Home దునియా మంత్రాలకు చింతకాయలు రాల్తయా?

మంత్రాలకు చింతకాయలు రాల్తయా?

Frog's-Marriage

పోచవ్వకు జెరమచ్చింది. గీనడుమ పానం మంచిగుంటలేదు. అంత కుసురు కుసురుంటది. అయితె మంత్రగాన్ని తీసుకచ్చి మంత్రాలేపియ్యన్నని, దిగవోపియ్యన్నని ఆల్ల అత్త అంటంది. ఎపో నీయవ్వ మంత్రం లేదు గింత్రం లేదు కన్నాగురం మిషన్ దవాఖాన్ల జూపెడితే అదే తగ్గుతదని పోచవ్వ మొగడనె. అరే కొంరెల్లీ! మంత్రం లేదనకు బిడ్డ! ఊరుకు గత్తరత్తె మంత్రాలనతోనే పాయె. మన మేకల నర్సయ్య మంత్రమేత్తె ఏ రోగమైన దెంకపోతది. మంత్రమేసి కల్లుతోని మొక్కి తాయిత్తు గట్టిండంటె దయ్యం గియ్యం ఉరుకవుచ్చుకుంటయి. దయ్యం, భూతం, పిశాచమసోంటియి పడితెనే గిట్లయితది. ఎనుకట గీ వైద్యులు, మందులుండెనా? నాయిన్నవ్వా గప్పుడు గత్తరత్తె ఎంతమంది సచ్చిపోదురో ఎరికేనా? ఊళ్ళకూల్లు పీనుగుపెంటలేనాయె. గిప్పుడు గిట్ల కలరా రాకుంట మందలచ్చె. వత్తె తగ్గిచ్చుటానికి మందులచ్చె. గప్పుడు గా మంత్రాలతోని, పోచమ్మకు మైసమ్మకు సేసుడుతోని పొయ్యేటియనుకుంటె గవ్వన్ని ఉత్తయే! అన్నడు మలహరి.

మీ సదువుకున్న పోరగాండ్లకేమెరక తియ్యి. గట్లనే అంటరు. అయితె అవ్వను డాక్టర్‌కు సుపించకుంట మంత్రాలతోని నమ్మి సంపుకొమ్మంటవా? అన్నడు కోపంగ మలహరి. మల్హరీ! ఎవ్వల నమ్ముకాలాల్లయి. ముందు మంత్రగాని పిలిపిచ్చి గదేదో సేయించుండ్రి. తగ్గకుంటె దావఖాన్లకు తీసుకపోవచ్చు. అన్నడు మచ్చయ్య తాత. కొంరెల్లి అయ్య. తాత! నువ్వ గూడ గట్లనే అనవడ్తివి. నువ్వు మంత్రాలను నమ్మవు గద! అన్నమోలె నమ్ముడు నమ్మకపోవుడుగాదు. ముందుగాల గీ పనయితె గానియ్యి. మీ నాయినవ్వకు తురితుంటది. అటెనుక సూత్తాం అన్నమోలె సరేనన్నరు. మంత్రగాన్ని పిలిపిచ్చిరి. మంత్రాలేపిచ్చిరి. దిగ వోపిచ్చిరి. కల్లుసాక వోసిరి. కోడిని బలిచ్చిరి. బాగ తాగి ఉన్న కల్లును, కోన్ని పట్టుకొని మంత్రగాడువాయె. అది తగ్గనట్టే అనిపిచ్చె. మల్ల రొండ్రోజులకెప్పటాటేనాయె.

