Home ఎడిటోరియల్ ప్రజాసంబంధాల శిక్షణ మృగ్యం

ప్రజాసంబంధాల శిక్షణ మృగ్యం

Education

“ప్రజాసంబంధాల వృత్తి విషయకమైన విద్య, శిక్షణ, అనుభవంతో తమ యాజమాన్యానికి లేదా క్లయింటుకు లేదా ప్రజలకు మార్గదర్శనం చూపే నిజమైన ప్రజా సంబంధాల వృత్తి నిపుణులని” అమెరికన్ పబ్లిక్‌రిలేషన్స్‌కు ఆద్యుడైన ఎడ్వర్డ్ ఎల్. బెర్నేస్ అన్నారు. భారత్‌లో పి.ఆర్.వృత్తి నిపుణులు ఈ కొలమానాన్ని అంగీకరిస్తారా? అంటే నా సమాధానం అవును, కాదు రెండూ.
భారతదేశంలో ప్రజాసంబంధాల రంగం పరిమాణం ఆరు బిలియన్ డాలర్లు అంటే సుమారు రూ॥ 35,000 కోట్లు. ఇది ఏటా 32 శాతం పెరుగుతుందని అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా సర్వే తేల్చింది. భారతదేశంలో ప్రజా సంబంధాల రంగం స్థాయిని గురించి చెప్పాలంటే మిశ్రమమైన అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఒక వైపు ప్రపంచంలో ఎవరికీ తీసిపోని రీతిలో అత్యంత నైపుణ్యం కలిగిన వారున్నారు. అదే సమయంలో తగిన ప్రజాసంబంధాల విద్యార్హత, శిక్షణ, అనుభవం లేనివారు కూడా గణనీయంగా వున్నారు. 40 శాతం మంది వృత్తి, నిపుణులకు మాత్రమే పి.ఆర్ విద్యార్హత వున్నట్లు ఒక విశ్వ విద్యాలయం చేసిన సర్వేలో తేలింది. అటువంటి వారు ప్రజా సంబంధాల వృత్తికి మంచిపేరు తేగలవారు సంఖ్యలో తక్కువగా వున్నారు. విద్యార్హత లేని వారిని ‘స్పిన్ డాక్టర్స్‌గా’ లేక ‘మ్యానిపులేటర్స్’ గా పరిగణిస్తారు. పి.ఆర్. నాణ్యత దృష్టితో చూస్తే నిలిచే వారు కారు. ఇప్పుడు కావలసింది వృత్తి పరమైన శ్రేష్టత, నైపుణ్యం. ప్రజా సంబంధాల వృత్తిలో రాణించడానికి విద్య, శిక్షణ, పరిశోధనలు త్రిగుణీకృతం గా సాగవలసిన అవసరం వుండగా, ఆ మాటే కానరావడం లేదు.
పి.ఆర్.విద్యః ఈనాడు మన ప్రజాసంబంధాల వ్యవస్థలో పి.ఆర్. విద్య, “జర్నలిజం కోర్సులో ఒక భాగంగా వున్న పబ్లిక్ రిలేషన్స్ ఈనాడు విస్తారంగా, ప్రత్యేకమైన వృత్తిగా అభివృద్ధి చెందింది. ఇది జర్నలిజంలో భాగం ఎంత మాత్రం కాదు. ప్రజాసంబంధాలకోసం ప్రత్యేకమైన, స్వతంత్య్రమైన కోర్సు చాలా అవసరం” అన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయం మాజీ డీన్ ఆచార్య పి.ఎల్. విశ్వేశ్వరరావు. మన దేశంలో ప్రజా సంబంధాల విభాగాలు రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులు మొదలుకొని జిల్లా కలెక్టరు వరకు విస్తరించాయి. ప్రభుత్వ ప్రతిష్టను పెంచడానికి ప్రజా సంబంధాల వ్యవస్థను ఇతోధికంగా వినియోగించుకుంటున్నప్ప టికి, ప్రజాసంబంధాల విద్య మాత్రం ఇంకా శైశవ దశలోనే వుంది. ప్రభుత్వ సహకారం ఏ మాత్రం లభించడం లేదు. 