Home దునియా కాకి బంగారం

కాకి బంగారం

Cartoons

‘లంచి అవరు.’ ఆఫీసులో పనిచేస్తున్న ఆ ముగ్గురు ఆడవారూ తమ తమ టిఫిన్ బాక్సుల్ని విప్పుకుని కూర్చున్నారు. బాసాసురుళ్ళ కోపాగ్నీ, అప్పుడప్పుడు కాల్చేసే మరో అగ్నిని తప్పించుకోవటానికీ, సెక్షన్ హెడ్‌లు సీనియర్ కొలీగ్స్ తమలో తాము వీరినుద్దేశించి విసురుతున్న వ్యంగ్యోక్తులకూ, తమ కింది వారు, ఆఫీసు బాయ్‌లు పైకి కనబరిచే ‘అతివినయాలకూ ఓ గంట పాటు ఆట విడుపు. ఆ ముగ్గురు ఆడవారు లంచి అవరుని లంచి చేయటానికే కాకుండా, తమ తమ సెక్షన్లలో, ఇళ్ళల్లో జరిగే విశేషాల్ని పంచుకోవటానికి కూడా వినియోగిస్తారు. ఒకరకంగా చెప్పాలంటే, ‘లంచ్ అవరు’ ఆ ఉద్యోగినుల పట్ల ‘లోకావలోకనం’!

ఆఫీసులో మొదటి మూడు గంటల శ్రమ బాధ, ఇంట్లో నిన్న సాయంత్రం మొదలు, నేటి ఉదయం, తిరిగి ఆఫీసుకు బయలుదేరే వరకు తమ అనుభవాలు, వాటిపై సహోద్యోగినుల అనునయాలు పంచుకునే అవరు. ఆ ఆఫీసులో విడిగా డైనింగ్ రూం ఆడవారికి లేకపోవటం వల్ల ఒంటి గంట కాగానే, ఫైళ్ళూ అవీ, కట్టేసి మిగతా ఇద్దరు వనజ బేబిల్ దగ్గరకు చేరుతారు. వనజది పెర్సనల్ అసిస్టెంటు ఉద్యోగం. ఆమె టేబిల్ మీద పేరుకుపోయే ఫైళ్ళ గుట్టలు ఉండవు. స్వింగు చెయిరు. సైడు టేబిలు ఉండటం వల్ల ఆమె టేబిల్ చాలా మేర ఖాళీగా ఉంటుంది. సైడు టేబిలు మీద ఓ కంప్యూటరు, ప్రింటరు ఉంటాయి. ఇదేకాకుండా, వనజ మిగతా ఇద్దరి కంటే వయసులో, పొజిషన్‌లో సీనియర్.

వనజకు 45ఏళ్లు. పెళ్లి అయింది. బి.టెక్ చదివే కొడు, అత్తామామలున్నారు. వాళ్ళాయన లా చేసి లీగల్ మేనేజర్‌గా పనిచేస్తాడు. ముభావి . ఎక్కువగా పైకి చెప్పుకోదు కాని, ఆర్థికపరమైన ఇబ్బందులు, దానికితోడు భర్త వేధింపులు ఉంటాయని ఆమె మాటల వల్ల తెలుస్తుంది. వయసుకు, పొజిషన్‌కు తగ్గ హుందాను కనబర్చే ప్రయత్నం చేస్తుంటుంది. జలజ గ్రాడ్యుయేటు. ఆ సంస్థ పర్చేజ్ సెక్షన్‌లో ఆమెకు ఉద్యోగం. హోల్‌సేల్‌గా వినియోగ వస్తువుల్ని కొనటం, రైల్వేల్లాంటి పెద్ద పెద్ద సంసథలకు అమ్మటం కొరకు దాన్ని స్థాపించారు. ఎక్కడెక్కడో తిరగటం, టెండర్ల సమాచారాన్ని సేకరించటం, ఏవైనా లొసుగులు తలెత్తితే, సరిదిద్దటం- ఆ సంస్థ యజమాని చూసుకుంటాడు. టెండర్లు టైపు చేయటం, సీల్డ్ కవర్లలో సబ్మిట్ చేయటం, టెండరు ఓపెనింగునాడు, ఒక్కోసారి అవసరాన్నిబట్టి ఆయా ఆఫీసులకు ఇతర దినాల్లో వెళ్లటం, మిగతా కంపెనీలు ఎలా ‘కోట్’ చేస్తాయో తెలుసుకోవటం, సేకరించిన ‘డాటా’ని ముందుముందు వాడుకోవటం జలజ డ్యూటీ.

