Home దునియా కలికితురాయి కైకాల!

కలికితురాయి కైకాల!

Kaikala-Satyanarayana

తెలుగు చిత్రసీమలో అతివీర భయంకర విలన్, పౌరాణిక చిత్రాలలో అసమాన ప్రతిభచూపే ప్రతి నాయకుడు, భారీ పర్సనాల్టీ అయినా నటనతో తెరలు తెరలుగా చక్కని నవ్వు తెప్పించే హాస్య నటుడు, అమాయకత్వం ఉట్టిపడే పాత్రలకు జీవం తెచ్చే నటుడు. భార్య చాటు భర్తలా ఒదిగి తగ్గిపోయే పాత్రధారి. అహో యమా! అనిపించుకోగల సత్తా వున్నా నటుడు నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ. కేరక్టర్‌ని అర్థం చేసుకుని సరిగా అతికిపోయే మేకప్, వస్త్రధారణతో, హెచ్చుతగ్గులు లేకుండా సమతూకంతో నవరస భావాలను ఆంగికాభినయాలతో వెలువరించే సిసలైన కేరక్టర్ ఆర్టిస్టు అని కూడా అనిపించుకుంటున్నారు సత్యనారాయణ. సాటి నటీనటుల నుంచి, సమాజ పోకడల నుంచి పొందిన అనుభవాలు, అనుభూతులు, నటనా ప్రయాణంలో గడించిన అనుభవాలు, అందుకోసం తెరవెనుక చేసిన కృషి, ఆ కృషికి తగ్గట్టు పట్టు విడవని పట్టుదల, దీక్షయే ఆయనను నటనలో ఉన్నత శిఖరాలకు చేర్చింది.

హీరోగా పరిచయమైన ‘సిపాయి కూతురు’ చిత్రం 1959లో విజయం సాధించివుంటే ఇలాంటి ప్రతిభగల నటుడుగా వృద్ధి చెందేవారు కాదేమో. సిపాయి కూతురు చిత్ర నిర్మాతకు రాసిచ్చిన అగ్రిమెంటుకి కట్టుబడి వుండకపోయినా హీరోగా ఆయనతో చిత్రాలు నిర్మించాలని, సిపాయి కూతురు కంటే ముందుగా విడుదల చేయాలనుకున్న నిర్మాతలకు ‘నో’ చెప్పకపోయినా, తన తొలి సినిమా హిట్ కాలేదని తెలిశాక తీసుకున్న నిర్ణయం ప్రకారం స్వగ్రామమైన కౌతారంకి వెళ్లి వ్యవసాయరంగంలోను, తనకు ఇష్టమైన రంగ స్థలంపైన కృషిచేయాలనుకున్న అంశాన్ని పట్టుదలతో అమలు చేసినా ఇంతటి ప్రతిభా సంపన్నుడు లభ్యమయ్యేవాడు కాదు. ఆటబొమ్మలు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఎస్.వి.రంగారావు చూపిన అసహనం, విసుగు చూసి సినీనటుడుగా పనికిరానని కృంగిపోయి, వెనక్కి తగ్గిపోయినా ప్రేక్షకులు, చిత్ర పరిశ్రమ పూర్తిగా నష్టపోయేవారు అని చెప్పక తప్పదు. ఎన్.టి.రామారావు తొలిదశలో ప్రోత్సహించకపోయినా, ఆ తరువాత చక్కని అవకాశాలు నటుడిగా వచ్చేలా ఎన్‌టిఆర్ చేయకపోయినా కూడా సత్యనారాయణలోని పరిపూర్ణ నటుడు బయటపడే వాడు కాదు.