100కు పైగా విశ్వవిద్యాలయాల్లో కమ్యూనికేషన్, జర్నలిజం శాఖలున్నాయి. ప్రజాసంబంధాలను జర్నలిజం కోర్సులో ఒక అధ్యయనాంశంగా మాత్రమే బోధిస్తున్నారు. ఒక అంశంగా చదువుకొన్న వ్యక్తి ఎవరైనా పూర్తిస్థాయి పి.ఆర్.ఓ.గా రాణించగలడా? అనేది ఒక పెద్ద ప్రశ్న. ఒక అంశాన్ని ఇక్కడ ప్రస్తావించక తప్పదు. హైదరాబాద్‌లోని డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎం.ఎ మాస్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ కోర్సు ప్రారంభిస్తామని ప్రతిపాదన పంపితే ఆ కోర్సు తన ఆమోదిత కోర్సు జాబితాలో లేదని యు.జి.సి అందుకు తిరస్కరించింది. పాశ్చాత్యదేశాల్లో ప్రధానంగా అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలోనూ ఒక మేజర్ పాఠ్యాంశంగా, పి.జి స్థాయిలోనూ ఎం.ఎ పి.ఆర్, ఎం.ఎస్. సి.పి. ఆర్ వంటి కోర్సులను నిర్వహిస్తున్నారు. కాబట్టి మన దేశంలోని విశ్వవిద్యాలయాలు కూడా ఆ పద్ధతిలో పబ్లిక్ రిలేషన్స్ కోర్సులను ప్రవేశపెట్టాలి. ఆ కోర్సులకు అంతర్జాతీయ ప్రమాణాలతో పాఠ్య పుస్తకాలు కూడా తేవాలి.
శిక్షణ ః భారతీయ ప్రజాసంబంధాల్లో మరొక లోపమేమంటే ప్రజా సంబంధాల అధికారులకు ఉద్యోగ ప్రవేశ కాలంలోగాని, తర్వాత గాని ఎటువంటి శిక్షణ లేదు. నిజానికి అధికారులు సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలంటే వాళ్ళకు కావలసింది ప్రధానంగా శిక్షణ, తత్సంబంధిత పరిజ్ఞానం. దీనివల్ల మెరుగైన పనితీరుకు నాణ్యత మెరుగుదల, కార్యదక్షత సాధ్యమవుతుంది. ప్రజాసంబంధాల అధికారులు పంపే 90శాతం పత్రికా ప్రకటన లు, పత్రికల్లో ప్రచారయోగ్యంగా ఉండటం లేదని ఒక ప్రధాన సంపాదకుడు అన్నారు. ప్రతి కాపీని తిరగరాసుకోవాల్సి వస్తోంద న్నారు. ప్రజా సంబంధాల వృత్తి నిపుణులకు తగిన శిక్షణ ఉండాలనే ఆవశ్యకతను పై మాటలు సూచిస్తున్నాయి. సుమారు లక్షమంది ప్రజా సంబంధాల వృత్తి నిపుణులే కాకుండా వివిధ శాఖల పరిధిలో సుమారు మరో 40 లక్షలమంది కమ్యూనికేటర్స్ తమ విధి నిర్వాహణలో భాగంగా ప్రజలకు సమాచార అనుసంధాన కర్తలుగా ఉంటూ, ప్రజాస్వామ్య ప్రక్రియలో, అభివృద్ధి కార్యక్రమాల అమలులో క్రియాశీలంగా ప్రజలను ప్రభా వితం చేస్తున్నారు. ఇంతటి బృహత్తర విధుల్లోవున్న వీరికి తగిన శిక్షణ లేకపోతే తగిన ప్రభావం చూప లేరు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇండియన్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, న్యూఢిల్లీ తరహాలో రాష్ట్ర రాజధానుల్లో మాస్ కమ్యూనికేషన్ అకాడమీలను ఏర్పాటు చేసి ప్రజాసంబంధాల శిక్షణ, పరిశోధన కోసం కృషి చెయ్యాలి. కార్పోరేట్లు కూడా తమ పి.ఆర్. కమ్యూనికేషన్ సిబ్బంది శిక్షణ కోసం నిధులు కేటాయించాలి.
