Search
Wednesday 14 November 2018
  • :
  • :

ఎండ్రికాయలు ఎన్ని రంగులో…

Colored-lobster

ఒకటో ప్రపంచ యుద్ధ సమయంలో ఎండ్రి కాయలను సముద్రపు బొద్దింకగా వ్యవహరించేవారు. కేవలం ఖైదీలు, శరణార్థులు, బానిసలు మాత్రమే వీటిని ఆహారంగా తీసుకునేవారు. తర్వాత కాలంలో ధనవంతులు, ఉన్నత వర్గాలవారు వీటిని ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టారు. సముద్రంలో నుంచి బయటకు తీసినప్పుడు ఇవి మట్టి గోధుమ, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. వండగానే ఇవి ముదురు గులాబీ లేదా ఎరుపు రంగులోకి మారతాయి. అయితే ఎండ్రికాయల్లో అనేక రకాలున్నాయి. వివిధ రంగుల్లో ఇవి లభిస్తాయి. కాని ఈ రకాలు చాలా అరుదుగా కనిపిస్తాయి.

నీలి రంగు ఎండ్రికాయలు
నోవా స్కోటియా తీరంలో కెనడాకు చెందిన ఇద్దరు మత్సకారులకు ఈ నీలం రంగు ఎండ్రిలు వలలో పడ్డాయి. ఈ రంగువి వలలో పడడం అదృష్టంగా భావిస్తారు.మిలియన్లలో ఒకరికే ఆ అదృష్టం ఉంటుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. నీలిరంగు ఎండ్రికాయలే అరుదు అంటే మరిన్ని రంగుల్లో ఇవి లభిస్తాయన్నది ఆశ్చర్యపరిచే విషయం.

ఎరుపు ఎండ్రికాయలు
నీలం రంగు వాటి కంటే ఎరుపువి మరింత అరుదైన జాతి. వీటిని జీవించి ఉండగా ఉడికిస్తే, గులాబీ రంగులోకి మారిపోతాయి. ఇవి పది మిలియన్ల మందిలో ఒకరికి దొరికే అవకాశం ఉంటుంది.

పసుపు రంగు ఎండ్రికాయ
ఎరుపు రంగు కంటే అరుదైనది పసుపు రంగు ఎండ్రికాయ. 30 మిలియన్లలో ఒకరికివి దొరికే అవకాశం ఉంటుంది. ఈ రంగు ఎండ్రికాయ 2014లో అమెరికాలోని ఒక సూపర్ మార్కెట్ లాబ్‌స్టర్ ట్యాంక్‌లో అగుపించడంతో దాన్ని తిరిగి సముద్రంలో వదిలేశారు.

హాఫ్ అండ్ హాఫ్ ఎండ్రికాయ
ఈ రకమైన ఎండ్రికాయలు రెండు రంగుల్లో ఉంటాయి. వాటి శరీరం మధ్యలో నుంచి రెండుగా చీలి చెరో వైపు ఒక్కో రంగులో ఉంటాయి. ఈ రకమైన ఎండ్రికాయలు చాలా చాలా అరుదైనవి. కొన్ని సగం నీలి రంగు, మిగతా సగం కాలికో రంగులో ఉంటాయి. వాటి జీన్స్‌లో రెండు రకాలు కలవడం వల్లే ఈ రెండు రంగుల ఎండ్రికాయలుంటాయని పరశోధకుల భావన. అయితే ఈ రకమైన ఎండ్రికాయలు యాభై మిలియన్లలో ఒకటి ఉంటాయి.

అల్బినో లాబ్‌స్టర్
చాలా సంవత్సరాల క్రితం ఇంగ్లండ్ లోని డోర్‌సెట్ తీరంలో ఇద్దరు మత్సకారుల వలలో ఈ అల్చినో ఎండ్రికాయలు చిక్కాయి. వీటినే క్రిస్టల్ లాబ్‌స్టర్స్ అని కూడా పిలుస్తారు. వండగానే ఎరుపురంగుకు మారనిది ఈ రకమైన ఎండ్రికాయనే. వంద మిలియన్లలో ఒకటి దొరుకుతుందని, గత 30 సంవత్సరాలలో ఇంగ్లండ్‌లో మళ్లీ ఇటువంటి ఎండ్రికాయ దొరకలేదు.

Comments

comments