Home దునియా పురాణ గాథ: గౌతమ మహర్షి

పురాణ గాథ: గౌతమ మహర్షి

Gautama-Maharishi

రామాయణం ప్రకారం గౌతమ మహర్షి వేకువనే లేచి గంగా నదికి స్నానానికెళ్లడం అలవాటు, దేవతల రాజైన ఇంద్రుడు అహల్యను చూసి మనసు పారేసుకుంటాడు. కోడి రూపంలో వచ్చి ఇంద్రుడు తెల్లవారగానే కూయడంతో గంగానదికి గౌతమ మహర్షి స్నానానికి వెళ్తాడు. అతని రూపంలో వచ్చిన ఇంద్రుడు అహల్యను పొందుతాడు. 

సప్తరుషులలో గౌతమ మహర్షి ఒకడు. ఈయన పేరుతోనే గౌతమ గోత్రం ప్రసిద్ధికెక్కింది. అంగీరసుడి అనుయాయులలో ఒకరైన రాహుఘనుడి పుత్రుడు గౌతముడు. మంత్రాలను కనుగొన్న వారిలో గౌతముడు ప్రముఖుడు. అందుకే ఈయనను మంత్రదష్టుడు అంటారు. రుగ్వేదంలో చెప్పబడిన అనేక సూక్తాలు గౌతముడి పేరిట వచ్చాయి. దేవీభాగవతం ప్రకారం గోదావరి నదికి గౌతముడితో అనుబంధాన్ని పురస్కరించుకొని గౌతమి గోదావరి అనే పేరు వచ్చింది. సామవేదంలో చెప్పబడిన భద్రమంత్రం కూడా గౌతమ మహర్షి విరచితం. గౌతమ మహర్షి భార్య అహల్య బ్రహ్మదేవుడి మానస పుత్రిక.

గౌతమ మహర్షి అహల్యను ఏరకంగా వివాహం చేసుకున్నారు అన్న దానికి పురాణాల్లో ఒక కథ వుంది. భూ ప్రదక్షిణ చేసి వచ్చిన వారికే అహల్యను ఇచ్చి వివాహం చేస్తానని బ్రహ్మ చెబుతాడు. బ్రహ్మ పెట్టిన పోటీ మేరకు అహల్యను పొందటానికి గౌతమ మహర్షి భూ ప్రదక్షిణకు బదులుగా కామధేనువు చుట్టూ ప్రదక్షిణ చేసి, అహల్యను వివాహం చేసుకుంటాడు. గౌతముడికి వామదేవుడు నోధసుడు అని ఇద్దరు కుమారులు. వీరు కూడా మంత్రాలను కనుగొన్నవారే. మిథిలా నగరానికి రాజైన జనకుడి ఆస్థాన పురోహి తుడైన శతానందుడు కూడా అహల్య, గౌతమ మహర్షి పుత్రుడే. నారద పురాణం ప్రకారం 12 ఏళ్లు కరువు కాటకాలతో రాజ్యం అల్లాడినప్పుడు గౌతముడు రుషులందరికీ ఆహార పానీయాలు ఇచ్చి రక్షించాడని తెలుస్తోంది.

గౌతమ మహర్షి శిష్యుల్లో ప్రాచీన యోగ్యుడు శాండిల్యుడు, గారుద్యుడు, భరద్వాజుడు చెప్పుకోదగ్గవారు. రామాయణం ప్రకారం గౌతమ మహర్షి వేకువనే లేచి గంగా నదికి స్నానానికెళ్లడం అలవాటు, దేవతల రాజైన ఇంద్రుడు అహల్యను చూసి మనసు పారేసుకుంటాడు. కోడి రూపంలో వచ్చి ఇంద్రుడు తెల్లవారగానే కూయడంతో గంగానదికి గౌతమ మహర్షి స్నానానికి వెళ్తాడు. అతని రూపంలో వచ్చిన ఇంద్రుడు అహల్యను పొందుతాడు. స్నానానికి వెళ్లిన గౌతమ మహర్షి తిరిగి వచ్చి జరిగిన విషయాన్ని తెలుసుకొని అహల్యను రాయిగా మారిపొమ్మని శపిస్తాడు. ఇంద్రునికి ఒళ్లంతా కళ్లుగా మారిపోవాలని శాపమిస్తాడు. అప్పటినుంచి ఇంద్రుడు సహస్రాక్షుడిగా ప్రసిద్ధికెక్కాడు. అహల్య వేడుకోవడంతో రాముడి పాదస్పర్శతో తిరిగి స్త్రీగా మారతారని వరమిస్తాడు.