Home దునియా కాఫీ బ్రేక్

కాఫీ బ్రేక్

Woman

యండమూరి చాలా ఏళ్ల క్రితం రాసిన ‘మీరు మంచి అమ్మాయి కాదు’. అనే పుస్తకం ఒకటి చాలా బావుంటుంది.  నిజానికి ప్రతి అమ్మాయి అది చదవాలి.‘ఊరుకో అమ్మా! నీకేం తెలీదు’ అని పిల్లలు అంటే, అదేదో డిగ్రీ అన్నట్టే నవ్వేసే తల్లి, మా ఆవిడో వెర్రి మాలోకం అని భర్త అంటే ఉప్పొంగిపోయే భార్య, ఇలా చాలా పోస్ట్‌ల్లో ఉన్న మహిళలు చాలామంది కనిపిస్తారు. వాళ్లందరిలో ఎక్కడో ఒక చోట మనం కనిపిస్తాం.

పుష్యమి పన్నెండేళ్ల పాప. పట్టులంగా, రెండు జడలు, ఒక జడకి, జడ మోయలేనంత బరువున్న పసుపు చేమంతుల చెండుతో గజ్జెలు ఘల్లు ఘల్లుమనుకుంటూ వచ్చింది. చిన్నప్పుడు మేం కూడా అలా చేమంతుల చెండ్లు పెట్టుకున్నవాళ్లమే. పుట్టినరోజు వస్తే రెండు జడలూ పూలతో నిండిపోయేవి. స్నేహితురాళ్లందరూ పూలు తెచ్చి ఇచ్చి పుట్టినరోజు పాప స్పెషల్‌గా కనిపించేట్టు చేసేవారు.

అవన్నీ గుర్తు వచ్చి పుష్యమిని అడిగాను. ‘నీకిష్టమేనా చేమంతులు పెట్టుకోవడం అని. ‘నాకసలు ఇష్టం ఉండదు. కాని మా అమ్మ పెడుతుంది.’ అంది. నిజమే. అందరికీ ఇష్టం అవాలని లేదు కాని రంగు రంగుల పూలు, సువాసనలు వెదజల్లే పూలు పెట్టుకోవడం చాలామంది ఆడపిల్లలకు ఇష్టమే. అయినా ఇప్పుడు ఆడపిల్లలు అలా అన్ని పూలు పెట్టుకోవడాన్ని ఇష్ట పడట్లేదు. ఆ మాటే అంటే, వాళ్ల బాబాయ్ పాపని దగ్గరకు తీసుకుని ముద్దు చేస్తూ, మా బంగారు తల్లిని అచ్చమైన ఆడపిల్లలా పెంచుతున్నాం. చూడు ఎంత లక్షణంగా ఉందో’ అంటున్నాడు.

లక్షణంగానా..అంటే? అన్న నా ప్రశ్నకు జవాబుగా ఈమధ్య సామాజిక నెట్‌వర్క్‌ల్లో రౌండ్లు కొట్టే పోస్ట్‌ల్లో ఒకటి పంపించాడు.
ఆడపిల్లకు ముక్కుమీద కోపం అని ముక్కు కుట్టేస్తారు
చంచల స్వభావం ఎక్కువ కాబట్టి కాలి మెట్టెలు వేస్తారు
అహంకారంతో చెవులు వినబడవని చెవులు కుట్టించి చెవిపోగులు వేస్తారు
నీటిలో చేపల శబ్దం వినిపిస్తుంది గాని అమ్మాయి నడుస్తున్నట్టు
వినబడదని గజ్జెలు వేస్తారు
అమ్మాయి మనసు అతిశయంతో ప్రవర్తించకూడదని పెళ్లి,
మంగళసూత్రం, పసుపు, కుంకుమ, బంధాలు అనేవాటితో బంధిస్తారు
మగవారికి ఇవన్నీ అవసరమే లేకుండా ‘భార్య’ అనే ఒకే ఒక్క ఆభరణం మగాడికి
కట్టబెట్టి భర్త అహంకారం, రోషం, కోపం అన్నీ చల్లబడేట్టు చేస్తారు

ఇది చదివితే ఏ మహిళకైనా కడుపు రగిలిపోతుంది. పెద్ద జడ ఉంచుకుంటారా, చిన్న పోనీటైల్ వేసుకుంటారా అన్నది ఎవరిష్టం వారిది. నచ్చితే పూలు పెట్టుకుంటారు. లేకపోతే లేదు. మేకప్ వేసుకోవడం, అందంగా ఉండటం వారికిష్టం అయితే చేసుకుంటారు. అందం, అలంకరణ అనుకున్న వాటికి విపరీతార్థాలు తీయడం ఏంటి. ముక్కు, చెవి, కాళ్లు, మెడతో పాటు మనసును కూడా వదల్లేదు. వీళ్లెవరండీ ఇవన్నీ వేసి ఆడపిల్ల మనసున్న మనిషిగా కాదు, ఏదో మేకపిల్ల అన్నట్టే ఇటువంటి పిచ్చి మాటలను ఎందుకు ప్రోత్సహిస్తున్నారని చాలాసేపు అతనితో వాదించినా లాభం లేదనిపించింది. పైగా ‘మేం చూడటానికే కదా అమ్మాయిలు అందంగా తయారయ్యేది. అందుకే చూస్తాం. లేకపోతే మేకప్ ఎందుకు వేసుకుంటారు? మమ్మల్ని ఆకర్షించడానికే కదా.’