ఇగ గప్పుడు దావఖానకు తీసుకపెయిరి. పరీచ్చజేసి మందులిచ్చెడాక్టరు బలహీనతుందని రక్తం తక్కువుందని బలానికి గోలీలు రాసిచ్చె. ఇంకేమో రాసిచ్చె. కొన్నొద్దులల్ల పోచవ్వ మంచిగైంది. నాయిన్నవ్వా! మంత్రం మంత్రమని డాకుటరు దగ్గెరికి పోవద్దంటివి. గట్లనే ఉంటె మా అవ్వ సచ్చిపోయేది అన్నడు మలహరి. గా డాకుటరు మందులకు తగ్గిందనుకుంటన్నవా గది. అంతకు ముందు మంత్రాలేపిచ్చి మీదున్న దయ్యాన్ని పంపిచ్చెపటికెనే తగ్గింది. అన్నది ముసలవ్వ. తాతా గీ ముసలోల్లు గింతేకని మంత్రాలకు నువ్వు అన్ని తెలిసినోనివి గద. అన్ని సూసినోనివి. నాయినవ్వ లెక్కొ ఒక్కదాన్నే పట్టుకోనుండవు. గీటి సంగతి కొంచెం సెప్పలేవు. మరోపారోపారి మంత్రాలేత్తే, శివం తూలి సెప్పుతె కొన్ని నిజమైనట్టనిపిత్తయి. గిసోంటి సంగతుల గురించి సెప్పుతాత! నువ్వు సెప్పుతెనే నాకైతె నమ్ముకం. సెప్పు అన్నమోలె సెప్పవట్టిండు మచ్చయ్య తాత.

ఇగో మనువడా! నా అనుబవం కొద్ది సెప్పుతన్న. నేనేం సదువు శాత్రమచ్చినోన్ని గాదు. మంత్రాలకు చింతకాయలు రాల్తయా? అన్న సామెత వట్టిగేం బుట్టలేదు. మంత్రాలకు సింతకాయలు రాలయి. చింతచెట్టు కింద కూసోని, నిల్సొని ఎన్ని మంత్రాలు సదివినా ఒక్క సింతకాయ గూడ రాలది. అదే ఓ బండందుకొని ఇసిర్నవనుకో సింతకాయలేం కర్మ ఏ సెట్టుకాయలైన రాల్తయి. అంటె దానరుతమేందంటే అట్టి మాటల్తోని ఏంగాదు పనులతోనే అయితయని. అయితె మంత్రాలదంత తుంపిర్ల బలమేనని. మంత్రాలతోనే పనులయితె గా మాటలకు, కూతలకు బలముందే గీ దేశంల ఒగలమీదొగలు మంత్రాలేసుకొని ఒక్కలు గూడ బతుకకపోదురు. మంత్రాలకే బలముంటే ఒక్కపని జెయ్యకుండానే అన్నీ సాధించచ్చు. మరి మంత్రాలతోని రోగాలు, కొన్ని పనులు అయినట్టు కనిపిత్తయి కని అది మంత్రబలంతోని కాదు నమ్ముకంతోని. నాకు గయినె మంత్రమేత్తె తగ్గుతదన్న నమ్ముకంతోని ఒక్కొక్కపారి గది తగ్గినట్టనిపిత్తది కని తగ్గది. తగ్గినట్టనిపించినా గప్పటిది గప్పుడే అన్నట్టు. పంచాంగాలల్ల సెప్పేది గూడ గంతే. గివ్వన్ని ఒగలకు కడుపు నింపుటానికి కొందరికి బతుకు దెరువుకోసం ఏర్పడ్డయి. అయితే గీ మంత్రాలకు మన వేదాలల్లనే పునాదులున్నయంటరు. సెప్పంగ విన్న. గా వేదాలన్ని మంత్రాలేనట గద! గిసోంటియే అంటె మంత్రాలు, మయిమలు కొన్ని మూఢనమ్మకాలను పెంచిపోషించినయి. గసోంటిదే దేవుడు తూలుడు, అల్లువట్టుడు.

