Home జగిత్యాల జిల్లా అభివృద్ధిలో వారిద్దరూ..!

జిల్లా అభివృద్ధిలో వారిద్దరూ..!

అభివృద్ధ్దిలో జిల్లాను ఆదర్శంగా నిలిపేందుకు తపన పడుతున్న కలెక్టర్
ప్రజలకు చేరువై నేర రహిత సమాజం కోసం కృషి చేస్తున్న ఎస్‌పి
నాలుగు నెలల కాలంలోనే మెరుగైన ఫలితాలు
కలెక్టర్, ఎస్‌పికి ప్రశంసల వెల్లువ

District-Develop

జగిత్యాల: జగిత్యాల జిల్లా ఏర్పాటుతో పరిపాలనా సౌలభ్యంతో పాటు అధికారుల్లో జవాబుదారీ తనం చాల వరకు పెరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, జిల్లా ఎస్‌పి అనంతశర్మలు జిల్లాను అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు విశేష కృషి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ఎప్పటికప్పుడు వివిధ శాఖల అధికారులతో సమీక్ష చేస్తూ పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు విధుల పట్ల అంకితభావంతో పనిచేయాలని, లేదంటే ఇంటికి పంపిస్తానంటూ హెచ్చరిస్తున్నారు. పద్దతి మార్చుకోని వారికి శ్రీ ముఖాలు జారీ చేస్తున్నారు.

దాంతో అధికారుల్లో జవాబుదారీ తనం పెరిగి పనులు చకచకా సాగుతున్నాయి. జిల్లా ఎస్‌పి తనదైన శైలిలో పోలీస్ శాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన పక్షం రోజుల్లోనే జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌లను సందర్శించి అధికారులు, సిబ్బందికి మార్గదర్శనం చేశారు. జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందితో రెండు రోజుల పాటు సమావేశమై వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలందించేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. ప్రజలతో సన్నిహితంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, సమస్యలపై పోలీస్‌స్టేషన్లకు వచ్చే వారి పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సూచిస్తున్నారు. దాంతో చాల వరకు జిల్లా పోలీస్ శాఖలో మార్పు వచ్చింది. అటు కలెక్టర్… ఇటు ఎస్‌పి జిల్లా అభివృద్దిలో ముందుకు దూసుకుపోతూ పరిపాలనలో“ఇద్దరూ… ఇద్దరే” అనే మంచి పేరును సొంతం చేసుకుంటున్న నేపథ్యంలో “మనతెలంగాణ” అందిస్తున్న ప్రత్యేక కథనం…

జిల్లాను అన్ని రంగాల్లో ముందు నిలిపి ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కలెక్టర్ తపన పడుతున్నారు. కలెక్టర్‌గా డాక్టర్ ఎ.శరత్ బాధ్యతలు చేపట్టిన నుంచి మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగం దొరకడం అదృష్టమని, ప్రజలకు సాధ్యమైనంత మేర సేవలందించి వారి అభిమానాన్ని చూరగొనాలని అధికారులకు, సిబ్బందికి సూచిస్తున్నారు. కష్టపడి పనిచేసే వారిని అభినందిస్తూనే పని చేయని వారిని పద్దతి మార్చుకోవాలంటూ హెచ్చరిస్తున్నారు. రోజుకు రెండు మూడు శాఖలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ వారికి ఇచ్చిన లక్షాలను సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. తద్వారా జిల్లా ఏర్పడిన నాలుగు నెలల కాలంలోనే మెరుగైన ఫలితాలు వస్తున్నాయి.

జగిత్యాలను స్వచ్చ జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ నిర్ణయించారు. జిల్లాలోని ప్రతి కుటుంబం మరుగుదొడ్డి కలిగి ఉండాలని, జిల్లాలో ఇంకా నిర్మాణం కావాల్సిన 56,997 మరుగుదొడ్లను ఫిబ్రవరి 15లోపు నిర్మాణం జరిపి వంద శాతం పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. “స్వచ్చ మారథాన్‌” కార్యక్రమాన్ని చేపట్టి కేవలం 36 గంటల్లో 6 గ్రామాల్లో 820 మరుగుదొడ్లు నిర్మించి రికార్డు సృష్టించారు. మరుగుదొడ్ల నిర్మాణాలు దాదాపు పూర్తి కాగా జగిత్యాలను స్వచ్చ జిల్లాగా ప్రకటించుకోవడమే మిగిలింది.

