Home జాతీయ వార్తలు దూకుడు తగ్గించడమా ప్రసక్తే లేదు

దూకుడు తగ్గించడమా ప్రసక్తే లేదు

Dukudu_manatelanganaచెన్నై : ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న భారత టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి తన దూకుడు తగ్గించే ప్రసక్తే లేదని మరోసారి స్పష్టంచేశాడు. పాక్‌తో జరిగిన ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో శతకం బాదిన విరాట్ ఆ తరువాత ఒక్క అర్ధశతకం కూడా నమోదుచేయలేకపోయాడు. ఇక తాజాగా ఆస్ట్రేలియా-ఎతో శనివారం ముగిసిన రెండో అనధికార టెస్టులోనూ ఆడిన కోహ్లి రెండు ఇన్నింగ్స్‌ల్లో(16, 45) కలిపి 61 పరుగులే చేశాడు. ఈ మ్యాచ్‌లో భారత్ పదివికెట్ల తేడాతో ఓటమి కూడా చవిచూసింది. ఈ సందర్భంగా జట్టు విజయాల కోసం నీ దూకుడు తగ్గించుకుంటావా అని కోహ్లిని అడిగిన ఓ ప్రశ్నకు ఏ మాత్రం తడబడకుండా ఆ ప్రసక్తే లేదని నిర్మొహమాటంగా తేల్చిచెప్పాడు.‘ జట్టుకు విజయం అందించాలనే బలమైన కోరికతోనే బరిలోకి దిగే ప్రతి మ్యాచ్‌లోనూ బాధ్యతాయుతంగా ఆడతాను. కాబట్టి దూకుడు తగ్గించుకునే అవసరం లేదు. నా కెరీర్ కొనసాగి నంత కాలం నేను నాలాగే ఉంటాను. బాధ్యతా యుతంగా ఆడుతున్నాను కాబట్టే బిసిసిఐ కూడా జట్టు నాయకత్వ బాధ్యతలు అప్పగించిందని’ కోహ్లి అన్నాడు. మైదానంలో ఫిల్డీంగ్ చేసినా, క్రీజులో బ్యాటింగ్ చేసినా జట్టు విజయం కోసం 100 శాతం కృషి చేస్తానన్నాడు. ఇక శ్రీలంక పర్యటన గురించి మాట్లాడిన కోహ్లి.. శ్రీలంక పర్యటన మాకు కఠిన పరీక్షలాంటిది. మాది యువ జట్టు. జట్టులో చాలామంది ఆటగాళ్లు తమ స్థానాలు సుస్థిరం చేసుకోవాలని భావిస్తున్నారు. శ్రీలంక సవాల్ ఎదుర్కొవడానికి జట్టు మొత్తం ఆతృతతో ఎదురుచూస్తోంది. ఈ సిరీస్ కోసం ప్రతిఒక్కరూ బాగా సన్నద్ధమయ్యారని తెలిపాడు.