జానపద చిత్రం సహస్త్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి చిత్రంలో రాజ కుమారుడు పాత్రకి ఎస్.డి.లాల్ ఎంపిక చేయడం, అది చిన్న పాత్ర అయినా అంగీకరించి రెండవ చిత్రంగా చేయడం మంచి పని అయ్యింది. ఎన్.టిఆర్. పోలికలుతో ఉన్నందున, అప్పటికే ఆయన “అభినందించిన కారణంగా ఆయనతో చిత్రాలు తీసే నిర్మాతలు ఆయనకి డూప్‌గా ఎంపిక చేయడంతో వాటిని అంగీకరిస్తూ కొంతకాలం కొనసాగగలిగారు. సత్యనారాయణలోని నటుడిని గుర్తించి మెల్లిగా మంచి పాత్రలకు సజెస్ట్ చేసేవారు ఎన్.టి.ఆర్. విఠలాచార్యకు జానపద బ్రహ్మగా గుర్తింపు. ఒక సందర్భంలో తనను కలిసిన సత్యనారాయణతో “ఇప్పటికే సెటిల్ అయిన హీరోల పోటీ చిత్ర పరిశ్రమలో చాలా ఎక్కువగా వుంది. ఆ పోటీలో నువ్వు రాణించడం కష్టం. రూట్ మార్చు, విలన్ వేషాలు ఇస్తాను చేసెయ్. ఇంకా ఇతర పాత్రలు వచ్చినా కాదనకు” అన్నారు. అంటూ కనకదుర్గ పూజా మహిమలో విలన్ పాత్రకు నిర్ణయం చేశారు. ఆ చిత్రం హిటల్ అయింది. తొలుత సాధారణ విలన్‌గా, తరువాత నుంచి రాటుదేలిన విలన్‌గా ప్రేక్షకుల నుంచి తిట్లు, శాపనార్థాలు పొందసాగారు. ఈ చిత్రం తర్వాత వేషాలే వేషాలు.

కృష్ణా జిల్లా కౌతవరం గ్రామంలో కైకాల లక్ష్మీనారాయణ దంపతులకు 1935 జూలై 25న జన్మించారు. గుడ్లవల్లేరులో హైస్కూల్ గుడివాడ కాలేజీలో చదువుకునేటప్పుడు సాంస్కృతిక కార్యక్రమాల్లో నాటకాల్లో పాల్గొనేవారు. వాగ్ధాటి, చక్కని పర్సనాల్టీ వున్న వాడిగా పేరుతెచ్చుకున్నారు. ఎన్.టి.ఆర్ పోలికలు వున్నాయని కూడా అనిపించుకున్నారు. 1951 నుంచి 1956 వరకు గుడివాడలోని ది గుడివాడ కాలేజీలో ఇంటర్, బి.ఎ. చదువుకున్నారు. నిజానికి డాక్టర్ కావాలని ఇంటర్‌లో బై.పి.సి తీసుకున్నారు గాని మార్కులు సరిగా రాకపోవడంతో తరువాత బి.ఎ.లో చేరారు. కొందరు కుర్రాళ్లతో కలిసి నాటకాలు వేసేవారు. ప్రభాకర్ నాట్యమండలి తరపున ప్రదర్శితమయ్యే నాటకాల్లో హీరోగా చేసేవారు. ఇంటర్ పరీక్ష రోజున కూడా నాటకంలో పాల్గొన్నందున ఫస్ట్‌క్లాస్ మిస్సయ్యారు కూడా. దాంతో డాక్టర్ కోర్స్‌ని మిస్సయి. బి.ఎ.లో చేరారు. నాటకాల్లో ఉత్తమ నటుడుగానూ ఎంపికయ్యే వారు. అంతేకాదు వారి కుటుంబంలో తొలి గ్రాడ్యుయేట్ అయ్యింది కూడా ఈయనే. పదోతరగతి చదివేరోజుల్లోనే ప్రేమలీలలు నాటకంలో విలన్‌గా నటించి వెండి పతకం సాధించుకున్నారు.