నిజానికి ఇటువంటి దిగజారుడు భావనలు అతనొక్కడివే కాదు. ఒక్కరివే అయితే అతని బుద్ధి అంతవరకే పనిచేస్తుందని వదిలేయచ్చు. కాని మనలో ఎక్కడో కొంతమంది తప్ప అందరికీ అదే భావన. అమ్మాయి కట్టు బొట్టు తీరుతో వినయంగా, విధేయతతో తలవంచుకుని నడిచి, అవసరం ఉన్నా లేకపోయినా సిగ్గు పడుతూ ఉంటే సంప్రదాయం అని చెప్తూ వచ్చిన వస్త్రధారణ మాత్రమే చేసుకుంటే ‘మంచి అమ్మాయి’ ముద్ర వేస్తారు. ఈ ట్యాగ్ కోసం ఆడపిల్లలు ఏమైనా చేసేట్టు, ఎన్ని త్యాగాలైనా చేసేట్టు ఫుల్‌గా ట్రైనింగ్ ఇస్తారు.

యండమూరి చాలా ఏళ్ల క్రితం రాసిన ‘మీరు మంచి అమ్మాయి కాదు’. అనే పుస్తకం ఒకటి చాలా బావుంటుంది. నిజానికి ప్రతి అమ్మాయి అది చదవాలి.‘ఊరుకో అమ్మా! నీకేం తెలీదు’ అని పిల్లలు అంటే, అదేదో డిగ్రీ అన్నట్టే నవ్వేసే తల్లి, మా ఆవిడో వెర్రి మాలోకం అని భర్త అంటే ఉప్పొంగిపోయే భార్య, ఇలా చాలా పోస్ట్‌ల్లో ఉన్న మహిళలు చాలామంది కనిపిస్తారు. వాళ్లందరిలో ఎక్కడో ఒక చోట మనం కనిపిస్తాం. గత కొన్నేళ్లుగా గురువుల ట్రెండ్ ఊపందుకుంది.

చదవేస్తే ఉన్న మతి పోయినట్టు వ్యక్తి పూజలకి, మూఢ నమ్మకాలకి పెద్ద పీట వేయడం ఫ్యాషన్ అయిపోయింది. ఛానళ్లు వీళ్ల పేరు చెప్పి బాగా సంపాదించుకుంటున్నాయి. టీవీ పెడితే ప్రవచనాలు చెప్పే గురువులు చాలామంది. ఒకసారి…దీర్ఘాలు తీస్తూ మాట్లాడే ఒక గురువు , ‘ఇవాళ, రేపు ఆడపిల్లలు ఎంతగా బరితెగించిపోయారండీ! హవ్వ! సిగ్గు మొహమాటం ఏవీ లేవండి. అంతకుముందు మగవాళ్లని చూస్తే అడవాళ్లు పక్కకి తప్పుకుని పోయేవాళ్లు. కాని ఇప్పుడు, నేను, యాభై ఏళ్ల వాడ్ని, నన్ను పూర్తిగా రాసుకుంటూ, పూసుకుంటూ నడుస్తున్నారు.

రామ రామ! ఎటువంటి కాలం వచ్చిపడింది.’ అని చెమట తుడుచుకుని ఆపసోపాలు పడ్డాడు. అసలు మగవాళ్లని చూస్తే పక్కకి తప్పుకోవడం ఎందుకు? ఆయన్ని రాసుకుపూసుకోవాలనే ఉబలాటం అమ్మాయిలకెందుకు ఉంటుంది? జనాల్లో అక్షరాస్యత పెరిగి భార్యని ‘ఒసే’ అని పిలిచే సంస్కార హీనత్వం నుంచి బయటకు వచ్చి భార్య చేత ఒరే అని పిలిపించుకుని మురిసిపోయేవారున్నారు.

ఏమాత్రం ఆడ,మగ తేడా లేకుండా జీవితంతో పాటు ఇంటి పని, బాధ్యతల్లో పాలుపంచుకునే ఆధునిక మగవాళ్లు చాలామందే ఉన్నారు. జనం అంతకు ముందు ఉన్న చెత్త ఆలోచనా ధోరణి ఎక్కడ మర్చిపోతారో అనుకుని ఇలాటి వారు సంప్రదాయం పేరిట ఆడవాళ్లని మళ్లీ ఏవిధంగా అణచాలో, గాటకి కట్టేసినట్టుగా ఎలా చూడాలో చెప్పడానికి, అందర్నీ ఇంకో వందేళ్లు వెనక్కి తీసుకుపోడానికి నడుం బిగించారు. వాళ్లని అనుసరించే మా చుట్టాలతను లాటివాళ్లు కోకొల్లలు. అయినా ఆడపిల్లల మీద పడి బతకడం, వారికి హద్దులు గీసుకోవడం తప్ప సమాజానికి ఇంకే పని లేనట్టుంది!

-సిరి చాగంటి