ఆమెకు వనజ అంత సర్వీసు లేదు కాని బయట తిరగగలగటం వల్లో, అందుబాటులో ఉన్న సమాచారాన్ని బాగా ‘అనాలిసిస్’ చేయగలగటం వల్లో, ఆమె చురుకుదనం బయటకు కనబర్చుతుంది. జలజ తెలివైందిగా మిగతా ఇద్దరూ ఒప్పుకుంటారు. కొంత అతిశయం ప్రదర్శిస్తుంది జలజ. నిన్న చెప్పిన ఓ విషయాన్ని, అంతే సమర్థవంతంగా, నేడు ఖండించగలదు. రేపు అదే విషయాన్ని సమర్థవంతంగా నెత్తికెత్తుకోగలదు. అందుకే ఆమెను ‘వికటకవి’ అని, జలజ అన్ని పేరును ఎటు నుంచి తిప్పి చదివినా, అదే అర్థం వస్తుందని అంటారు. ఇలాంటి పొగడ్తలు వినటం జలజకూ, సంతోషంగానే ఉంటుంది.

జలజకు పెళ్లయింది. ఆమె భర్తకు సెక్రెటేరియట్‌లో ఉద్యోగం, సంతానం ఇంకా కలుగలేదు. అత్తామామలిద్దరూ సరూర్‌నగర్‌లోని “హోం ఫర్ ది ఏజ్డ్‌” లో ఉంటారు. ఖరీదైన చీరలు నగలు ధరిస్తుంది. తరచూ ఐదు నక్షత్రాల హోటళ్ళు, విందులూ, వినోదాల గురించి మాట్లాడుతుంది. నిజమెంతో తెలీదు కాని, వాళ్లాయన టేబిల్ పైనా, కిందా చేయ చాచుతాడనీ, జలజ కూడా ఒక్కోసారి టెండర్ల తయారీలో, ‘కాంపిటీటర్సు’తో చేతులు కలుపుతుందనీ, రేట్లను “లీక్‌” చేస్తుందని, అందుకే ఆమెకు ఖరీదైన చీరలు, నగలు బహుమతిగా వస్తాయని ఆఫీసులో చెవులు కొరుక్కుంటారు. ఇక శైలజ. మిగతా ఇద్దరి కంటే చిన్నది. జాయిన్ ఆమి ఏడాది కూడా కాలేదు. భోళా మనిషి. మనసులో ఏదీ దాచుకునే రకం కాదు నెమ్మదస్తురాలు. ఆమె అమ్మావాళ్లది, అత్తవాళ్లదీ భాగ్యనగరమే. భర్త అంతగా చదువుకోలేదు. అయితేనేం ఆస్థిపరులు.

శైలజ ఎస్టాబ్లిష్‌మెంటు సెక్షన్‌లో పనిచేస్తుంది. అవసరాల్ని బట్టి కొత్త ఉద్యోగుల్ని నియామకం చేయటం, ఉన్న ఉద్యోగుల రోజువారీ అటెండెన్సు, సెలవులు, ఇంక్రిమెంట్లు, క్రమశిక్షణా చర్యలు తీసుకోవటంలాంటివి ఆమె సెక్షను చూసుకుంటుంది. వాళ్లు కులవృత్తి రీత్యా పాల వ్యాపారం చేస్తారు. కొత్తగా పెళ్లయింది. ఓ పాత స్కూటర్ మీద ముందు రెండు పాల క్యాన్లతో ఆమె భర్త శైలజను దింపి వెళ్తాడు. ఆఫీసవగానే, బస్సులో ఇంటికి వెళ్తుంది.
ఆ రోజు వనజ చాలా విచారంగా ఉంది. అబ్బాయికి రావాల్సిన ర్యాంకు రాలేదట. భర్త సర్వీసు విడిచి ప్రాక్టీసులో సెటిల్ అవుదామనుకుంటున్నాడట. తల్లిదండ్రులు కొలీగ్స్ నిరుత్సాహపరుస్తున్నారట. అయినా, భర్త ఎవరి మాటా వినడనీ, ఎంత తోస్తే అంత చేసుకుపోతాడని, లక్షలు ఖర్చుపెడితేగాని ఆఫీసు, ఫర్నీచరు, వగైరా సమకూర్చుకోలేమని, పైపెచ్చూ, చేయ కుదిరేదాకా, తన ఒక్క జీతంతో ఇల్లు గడపాలి. హాస్టల్లో ఉంటున్న కొడుకు చదువుసాగాలి.