ఎదురుదెబ్బలు
సత్యనారాయణ క్లాస్‌మేట్ కె.ఎల్. ధర్. ఎల్.వి.ప్రసాద్ వద్ద ఆర్డ్ డిపార్ట్‌మెంట్‌లో చేరాడు. అతను ఉత్తరం రాస్తే ‘కొడుకులు- కోడళ్లు చిత్రంలో వేషం వస్తుందని మద్రాసు చేరుకున్నారు. కె.బి.తిలక్ తీస్తున్న ఎం.ఎల్.ఎ. చిత్రంలో సెకెండ్ హీరో వేషం కోసం ప్రయత్నించారు. రెండూ మిస్సయ్యాయి. భూకైలాస్‌లో కూడా వేషం వచ్చినట్టే వచ్చి మిస్సయ్యింది. పట్టుదల పెరిగి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. చిన్న వేషమైనా వేసి, నేనూ సినిమాల్లో నటించా’ అని ఊళ్లో చెప్పుకుని వ్యవసాయం చేసుకుందామనుకున్నాము అన్నీ ఎదురుదెబ్బలే. ఎం.ఎల్.ఎలో సెకెండ్ హీరో ఛాన్స్ రమణమూర్తికి, కె.వి.రెడ్డి ఇస్తానన్న విలన్ ఛాన్స్ ఆర్.నాగేశ్వరరావుకి దక్కాయి. కళ్ల నీళ్లు పెట్టుకున్న సత్యనారాయణను చూసిన కె.వి.రెడ్డి కొందరికి సిఫారసు చేస్తే అందులో దేవదాసు, చిరంజీవులు చిత్రాల నిర్మాత అయిన డి.ఎల్. నారాయణ మూడేళ్ల అగ్రిమెంట్ రాయించుకుని సిపాయి కూతురు చిత్రంలో జమున సరసన హీరోగా నిర్ణయించారు. డి.ఎల్. ఎంపిక చేయగానే అచ్చం ఎన్.టి.ఆర్ వలె వున్నాడంటూ ఆరుగురు నిర్మాతలు తమ చిత్రంలో హీరోగా ఫిక్స్ చేయడానికి వస్తే డి.ఎల్. అంగీకరించలేదు. ఆ తరువాత డి.ఎల్. సరే అన్నా సిపాయి కూతురు ఫలితం చూసిన నిర్మాతలు వెనక్కి తగ్గారు.

బి.ఎన్.రెడ్డి తీసిన ‘రాజమకుటం’లో ఒక వేషం లభించింది. విఠలాచార్య సూచనతోనే మోడరన్ థియేటెర్స్ వారు సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణిలో వేషం ఇచ్చారు. ఆదరించిన ఎన్.టి.ఆర్. ఎన్.టి.ఆర్‌తో తొలి పరిచయం ఏ క్షణాన జరిగిందో గాని ఆయన అండదండలతోనే చిత్రరంగంలో ఎదిగారు. తెలుగుదేశం పార్టీ పెట్టాక రాజకీయరంగంలోగాని చక్కగా ఎదిగారు. ఎన్.టి.ఆర్ తన స్వంత తమ్ముడి కంటే ఎక్కువగా అభిమానించేవారు. ఆయన దగ్గరకు డైరెక్ట్‌గా ఏ సమయంలోనైనా వెళ్లగలిగేంత చనువు ఇచ్చేవారు ఎన్.టి.రామారావు. పార్టీ పెట్టినప్పుడు “చివరి వరకు తోడుగా వుండాల్సిన వాడివి నువ్వే” అని సత్యనారాయణతో అన్నందుకు చివరివరకూ ఎన్.టి.ఆర్‌తోనే వుండి తరువాత రాజకీయాలకు దూరం అయ్యారు.