హరితహరంలో భాగంగా జిల్లాలో 2016-17 సంవత్సరానికి 132 లక్షల మొక్కల పెంపకాన్ని లక్షంగా పెట్టుకుని నర్సరీల ద్వారా మొక్కలు పెంపకాన్ని ప్రారంభించారు. హరితహారంలో అన్ని శాఖల అధికారులను భాగస్వాములను చేస్తూ వారితో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మొక్కలు నాటేందుకు అనువైన స్థలాలను గుర్తించడంతో పాటు నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని సూచిస్తున్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పనులపై సంబంధిత అధికారులతో సమీక్ష చేస్తూ ఎప్పటికప్పుడు ఆయా పనులను పరిశీలిస్తూ నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేయాలని ఆదేశిస్తున్నారు. దాంతో పనులు చకచకా సాగుతున్నాయి.

ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలందేలా కలెక్టర్ ఎప్పటికప్పుడు ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీ చేస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. దాంతో ఆస్పత్రుల్లో గతంలో కంటే ప్రసవాల సంఖ్య చాల వరకు పెరిగింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచేందుకు చర్యలు చేపట్టారు. పదవతరగతి విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించడంతో పాటు వారికి దాతల సాయంతో స్నాక్స్ అందిస్తూ ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు హాస్టల్ నిద్ర అనే కార్యక్రమం ఏర్పాటు చేసి జిల్లా శాఖ అధికారుల ద్వారా వసతి గృహ సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు చేపట్టిన జమీన్‌బందీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జమీన్ బందీతో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారమవుతున్నాయి.

పోలీస్ శాఖలో వినూత్న మార్పులు:జగిత్యాల జిల్లా ఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన అనంతశర్మ జిల్లా పోలీస్ శాఖలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. వచ్చి రాగానే మహిళల రక్షణ కోసం తెలంగాణలోనే మొట్టమొదటి సారిగా జగిత్యాలలో మహిళా హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎక్కడైనా ఏదేని సంఘటన జరిగితే నిమిషాల్లో అక్కడికి చేరుకునేలా క్విక్‌రియాక్షన్ టీం (క్యూఆర్‌టి) ఏర్పాటైంది. విలేజ్ పోలీసింగ్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. విలేజ్ పోలీస్ డైరీ రూపొందించి ఆ డైరీలో ఆ గ్రామానికి సంబంధించిన అన్ని వివరాలను పొందుపరుస్తున్నారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి పోలీస్ శాఖ తరఫున ఆ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాలోని రౌడీషీటర్లతో సమావేశం నిర్వహించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని, పరివర్తన చెంది ఎలాంటి వివాదాలకు పోకుండా ఉన్న వారిపై రౌడీషీట్ తొలగిస్తామని చెబుతూ వారిని మంచి మార్గంలో నడిపించేందుకు కృషి చేస్తున్నారు.

గ్రామాల్లో భూ సమస్యలతో వివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో భూ సమస్యలను పరిష్కరించాలని ఎస్‌పి నిర్ణయించారు. భూ తగాదాలను సివిల్ మ్యాటర్‌గా పేర్కొంటూ పోలీసులు పట్టించుకోకపోవడం వల్ల తగాదాలు ముదురుతున్నాయని గుర్తించిన ఎస్‌పి వాటిపై దృష్టి సారించారు. మల్యాల మండలం దొంగలమర్రి వద్ద తరచూ దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ పోలీస్ చెక్‌పోస్టును ఏర్పాటు చేయడంతో పాటు మరో మొబైల్ చెక్‌పోస్టును ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్‌బాస్ స్థానంలో ఉన్నా తోటి సిబ్బందితో వాహనాల తనిఖీలో పాల్గొంటున్నారు. ఏదైనా అపద వచ్చినా… అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నా తనకు ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తానంటూ ఎస్‌పి ప్రజలకు తన ఫోన్ నెంబర్ ఇవ్వడం సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే మూడు నాలుగు అవినీతి, అక్రమ వ్యాపారాల గురించి ఎస్‌పికి ఫోన్ ద్వారా వివరించగా వారి ఆట కట్టించారు. తాజాగా నిరుద్యోగ యువతకు చేయూతనందించేందుకు మొదటి విడతగా జిల్లాలోని వంద మందికి ఉచిత ఆర్మీ రిక్రూట్‌మెంట్ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

జిల్లా కలెక్టర్, ఎస్‌పిలు ఒకరి కంటే ఒకరు ధీటుగా పనిచేస్తూ జిల్లాను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తుండటం పట్ల ప్రజల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. వారి ఆశయాలకు అనుగుణంగా జిల్లా అధికార యంత్రాంగం పనిచేస్తే జిల్లా రాష్ట్రంలో అగ్రగామిగా నిలుస్తుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.