్చినయి. తర్వాత జెల్ పెన్నులు కిట్కుం కిట్కుం అని జటార్ పెన్నుల కాలం కొన్ని రోజులు బుర్ర తీసి పెట్టే పెన్నుల కాలం కొన్ని రోజులు నడిచింది. ఇప్పుడైతే పెన్ను అలంకారం అయ్యింది. ఇదివరకు బ్యాంక్‌లల్ల ఆఫీస్‌లల్ల పత్రికా కార్యాలయాలల్ల అందరు పెన్నులే వాడేది ఇప్పుడే ఏ ఆఫీస్‌కు పోయినా రాసేతందుకు పెన్నులు వాడుత లేరు. కేవలం సంతకాలు పెట్టేతందుకే పెన్నులు వాడుతండ్రు ఏదైన కంప్యూటర్‌ల కొట్టుడే నడుస్తుంది. కంప్యూటర్ల కాలం కన్న ముందు టైప్ మిషన్‌ల కాలం కొన్ని రోజులు నడిచింది. కంప్యూటర్ ద్వారా కాని పని ఏమి లేదు అన్ని అండ్లనే బ్రౌజ్ చేసికుంటుండ్రు.

ఎన్కట ఒకటికంటే ఎక్కువ కాపిలు కావాలంటే అచ్చుకాయిదాలు వాడుకునేది. అచ్చుకాయిదం పెట్టి ఒక్కసారి గట్టిగ రాస్తే రెండుమూడు కమ్మలల్ల వచ్చేది. ఆఫీసుల ఇంకా ఎక్కువ కమ్మలు కావాలంటే సైకోస్ట్రెయిల్ మిషన్ ఉండేది దాని మీద ఎన్ని కాయివాలన్న తీయవచ్చు. పెన్నుల ప్రపంచం చాలా పెద్దది అక్షరాలు దిద్దిస్తది. రాత రాపిస్తది. దానితోనే ప్రపంచం నడస్తది. పెన్ను లేనిదే ప్రపంచం లేదు రాత లేనిదే చరిత్ర లేదు శాయి పెన్నుల కన్న ముందు తాటి ఆకు ప్రతుల మీద గంటలతో రాసే ప్రక్రియ ఉండేది. తాటి ఆకును తెంచి సమానంగ కత్తిరిచ్చి వాటి ఎండబెట్టి గంటంతో ఎన్ని కథలు బాగోతాలు రాసినవి ఉన్నవి అవి అన్ని ఆనాటి రాత ప్రతుల వాటి ద్వారా పూర్వకాలపు సాహిత్యం బయటి ప్రపంచానికి తెలిసింది. తాటి కమ్మల మీద రాసిన రాతలు కొన్ని వందల ఏళ్లుగా చెక్కు చెదరక ఉన్నాయి. ఇంకా అంత కన్న ముందు వేల సంవత్సరాలకు పూర్వం శిలాశాసనాల ద్వారా రాజులు అక్షరాలను చెక్కించే వాల్లు వాటి ఆధారంగానే ఆయా ప్రాంతాల చరిత్రను తిరగ రాస్తున్నారు.

రాళ్ళ మీద, తాటి ఆకుల మీద ఆ తర్వాత పేపర్ పరిశ్రమ వచ్చిన తర్వాత బియ్యం పిండితో ఇంక్ తయారు చేసినంక సిరాతో రాసిన కాలం దాటి ప్రస్తుతం రిఫిల్ పెన్నులతో రాస్తున్నం. రాను రానూ పేపర్ లెస్ ఆఫీస్‌లు కాబోతున్నయి. డిజిటల్ ప్రపంచం రాబోతున్న తరుణంలో శాయి, కలం, పత్తి పెన్నుల కాలం గుర్తుకు వస్తున్నాయి. శాయి పెన్నులే గాకుండా పెన్సిల్స్ కూడా ఉన్నాయి ఇవి అప్పుడు ఇప్పుడు ఒక తీరుగ ఉన్నాయి ఇండ్లా కూడా రంగు రంగుల పెన్సిల్లు వచ్చినయి. ఎన్కట బడికి పోతె ఎనిమిదో తరగతలనే కంపాక్స్ బాక్స్ పత్తి పెన్ను సిరాబుడ్డి, ఇంక్ పిల్ల పెన్సిల్ లబ్బర్ పెన్సిల్ చెక్కె బ్లేడులు వాడేవి. ఇప్పుడవన్నీ మోటు అయిపోయి శానిశాని వస్తువులు వాడుతున్నరు.

-అన్నవరం దేవేందర్, సెల్ :9440763479