ఇవన్నీ వివరించినా వినటం లేదని, అలా వినకుండా ఆమె కుటుంబం లోగడ ఎంతో నష్టపోయిందని ఆమె వాపోతోంది. జలజ జవాబుగా, తన భర్త తన మాటే వింటాడనీ, గీచిన గీటు దాటడనీ, సంపాదన మొత్తం తెచ్చి తన చేతిలో పెడతాడనీ, తన ఆదుపాజ్ఞల్లోనే ఉంటాడనీ గర్వంగా చెబుతూ” మా ఆయన బంగారం” అంది. తనకు భర్త వద్ద అంతగా చనువులేదనీ, ఆ ఇంట్లో చదువుకుని ఉద్యోగం చేస్తున్నది తనొక్కర్తినేనని, ఒక్కోసారి అత్తామామలు, భర్త ఎకసెక్కాలాడుతుంటారనీ, అటువంట పనీ, ఇటు ఉద్యోగం-రెంటి మధ్య నలిగిపోతున్నానని కళ్ళనీళ్ల పర్యంతం అయింది శైలజ.
వనజ శైలజ వేపు సానుభూతిగా చూసింది తప్ప మరేం మాట్లాడలేదు. మధ్యతరగతి కుటుంబాల్లోని సాధక బాధకాలు ఆమెకు బాగా తెలుసు.

ఇలాంటి ఈతి బాధలు అందరి ఇళ్ళల్లోనూ ఉండేవే అని ఆమె అభిప్రాయం. జలజ మాత్రం అతిశయం ప్రదర్శించింది. మగవాళ్ళను ఆదుపాజ్ఞల్లో ఉంచుకోవాలనీ, కాస్త గడుసుతనం పెళుసూ చూపితే తప్ప వారు లొంగరని అంది. పెళ్లయిన కొత్తలోనే, తాను భర్తను ‘కట్టడి’ చేశానంది. ఇప్పటికే పండుగలకీ, పబ్బాలకీ ఆయన గుడ్డలు కూడా తనే సెలక్టు చేయాలంటాడంది. తన భర్త ఆదాయంతో తమకు కారు కొనుక్కునే స్థోమత ఉన్నా, ఆయనది గవర్నమెంటు ఉద్యోగం కనుక గవర్నమెంటు వారు అనుమతించకపోవటం వల్ల ఇంకా స్కూటరుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోంది అంటూ వాపోయింది.

వనజ శైలజలిద్దరూ జలజ వంక కొంచెం ఈర్షగా చూశారు. జలజకు కావల్సింది అదే! తన బంగారాన్ని తలచుకుని జలజ ఎంతో గర్వాన్ని ప్రదర్శించింది. ఆ రోజు శైలజ ఆఫీసు చేరేసరికి గంట లేటయ్యింది. ఇంట్లో ఏదో పేరంటం కార్యక్రమం. ఆమె అవసరం లేకపోయినా ఆమె అత్త ఆదేశం మేర ఇంట్లో ఉండాల్సి వచ్చింది. కార్యక్రమం అవగానే బస్సులో వెళ్తానంటే భర్త ఒప్పుకోలేదు. “బస్సెందుకు. పైసల్ దండుగ. వాడికపాలు పోసేందుకు నేను గూడ అటే వస్తున్న గద! ఆఫీసుకు జరంత లేటుగ పో ఏంగాదు” అన్నాడు. శైలజ అత్త కూడా భర్తనే సమర్థించింది.