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ అమెరికా ఒక “ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ గైడ్‌” ను వెలువరిస్తుంది. అందులో తమ సభ్యుల ప్రయోజనార్థం వృత్తివిద్యాకోర్సుల సమస్త సమాచారాన్ని, వాటిల్లో శిక్షణ వివరా లను ప్రచురిస్తుంది. అందులో సభ్యులు, శిక్షణ శిబిరాలు, ప్రసంగాలు, అంతర్జాతీయ పి.ఆర్. కాన్ఫరెన్సులు, టెలీ సెమినార్లు, ఇలెర్నింగ్ మొదలైన వివరాలుంటాయి. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా కూడా అటువంటి ట్రైనింగ్ మోడల్‌ను రూపొందించి అందజేస్తే, సభ్యు లు తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు అవకాశం వుంటుంది.
పరిశోధనః మన దేశంలో ప్రజాసంబంధాల రంగంలో పరిశోధన, కార్యక్రమాల ప్రభావ విశ్లేషణ లేకపోవడం పెద్ద లోటు. నిజానికి ప్రజాసంబంధాల యావత్ ప్రక్రియ పరిశోధన, ప్రణాళిక, కమ్యూనికేషన్, మదింపు ఆర్‌పి సిఇ మోడల్ ప్రాతిపదికపై నడుస్తుంది. వీటిలో ప్రణాళిక, కమ్యూనికేషన్ వరకు పూర్తిగా వినియోగించుకుంటున్నారు. కాని పరిశోధనను మరియు మదింపును పూర్తిగా విస్మరిస్తున్నారు. ప్రతిష్టను పెంచుకొనేందుకు ప్రభుత్వాలు, కార్పోరేట్లు కోట్ల కొలది రూపాయలను అడ్వర్డయిజింగ్‌కు ఖర్చు చేస్తున్నాయి. కాని ప్రజలపై వాటి ప్రభావం గురించి అధ్యయనం లేదు. పి.ఆర్ క్యాంపెయిన్లను కూడా విశ్లేషించి అవి ఏ మేరకు ఫలితాలనిచ్చాయో మదింపు చెయ్యడం కూడా చాలా అవసరం.
పబ్లిక్ రిలేషన్స్ రంగం తన ప్రభావాన్ని గణాంకాల్లో సైతం వివరించనంతకాలం ఆ రంగానికి పూర్తి గౌరవం లభించదని బిబిడిఓ అనే ఒక అంతర్జాతీయ సంస్థ తన సర్వేలో తేల్చిచెప్పింది. కాబట్టి పరిశోధన పరిశ్రమతో కూడుకున్నదే కావచ్చు కాని పి.ఆర్ స్వభావాన్ని, ప్రభావాన్ని బట్టి సామర్థాన్ని అంచనాగట్టే వాతావరణంలో అవరోధాలన్నిటినీ దాటి అద్భుత వృత్తి నిపుణులని పేరు పొందాలంటే దారి చూపేది పరిశోధన ఒక్కటే. ప్రతి ప్రజా సంబంధాల శాఖ, ప్రతి పి.ఆర్ సంస్థ ప్రజాసంబంధాల కార్యక్రమాల విజయాలను చాటి చెప్పడానికి పరిశోధనా విభాగాన్ని తప్పక ఏర్పాటు చేసుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా, విశ్వ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న మన దేశంలో ప్రజాసంబంధాల వృత్తికి ఉజ్వల భవిషత్తు ఉంది. అయితే ప్రభుత్వం, కార్పోరేట్లు ఒకవైపు, విద్యాసంస్థలు, పి.ఆర్ వృత్తి నిపుణుల సంఘాలు పి.ఆర్ విద్య, శిక్షణ, పరిశోధనకు తగిన నిధులిచ్చి వాటిని చేపట్టినప్పుడే ఆ భవిష్యత్తును అందుకోవడం సాధ్యం.
(నేడు జాతీయ ప్రజాసంబంధాల విద్యాదినోత ్సవం)