ఇగో మనం కప్పతల్లాడుతం సూడు. వానలెట్లపడుతయి? వానదేవుని దయతోని పడుతయనుకునెటోల్లం. దీనికో దేవుడుంటడనుకునేటోల్లం. కని వాలెట్ల వడుతయి మేఘాలచ్చి గవ్వి సల్లవడితె పడుతయంటరు. రుతుపవనాలో గవ్వేందో రావాలంటరు. కని మనం వానలు పడకుంటె ఏం జేత్తం? మృగశిర మెరువాలె మగ ఊరుమాలె. మృగ శిరనాడు సినుకు వడితె వానలు మంచిగ పడుతయంటరు. అసలేట్లె ముసలెడ్లు రంకెలు వెడుతయంటరు. గిట్ల నమ్ముకాలున్నయి. గివ్వన్ని సూసినాటి నుంచి అనుబవంకెల్లి వచ్చిన నమ్ముకాలు. పశువులు వానరాకడను పసిగడుతయంటరు. పక్షులు గూడ. కాని మనం వానలు సమయానికి పడకుంటె ఏం జేత్తం? విరాట పర్వం కథ జెప్పిత్తం. వానదేవుని బతుకమ్మ పాటలు పాడిపిత్తం. ఇంక కప్పతల్లాడుతం. రోకలికి కప్పను గట్టి దానిమీది నుంచి నీల్లు వోసుకుంట కప్పతల్లి కప్పతల్లి కడుపునిండే దొంతాల్ దొంతాల్ దొడ్డినిండే నాగండ్లకు వెయినోల్లు నవ్వుకుంటచ్చిరి. మోటలకు వోయినోల్లు మొత్తుకుంటచ్చిరి. వానచ్చరో ….. అని మొత్తుకుంట కప్పతల్లాడుతం. కప్పతల్లాడుతె వానత్తదా మరి? కని అదో నమ్ముకం. అదాడుతనే ఉంటం. ఎప్పుడన్న పిసికిపొయ్యి కప్పాతల్లాడిననాడే వానచ్చిందనకుకో ఇగో గీ కప్పతల్లాటతోనే వానచ్చిందని సంబురపడుతం.

ఏ నమ్ముకమైనా దాంతోని నష్టం కష్టం లేనంతవరకు నమ్ముతె ఫర్వలేదు. కప్పతల్లితోని వానపడకున్నా అది పల్లెటూరోల్లు, సదువురానోల్లు నమ్ముకంతో నాడుతరు. గదాన్తోని మనమేం ఫికర్‌పడద్దు. కని కొన్ని నమ్ముకాలున్నయి గవ్వి మనిషికి నష్టం దెచ్చేటియి. మనిషిని గోసవుచ్చుకునేటియి గసోంటియి నమ్మద్దు. ఆడివిల్లకు సముర్తయినంక లగ్గమైతె ఏదో నష్టం అయితదని అంటరు. ముప్పయేల్ల మొగోనికి మూడేండ్ల పిల్ల ననెటోల్లు. గివ్వెంత గోరం? చిన్నప్పుడే లగ్గాలను సెయ్యిమని సెప్పేటియి. మన దిక్కు లేదుగని మొగడు జచ్చిపోతే భర్తతోని బతికున్న పెండ్లాన్ని గూడ కాట్నంల గాల్చేటోల్లట. గిదెంత గోరం? ఇగ కొందరు యజ్ఞాలంటరు. మనం ఓపారి పెద్దపెల్లికి పొయ్యి యజ్ఞం సూసచ్చినం గద! యజ్ఞంతోని ఏమత్తదో కని గంధపు చెక్కలు, నెయ్యి గిట్ట మస్తు నాశినమైతది. యజ్ఞాలు జేత్తే వర్షాలు పడుతయంటె ఇగ ఎట్లనవ్వన్నో తెలువది. కని గది కొందరి నమ్ముకం. గట్ల వర్షాలు పడ్డంక ఇగ వానలు పడలేదన్న మాటే ఉండదు. యజ్ఞాలల్ల సదివే మంత్రబలంతోని వానలు వడితె మరి కరువు లెందుకుంట న్నయి? సెర్లెందుకు నిండుతలెవ్వు. యాట యజ్ఞం జేత్తె ఇగ అయిపోతది గద! గిట్ల రకరకాల నమ్ముకాలు. గా మూఢ నమ్ముకాలల్ల వడె మాతరమోల్లు గొట్టుకున్నరు. మీ నాయిన్న తరమోల్లు గూడ గంతే. మరి మీ తరమోల్లన్న కొంచెమంత బైటవడుతరేమొ బిడ్డ. మంత్రా లు లెవ్వు. గా మంత్రాలకు సింతకాయలు గూడ రాలయంటె ఇంకేమైత యో సూడు అని ఇడమర్సి సెప్పిండు మచ్చయ్య తాత. గిది యాభై యేండ్ల కింది సంగతి. నేను బడిపొల్లగానప్పుడు ఇన్న కత. కని గప్పటి మూఢనమ్ముకాలు ఏపాటి మారినయో ఎంతాలోసించినా సముజయిత లేదు. శనార్తి.

-డా ॥కాలువ మల్లయ్య, 98493 77578