“రోజూ ‘టైం’లనే పోతున్నావు గద! ఒక్క దినం ఆల్సెంగపోతే ఏమాయె” అంది.ఆఫీసుకు చేరిన శైలజకు ఆఫీసు వాతావరణం- ముఖ్యంగా పర్చేజ్‌సెక్షన్‌లో జలజ గంభీరంగా ఉన్నట్లనిపించింది. జలజ మాటిమాటికీ, కర్చీఫ్‌తో కళ్ళు అద్దుకుంటోంది. సెల్‌లో ఎవరితోనో మాట్లాడుతోంది. ‘ప్లీజ్’ అంటూ అభ్యర్థిస్తోంది. వనజ, ఇతర స్టాఫ్ మెంబర్లు తమ పని తాము చేసుకుపోతున్నా, జలజ వేపు ఓ చెవి వేసి ఉంచుతున్నారనిపిస్తోంది. ‘ఏం జరిగిందో..’ అనుకుంది శైలజ. వెళ్లి పలుకరిద్దామని అనుకుంది. జలజ తన కళ్ళతో శైలజను వారించింది. ఇదేదో పెర్సనల్ వ్యవహారం లాగుంది. లంచి వరకు ఆగుదాం అనుకుంది శైలజ. లంచి అవరు ఎప్పుడవుతుదా అన్న ఉత్కంఠతో కూర్చుంది. లంచి అవరు జలజ టిఫిన్ బాక్సు తెచ్చుకోలేదు. ‘రెండు బాక్సుల్నీ ముగ్గురం ‘షేర్’ చేసుకుందాం అక్కా’ అని శైలజ ప్రపోజ్ చేసినా వినలేదు. ఆఫీసు బాయ్‌తో ఇడ్లీ పార్సెలు తెప్పించుకుంది. అది కూడా ఆమెకు తినాలనిపించినట్లులేదు. కెలుకుతూ, అన్యమనస్కంగా కూర్చుంది.

వనజ, శైలజలు తరిచి తరిచి అడగ్గా, కళ్ళనీళ్ల పర్యంతం అవుతూ చెప్పింది. నిన్న రాత్రి జలజా వాళ్ళాయనా, మరెవరో అర్ధరాత్రి ప్రయాణం చేస్తున్నారట! పోలీసులు ఆపమన్నా, ఆపకుండా ఈయన స్కూటర్‌ను పరిగెత్తించాడట. ‘ఛేజ్’ చేసి పట్టుకున్నారట. “బ్రీత్ (Breath) అనాలిసిస్ పరీక్ష”లో మద్యం సేవించి స్కూటర్ నడుపుతున్నట్లు తేలిందట. జలజా వాళ్ళాయనా, ఆయన వెనక కూర్చున్న యువతి పోలీసు వారిని నానాదుర్భాషలాడారట. చేయిచేసుకున్నారట కూడా! దీంతో పోలీసు వారికి పట్టుదల పెరిగి సంఘటనని వీడియో తీశారట. స్కూటరు వెనక సిట్లో కూర్చున్నావిడ ‘కంపెనీ సరకు’ అని తేలిందట. మద్యం సేవించి వాహనం నడపటం, విధి నిర్వహణలో ఉన్న పోలీసు వారి మీద చేయి చేసుకోవటం, బ్రీత్ అనాలిసి పరీక్షకు సహకరించకపోవటం- ఇవన్నీ కాకుండా బ్రోతల్ యాక్టు కింద మరో కేసు- బుక్ చేసి ఆ ఇద్దరినీ లాకప్‌లో ఉంచారట. విషయం తెలుసుకున్న జలజ తనకు తెలిసిన నలుగురైదుగురు పోలీసు ఆఫీసర్ల సాయం వేడింది.

“మీ ఆయన పోలీసు వాళ్ళతో దెబ్బలాడి, కేసును జటిలం చేశాడు” అంటూ వాళ్ళు చేతులెత్తేశారట. “వేల రూపాయల జుర్మానా, కోర్టు కేసు, ఈ రెండే కాకుండా జైలు శిక్ష అంటున్నారు” అంటూ జలజ బోరుమంది. జలజా, వాళ్ళాయన నైజం కొంతవరకు తెలిసిన వనజ మాట్లాడలేదు. మౌనంగా ఉండిపోయింది. “బంగారం లాంటి బావ గారికి ఇలా జరిగిందేంటక్కా!” సానుభూతిని ధ్వనింపజేస్తూ, అమాయకంగా అడిగింది శైలజ. “అవును. ఆయన బంగారమే…. కాకి బంగారం..” ఈసడింపును గొంతులో ధ్వనింపజేస్తూ, వాష్‌బేసిన్ వైపు నడించింది జలజ. జలజ వాళ్ళాయన గురించి జలజ నోటనే, మరోలా వింటున్న శైలజ నివ్వెరపోతూ, అలానే ఉండిపోయింది కాసేపు.

– కూర చిదంబరం, సెల్ : 8885552423