నా వారసుడు నువ్వే అన్న ఎస్.వి.ఆర్
ఆటబొమ్మలులో నటించేటప్పుడు ఎస్.వి.ఆర్ చూపిన అసహనం, చిరాకు గురించి పట్టించుకోకుండా ఆయనను గురువుగా భావించి ప్రత్యక్షంగా పరోక్షంగా నటన, డైలాగ్ డెలివరీలో పాఠాలు నేర్చుకున్నారు. బొద్దుగా వుండే శరీరమే అయినా సాధనతో దాన్ని, తన స్వరాన్నీ స్వాధీనం చేసుకుని, వివిధ రకాలుగా వంచి, ప్రయోగాలు చేసి నటనాపరంగా విజయం సాధించసాగారు. అందువల్లనే కాబోలు ‘దేవుడు చేసిన మనుషులు’ చూసిన ఎస్.వి.ఆర్ హఠాత్తుగా సత్యనారాయణ ఏదో సినిమా షూటింగ్‌లో వుంటే పెళ్లి ‘చక్కని నటన ప్రదర్శించావు” అని అభినందించి అంతే హడావుడిగా వెళ్లిపోయారు ఆ తరువాత ఇద్దరూ కలిసి అందరూ దొంగలే చిత్రంలో నువ్వానేనా అన్నట్టు నటించారు. ఆ చిత్రం రష్ చూసిన ఎస్.వి.ఆర్, సత్యనారాయణతో మాట్లాడుతూ “డైలాగ్ డెలివరీ, నటన అన్నీ అభివృద్ధి చేశావు. పౌరాణిక చిత్రాల్లోని నా పాత్రలను, నా డైలాగ్ మాడ్యులేషన్‌ని అనుసరిస్తే ఇక నీకు తిరుగుండదు” అని సలహా ఇచ్చి “ఇక నా వారసుడువి నువ్వే” అని కూడా ప్రకటించారు. ఆటబొమ్మలు టైమ్‌లో కళ్లనీళ్లు పెట్టిస్తే, అందరూ దొంగలే చిత్రం చూసి అభినందించడం ద్వారా ఆనందంతో కళ్ల నీళ్లు పెట్టించారు ఎస్.వి.ఆర్. తాయారమ్మ బంగారయ్య చిత్రం శతదినోత్సవ సభలో శివాజీగణేశన్ ప్రసంగిస్తూ “ఎస్.వి.ఆర్ చిత్రరంగంలో గ్రేట్. సత్యనారాయణ ఈజ్ సత్యనారాయణ ప్లస్ ఎస్.వి.ఆర్.” అని అభినందించడం విశేషమే కదా! కొన్ని కన్నడ చిత్రాలతో హిందీ చిత్రాలతో కలిపి ఇప్పటివరకు 779 చిత్రాల్లో నటించారు. ఎంతో మంచి వేషం అని అనుకుంటేనే ఇటీవలకాలంలో అంగీకరిస్తున్నారు.

శ్రీకృష్ణావతారం, కురుక్షేత్రం చిత్రాలలో సుయోధనుడుగా, నర్తనశాలలో దుశ్శాసనుడుగా, శ్రీకృష్ణార్జున యుద్ధంలో కర్ణుడుగా, లవకుశలో భరతుడుగా, దానవీర శూర కర్ణలో భీముడుగా, సీతాకల్యాణం, సీతారామవనవాసం, శ్రీరామ్ వనవాస్, సీతా స్వయంవర్ చిత్రాలలో రావణ బ్రహ్మగా, వీరాభిమాన్యులో సైంధవుడిగా, శ్రీమద్విరాట్ పర్వంలో భీముడు, ఘటోత్కచుడుగా మెప్పించారు.
సోషల్ ఫాంటసీ చిత్రాలైన యమగోల, యముడికి మొగుడు, యమలీల చిత్రాలలో యముడుగా తన ప్రత్యేకత చూపారు.
శ్రీరంగనీతులు, తాయారమ్మ బంగారయ్య, నారీ నారీ నడుమ మురారి, బొబ్బిలి బ్రహ్మన్న వంటి చిత్రాలలో హాస్యం కలగలిపిన పెద్దరికం ఉట్టిపడే పాత్రలు, బొబ్బిలిపులి, నాదేశం, కొండవీటి సింహం, అడవిరాముడు, రావుగారిల్లు, సిపాయి చిన్నయ్య, బంగారు కుటుంబం, కొండవీటి రాజా, ఆఖరి పోరాటం వంటి చిత్రాలలో ప్రతి నాయకుడుగా, వారాలబ్బాయి, సీతారత్నంగారి అబ్బాయి, కొండవీటి దొంగ, భైరవద్వీపం మున్నగు చిత్రాలలో సాత్విక పాత్రలలో మెప్పించారు.

కథానాయిక మొల్లలో శ్రీకృష్ణదేవరాయులుగా, చాణక్య చంద్రగుప్తలో రాక్షసమంత్రిగా, సామ్రాట్ అశోక్‌లో ఉజ్జయిని మహారాజుగా చారిత్రక పాత్రల్లో తన అభినయంతో అలరించారు. ‘నిప్పులాంటి మనిషి’లో ఖాన్ దాదాగా స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం అంటూ ఎన్.టి.ఆర్‌ని చూస్తూ పాడినప్పటి నటన చేసిన అభినయం ఆయన చేసిన వాటిల్లో ఒక కలికితురాయి. ఎన్నో కేరక్టర్ రోల్స్ చేసి తన ప్రత్యేకతలు చూపారు నటనాపరంగా, గెటప్‌లు పరంగా, వాచకం పరంగా.

-వి.ఎస్. కేశవరావు, సెల్‌ః 9989235320